
‘‘కేసీఆర్ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టు టెండర్లలో చూపించిన ఆసక్తిని పనుల నాణ్యతలో చూపించలేదు. అందుకే కన్నెపల్లి, అన్నారం పంప్‌హౌస్‌లు నీట మునిగాయి. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు దెబ్బతిన్నాయి” అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ‘‘2022 ఏప్రిల్ 28న మేడిగడ్డ బ్యారేజీలో సమస్య ఉందని ఇరిగేషన్ ఈఈ లేఖ రాశారు. వెంటనే సర్కారు ఎందుకు రిపేర్లు చేపట్టలేదు. ఒకవేళ మరమ్మతులు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. రిపేర్లు చేస్తే తమకు పర్సనల్‌గా ఎలాంటి లాభం ఉండదనే సర్కారు పెద్దలు పట్టించుకోలేదు” అని పొంగులేటి ఆరోపించారు.
ఇది ఒకటో, రెండో పిల్లర్లతో ఆగదని, రాఫ్ట్ కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయినప్పుడల్లా పిల్లర్లు భూమిలోకి కుంగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరిలో వరదలు వచ్చినపుడు కన్నెపల్లి పంప్‌హౌస్ దగ్గర కట్టిన స్టాప్ లాక్ గేట్లు ఎందుకు పనిచేయలేదని, పని చేయకపోతే అందుకు సంబంధించిన ఆఫీసర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ‘‘మేడిగడ్డ నుంచి ఫస్ట్ 50 టీఎంసీ నీరు లిఫ్ట్ చేశారు.
మూడో బ్యారేజ్ వద్ద 41 టీఎంసీ లు లిఫ్ట్ చేశారు, మిగతా 9 టీఎంసీల నీరు ఎక్కడ వాడారు. ఇంత కరెంట్ ఖర్చు చేసి లిఫ్ట్ చేసిన నీరు మళ్లీ గోదారిలో వదిలేశారా? మరి మూడో టీఎంసీ నీటి వినియోగానికి ఎందుకు నామినేషన్ పద్ధతిలో పనులు మొదలు పెట్టారు. టన్నెల్‌ను కాదని ఆగమేఘాల మీద పైపు లైన్ వేశారు.. ఈ అంశాలన్నింటిపైనా తగిన చర్యలు చేపట్టాలి’’ అని చెప్పారు.