ఆధ్యాత్మికం: కోరికలు అదుపులో లేకపోతే ఏం జరుగుతుంది.. శ్రీకృష్ణుడు చెప్పింది ఇదే..!

 ఆధ్యాత్మికం:  కోరికలు అదుపులో లేకపోతే ఏం జరుగుతుంది.. శ్రీకృష్ణుడు చెప్పింది ఇదే..!

తామనుకున్నదానికన్నా భిన్నంగా ఎవరైనా చెప్పినప్పుడు, అంగీకరించటానికి మనస్కరించదు. అందులోనూ ముఖ్యంగా తను ఎవరి మాటని పరమ ప్రమాణంగా పరిగణిస్తాడో అటువంటి వారు చెప్పినప్పుడు ఒప్పుకొమ్మని బుద్ధి చెపుతుంటే, మనసు వెనకాడుతూ ఉంటుంది. తమకి అనుకూలంగా చెప్పేవరకు తరచి తరచి ప్రశ్నిస్తూనే ఉంటారు.

అర్జునుడు కూడా అదేవిధంగా కృష్ణుణ్ణి ప్రశ్నించాడు."ప్రకృతి మానవులచేత పనిచేయిస్తూ ఉంటుందని చెప్పావు కదా. అప్పుడు మానవులు తమంతట తాము ఏమీ చేయనప్పుడు పాపకార్యాలు ఎట్లా చేస్తున్నారు? మానవులు పాపకార్యాలని ఎవరో తమ చేత బలవంతంగా చేయిస్తున్నట్లు, చేయక తప్పని విధంగా తమకి ఇష్టం ఉన్నా లేకపోయినా చేస్తున్నారు? దానికి కారణం ఎవరు?"ఇటువంటి సందేహాలు చాలామందికి కలుగుతూ. ఉంటాయి. తమకి అంతా తెలుసనుకోవటం ఒక కారణం అయితే, తెలుసుకోవాలనుకోవటం మరొక కారణం. చిక్కుముడిలాగా కనిపించే ఈ అంశాన్ని వివరించి చెప్పటం తన కర్తవ్యం అనుకున్నాడు. జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ.

మానవుల చేత పని చేయించే ప్రకృతి నుండి త్రిగుణాలు ఉద్భవిస్తున్నాయి. వాటిలో రజో గుణం వల్ల కామము, క్రోధము పుడుతున్నాయి. ఇవి వంట చేయటానికి పనికి వచ్చే నిప్పు వంటివి. నిప్పు కావాలని కట్టెలని రాజబెట్టినప్పుడు మంటతో పాటు పొగ, నుసి, బూడిద కూడా పుట్టక తప్పదు. ఇవి పనికి రానివి అని అనుకుంటాం. కాని, వాటి వల్ల కూడా ప్రయోజనం ఉంది. అవి ఆకలి వంటివి ..ఆకలి అవసరమే  కాని, అది తీరటానికి ఆహారం అవసరం. మంట ద్రవ్యాన్ని హరించి భస్మం చేసినట్టు ఆకలి ఆహారాన్ని దహించి శక్తినిస్తుంది. ఈ క్రమంలో మంట నుండి పొగ, బూడిద కలిగినట్టు ప్రకృతి నుండి కామ క్రోధాలు పుడుతున్నాయి. ఇవి హరించే స్వభావం కలవి కనుక వికాసానికి ప్రతికూలంగా ఉండి పాపకారణాలు అవుతున్నాయి..

ఆహారం వండుకోవటానికి అవసరమైన నిప్పు కావాలంటే పొగ తప్పనట్టే, జీవితం ఉంటే రాగ ద్వేషాలు తప్పవు. అవి ఉంటే వికాసం మందగిస్తుంది. పూర్తిగా పోదు... కప్పబడి ఉంటుంది. దీనికి చక్కని ఉపమానం చెపుతాడు కృష్ణుడు.అద్దంపైన దుమ్ము పడినప్పుడు అద్దం సరిగా కనపడదు. అంతమాత్రాన అద్దం తన గుణాన్ని కోల్పోయినట్టు కాదు. మసక బారింది. అంతే తుడిచి శుభ్రం చేస్తే సహజ వికాసాన్ని పొందుతుంది.

అదేవిధంగా జీవి, తల్లి కడుపులో పడి, పెరగాలంటే మావి తప్పని సరి. కాని.. ఆ పొరని చీల్చుకుంటేనే భూమి మీద జన్మిస్తుంది. గర్భంలో పెరగటానికి అవసరమైన మావి.. లేదా మాయ భూమిపై పడటానికి అడ్డుగా ఉంటోంది. బిడ్డ కెవ్వుమన్నాక మాయని తొలగిస్తారు. 

ఒకప్పటి అవసరం. ..తరువాత అనవసరం మాత్రమే కాదు.. అడ్డు కూడాను. సరిగా చెప్పాలంటే ప్రాణాంతకం. అదేవిధంగా కోడి, పక్షుల గుడ్లు పెరిగే సమయంలో పైన ఉన్న పెంకు రక్షణని కల్పిస్తుంది. కాని  తగినంత ఎదిగిన తర్వాత దానిని పగలకొట్టి బయటకు వస్తే కాని తనకి బ్రతుకు ఉండదు.ఈ ఉదాహరణలు చాలు కదా, సత్యం తెలియటానికి, కప్పిన పొరని తొలగించాలని. అద్దం మీద దుమ్ముని తుడిచినట్టే, శిశువు పైన ఉన్న మాయ పొరని తొలగించినట్టే. కామ క్రోధాలని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండాలి. 

