ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్​లో ఎందుకు మాట్లాడలే : గాలి వినోద్ కుమార్

ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్​లో ఎందుకు మాట్లాడలే : గాలి వినోద్ కుమార్

ఓయూ, వెలుగు: లిక్కర్​స్కాం విషయాన్ని పక్కదారి పట్టించేందుకే ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేషన్​బిల్లు అంశాన్ని తెరపైకి తెచ్చారని దక్షిణ భారత సమితి కన్వీనర్​ప్రొఫెసర్​గాలి వినోద్​కుమార్​ఆరోపించారు. ఆదివారం ఆయన తార్నాకలో మీడియాతో మాట్లాడారు. గతంలో ఐదేండ్లు ఎంపీగా ఉన్న కవిత ఏనాడైనా పార్లమెంట్​లో మహిళా బిల్లు గురించి ప్రస్తావించారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వ తొలి మంత్రి వర్గంలో మహిళలకు చోటు ఇవ్వనప్పుడు ఎందుకు మాట్లాడలేదన్నారు. తొమ్మిదేండ్లుగా రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉండి కూడా ఏనాడూ మహిళా రిజర్వేషన్​బిల్లుపై నోరు మెదని కవిత.. ఉన్నట్టుండి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు పూనుకోవడం వెనకున్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలు జరిగినప్పుడు స్పందించని ఆమెకు మహిళలపై ఇంత ప్రేమ ఏర్పడడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. లిక్కర్ స్కాంలో అరెస్ట్ అవుతాననే భయంతోనే కొత్త నాటకాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. నిజంగా బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే 50 శాతం అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు మహిళలకు ఇవ్వాలని డిమాండ్​చేశారు. అలాగే 50 శాతం మహిళలని పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా నియమించాలని, మంత్రి వర్గంలో 50 శాతం మహిళలకు అవకాశం ఇవ్వాలని కోరారు. ముందు ఇవన్నీ అమలు చేయించి అప్పుడు మహిళా బిల్లు కోసం ఢిల్లీలో ధర్నా చేపట్టాలని హితవు పలికారు.