Rajamouli: రాజమౌళి గ్లోబల్ సెన్సేషన్.. జపాన్ వీడియో గేమ్‌లో ప్రత్యేక పాత్ర, వైరల్ !

Rajamouli: రాజమౌళి గ్లోబల్ సెన్సేషన్..  జపాన్ వీడియో గేమ్‌లో ప్రత్యేక పాత్ర, వైరల్ !

దర్శకదీరుడు ఎస్.ఎస్. రాజమౌళిఎప్పుడూ తన సినిమాలతో కొత్త ట్రెండ్ లను సెట్ చేస్తారు. భారీ బడ్జెట్ లు, అద్భుతమైన విజువల్స్, భావోద్వేగపూరిత కథాంశాలతో రక్తికట్టిస్తారు.  బాహుబలి , RRR వంటి అసాధారణ విజయవంతమైన చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.  రాజమౌళి సృజనాత్మక ప్రభావం కేవలం భారతీయ సినిమాకు మాత్రమే పరిమితం కాదు. ఇప్పుడు జపాన్‌లోని అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వీడియో గేమ్ – డెత్ స్ట్రాండింగ్ 2: ఆన్ ది బీచ్లో ఒక ఊహించని క్యామియోతో వార్తల్లో నిలుస్తున్నారు. లెజెండరీ గేమ్ క్రియేటర్ హిడియో కోజిమా రూపొందించిన ఈ గేమ్, ఇంటరాక్టివ్ మీడియాలో కథన శైలిని కొత్త పుంతలు తొక్కిస్తున్నందుకు పేరుగాంచింది. ఈ గేమ్‌లో రాజమౌళి కనిపించడం భారతీయ సినిమాకు, గ్లోబల్ గేమింగ్‌కు మధ్య ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక అనుసంధానాన్ని సూచిస్తుందంటున్నాయి సినీ వర్గాలు .

గతంలో RRR ప్రమోషన్స్ కోసం రాజమౌళి తన బృందంతో జపాన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కోజిమాను కలిశారు. ఆ సమయంలో, కోజిమా రాజమౌళిని స్కాన్ చేశారు. ఈ స్కానింగ్ భవిష్యత్తులో గేమ్‌లో ఒక డిజిటల్ పాత్రను సృష్టించడానికి ఉద్దేశించబడింది. కోజిమా స్వయంగా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా దీనిని ధృవీకరించారు, "డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి KJPని సందర్శించారు. మేము అతన్ని స్కాన్ చేశాము. RRR" అని రాశారు. ఈ పోస్ట్‌తో పాటు, కోజిమా ప్రొడక్షన్స్‌లో రాజమౌళిని స్కాన్ చేస్తున్నప్పటి తెరవెనుక ఫోటోలు కూడా పోస్ట్ చేశారు. దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీంశమై..  వైరల్ అవుతుంది.

 

దీనిపై రాజమౌళి స్పందిస్తూ.. , "RRR ప్రమోషన్స్ కోసం జపాన్‌లో ఉన్నప్పుడు కోజిమా-సాన్ కార్యాలయాన్ని సందర్శించాను. అతను నన్ను అక్కడ స్కాన్ చేశాడు, నిజం చెప్పాలంటే, అతను దానిని ఎలా లేదా ఎక్కడ ఉపయోగిస్తాడో నాకు అస్సలు తెలియదు. ఏదో ఒక మాజికల్ విషయం జరుగుతోందని మాత్రమే నాకు అనిపించింది. ఇప్పుడు నేను డెత్ స్ట్రాండింగ్ 2లో కనిపించడం నిజంగా ఒక గౌరవం. కోజిమా-సాన్ ఒక విజనరీ, అతని అసాధారణ ప్రపంచంలో నేను ఒక చిన్న భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. దీంతో  రాజమౌళిని గేమ్‌లోకి తీసుకోవడం భారతీయ జపనీస్ వినోద సంస్కృతుల మధ్య పెరుగుతున్న బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని సోషల్ మీడియాలో అభిమానులు పోస్ట్ చేస్తున్నారు.

►ALSO READ | నల్ల రంగు వివక్షపై మాట్లాడి.. మిస్ పుదుచ్చేరిగా గెలిచింది.. : 25 ఏళ్ల మోడల్ ఆత్మహత్య మిస్టరీ ఏంటీ..?

ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి 'SSMB29' ప్రాజెక్ట్  దృష్టిపెట్టారు.  గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఈ  సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.