మండలానికో ఎంఈవో ఆఫీస్ ఎందుకు పెట్టలే? కేసీఆర్​ను ప్రశ్నించిన ఎమ్మెల్సీ ఏవీఎన్​రెడ్డి

మండలానికో ఎంఈవో ఆఫీస్ ఎందుకు పెట్టలే?  కేసీఆర్​ను ప్రశ్నించిన ఎమ్మెల్సీ ఏవీఎన్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు : మండలానికో పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో ఆఫీస్ ఏర్పా టు చేసిన సీఎం కేసీఆర్.. ఎంఈవో ఆఫీస్ ఎందుకు పెట్టడం లేదని బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 18 మంది ఎంఈవోలు మాత్రమే రెగ్యులర్ పనిచేస్తున్నారన్నారు. మిగిలిన మండలాలకు హెచ్​ఎంలను ఇన్​చార్జ్​లుగా పెట్టారని వివరించారు. శుక్రవారం హైదరాబాద్​లో తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంతరావు, నవాత్ సురేశ్​తో కలిసి ఏవీఎన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. స్కూల్ నుంచి యూనివర్సిటీల్లో పనిచేసే ఏ ఉద్యోగి కూడా సంతోషంగా లేరన్నారు. ఒకప్పుడు ఒకటో తేదీన జీతం వచ్చేదని, కానీ ఇప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈఎంఐ చెల్లింపుల్లో టీచర్లు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారన్నారు. ఈపీఎఫ్ డబ్బులు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. పీఆర్సీ, డీఏ బకాయిలు, మెడికల్ బిల్స్, సప్లిమెంటరీ వేతనాలకు ట్రెజరీ డిపార్ట్​మెంట్ ఆమోదం తెలిపినా ప్రభుత్వం రిలీజ్ చేయడం లేదన్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని టీచర్లకు బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ నిర్వహించాలని కోరారు.