నిప్పు బాగా మండాలంటే బూడిదని ఊదుతారు కదా. మసక బారేట్టు కప్పిన పొర అజ్ఞానం పొర లోపలకోరికలు అదుపులో ఉంటే ..ఉన్నది జ్ఞానం. అజ్ఞానం కామ క్రోధాల రూపంలో వ్యక్తం అవుతూ ఉంటుంది. (ఇక్కడ అర్ధం చేసుకోవలసినది. ఏమంటే, అందరికీ జ్ఞానం ఉంది. కాని కామ క్రోధ రూపమైన అజ్ఞానం ఈ జ్ఞానాన్ని ఆవరించి వ్యక్తం కాకుండా చేస్తుంది. మావిని, గుడ్డుపై ఉన్న పెంకుని వాటి పని అయిన తరువాత తొలగించినట్టు కామ క్రోధాలని తొలగించాలి. 

మనసులో పుట్టిన కోరికని తీర్చుకుంటే పోతుంది కదా అనే వాదన కూడా ఉంది. కాని, తీరుస్తున్న కొద్దీ కోరికలు పెరుగుతాయి. మంటని చల్లార్చటానికి నెయ్యి పోస్తే పెరుగుతుంది కాని తరగదు కదా. మంట చల్లారటానికి నీళ్ళు పొయ్యాలి. అందువల్ల జీవనయానం సాగించటానికి అవసరమైనవి తీర్చటం.. నీళ్ళు చల్లటం అయితే  కోరినవన్నీ తీర్చటం నెయ్యి పొయ్యటం వంటిది. ఈ విధంగా చేస్తుంటే కోరికలు చెలరేగటం క్రమంగా తగ్గుతుంది. పాపకారణమైన తృష్ణ చల్లారుతుంది. 

తినేది నాలుకతోనే అయినా రుచిని ఆస్వాదించేది మనను. జీర్ణకోశానికి ఆహారం కావాలి. ఆకలిలో ఈ రెండు ఉంటాయి. ఆకలికి తగిన ఆహారం తీసుకోవటం. అవసరం. జిహ్వ కోరినవన్నీ తింటూ ఉంటే, రుచులు ఇంకా ఇంకా పెరిగి పోతూ ఉంటాయి.సమయం. ధనం. ఆరోగ్యం ఖర్చవుతూ ఉంటాయి.

►ALSO READ | Vastu Tips : దక్షిణం వాకిలికి బాత్ రూం ఏ వైపు ఉండాలి.. రెండు దిక్కుల్లో రోడ్డు ఇంటికి వరండా క్లోజ్ చేయాలా..?

కోరికలు పుట్టే స్థానం ఇంద్రియాలు, వాటిని ప్రేరేపించే మనసు, వాటిలో చిక్కుకుపోయిన బుద్ధి కోరికలకి కారణమైన అజ్ఞానం మోహాన్ని కలిగించి, పాపానికి ప్రేరేపిస్తుంది. అందువలన ముందు చేయవలసిన పని.. ఇంద్రియాలు కోరినవన్నీ అందవు అని మనసుకి తెలియటం దానితో మనసు మౌనం వహిస్తుంది. ఇంద్రియాలు, మనసు మనిషి ఆధీనంలో ఉంటాయి. అప్పుడు పాపాచరణకి అవకాశం ఉండదు.
శరీరావయవాల కన్నా ఇంద్రియాలు, వాటి కన్నామనను, మనసు కన్నా బుద్ధి ఎక్కువ చైతన్యవంతంగా ఉంటాయి. బుద్ధి కన్నా ఎక్కువ చైతన్యవంతం నువ్వే. నీ కన్నా కూడా ఎక్కువ నీలో ఉన్నవాడు (అంతర్యామి) అంటాడు కృష్ణుడు.

జీవుడికి మిగిలినవన్నీ ఉపకరణాలు లోపల ఉన్నవాడు. సువ్వే అని గుర్తు చేసుకుంటూ ఉంటే నువ్వే తానుగా మారిపోవటం జరుగుతుంది. ఈ స్థితిని ఆత్మ స్థితి అంటారు. తానే అతడు అని గుర్తుంచుకోవటం తనని తాను ఉద్ధరించుకోవటం.. ఈ విధంగా చేస్తే కోరికల రూపంలో వచ్చే శత్రువుని గెలవొచ్చు. ఇక పాపాచరణకి తావు ఎక్కడ?

అర్జునుడి ప్రశ్నకి సమాధానం ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రకృతి నుండి త్రిగుణాలు పుట్టి మానవుల చేత ఈ పనులు చేయిస్తున్నాయి. త్రిగుణాలలో రజోగుణం నుండి కామక్రోధాలు పుట్టి పాపాచరణకి కారణం అవుతున్నాయి. కనుక కోరికలని అదుపులో పెట్టుకుంటే తానే పరమాత్మస్వరూపుడవుతాడని పండితులు చెబుతున్నారు.