బీజేపీకి తెలంగాణపై ప్రేమ లేదు.. బనకచర్లపై కేంద్రంతో పోరాటమే: MP వంశీ

బీజేపీకి తెలంగాణపై ప్రేమ లేదు.. బనకచర్లపై కేంద్రంతో పోరాటమే: MP వంశీ

పెద్దపల్లి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణపై ప్రేమ లేదని పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ అన్నారు. సోమవారం (జూలై 14) ఎంపీ వంశీ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగానికి ఎరువులను అందించేందుకు కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన 60 శాతం యూరియా కోటాను 30 శాతానికి తగ్గించడం అన్యాయమన్నారు.

తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న యూరియాను స్థానిక రైతాంగానికి  ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు తరలించడం సరైన విధానం కాదని దుయ్యబట్టారు. తెలంగాణకి ఇచ్చే కోటాను కేంద్రం ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలకు తరలిస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఫైర్ అయ్యారు. తెలంగాణ కేంద్రానికి రూపాయి ఇస్తుంటే.. కేంద్రం తిరిగి 30 పైసలు మాత్రమే మనకి ఇస్తోందన్నారు. 

తెలంగాణపై అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ప్రియారిటీ ఇస్తోందని.. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను రానున్న రోజుల్లో ఎక్కడికక్కడ ఎండగడతామని హెచ్చరించారు. తెలంగాణలో యూరియా కొరతపై కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్తానని.. తెలంగాణ రైతాంగానికి న్యాయం జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. 

►ALSO READ | కవిత గూండాలు దాడి చేశారు.. ఆమెపై చర్యలు తీసుకోండి

ఏపీ సీఎం చంద్ర బాబు అడగ్గానే 90 వేల కోట్ల ప్రాజెక్ట్ కేంద్రం ఓకే చేసిందని, మాజీ సీఎం కేసీఆర్ లాగే బాబు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని విమర్శించారు. సీడబ్ల్యూసీ ప్రకారం నీటి విషయం లో తెలంగాణకి అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. ఏపీ ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్రం ప్రభుత్వంపై పోరాడుతామని తెలిపారు.