టీఆర్ఎస్‌‌కు సొంత జిల్లాలో ఎందుకిలా?

టీఆర్ఎస్‌‌కు సొంత జిల్లాలో ఎందుకిలా?

 

తెలంగాణ ఉద్యమం నాటి నుంచి సిద్దిపేట  ప్రాంత జనం కేసీఆర్ కు, టీఆర్ఎస్​కు బ్రహ్మరథం పట్టారు. రాష్ట్రం వచ్చాక కూడా కేసీఆర్​ ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతించారు. కానీ తొలిసారి దుబ్బాక జనం కేసీఆర్​ లీడర్ షిప్ ను వ్యతిరేకించారు. ఏ చిన్న పనికైనా ప్రతిరోజు అటు సిద్దిపేటకు, ఇటు గజ్వేల్ కు వెళ్లే ఇక్కడి జనం ఇలా ఎందుకు చేశారన్న దానిపై టీఆర్ఎస్​ పెద్దలు ఆరా తీసే పనిలో పడ్డారు. కేసీఆర్ పాలనను సొంత జిల్లా ప్రజలే వ్యతిరేకిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా జనం ఎలా మద్దతు తెలుపుతారనే ప్రశ్న టీఆర్ఎస్ లీడర్లలో మొదలైంది. కేసీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని జనం స్వాగతిస్తారని భావించడం సరికాదని, దీనిపై దుబ్బాక తీర్పును ఒక సంకేతంగా తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్  పార్టీకి పెద్ద షాక్ తగిలింది. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుల సొంత జిల్లా జనమే వారి పాలన పట్ల వ్యతిరేక తీర్పు చెప్పడం సంచలనంగా మారింది. దుబ్బాకలో లక్ష మెజార్టీతో గెలుస్తామని చెప్పుకున్న ఆ పార్టీ నేతలు రిజల్ట్  చూసి కంగు తిన్నారు. పార్టీ శ్రేణులు కూడా పూర్తిగా సైలెంట్​ అయిపోయాయి. పార్టీ పెద్దలు బీజేపీ ఇచ్చిన షాక్​ను జీర్ణించుకోలేకపోతున్నారని టీఆర్ఎస్​ వర్గాలే పేర్కొంటున్నాయి. కేసీఆర్ వ్యవహారిస్తున్న తీరుతో జనంలో వ్యతిరేకత పెరుగుతోందని, అది దుబ్బాకలో ఎఫెక్ట్​ చూపిందని అభిప్రాయపడ్డాయి.

ఆరేండ్లలో..

రాష్ట్ర ఏర్పాటు తర్వాతి నుంచి కూడా టీఆర్ఎస్ కు తాజా దుబ్బాక రిజల్ట్​ పెద్ద షాక్  ఇచ్చింది. 2019 పార్లమెంట్  ఎన్నికల్లో బీజేపీ నాలుగు లోక్​సభ సీట్లను గెలుచుకోవడంతో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలినా పెద్ద సీరియస్​గా తీసుకోలేదు. పైగా 2014లో ఐదు ఎమ్మెల్యే సీట్లున్న బీజేపీ.. 2018లో ఒక్క సీటుకు పరిమితమైందని ఎగతాళి చేసింది. అలాంటిది ఇప్పుడు ఒకవైపు కేసీఆర్​ సెగ్మెంట్​ గజ్వేల్, మరోవైపు హరీశ్​రావు సెగ్మెంట్​ సిద్దిపేటకు ఆనుకుని ఉన్న దుబ్బాక ప్రజలు ఇలా షాక్​ ఇవ్వడాన్ని టీఆర్ఎస్ పెద్దలు తట్టుకోలేకపోతున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక 32 జిల్లా పరిషత్ లు, పెద్ద ఎత్తున మున్పిపాల్టీలు, కార్పొరేషన్లను గెలిచామని, అలాగే దుబ్బాకలోనూ గెలుస్తామన్న వారి అంచనా తప్పడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

కొంపముంచిన ఓవర్ కాన్ఫిడెన్స్?

టీఆర్ఎస్ లీడర్ల ఓవర్ కాన్ఫిడెన్సే వారి కొంపముంచిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామన్న నేతలు మొదట్లో బీజేపీ తమకు పోటీయే కాదన్నట్టుగా వ్యవహరించారు. బీజేపీ, పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సంక్షేమ పథకాలే తమకు ఓట్లు కురిపిస్తాయని ప్రకటించారు. రైతుబంధు, రైతు బీమా, ఆసరా, కల్యాణి లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులంతా తమకే ఓటేస్తారని అంచనా వేసుకున్నారు. మంత్రి హరీశ్​రావు అయితే తానే క్యాండిడేట్​ అనుకుని ఓట్లు వేయాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేశారు. కానీ పోలింగ్​ దగ్గరపడే నాటికి బీజేపీకి, రఘునందన్​రావుకు ప్రజల్లో సపోర్ట్​ పెరుగుతోందని టీఆర్ఎస్​కు తెలిసొచ్చింది.

కేడర్ లో అసంతృప్తి దెబ్బకొట్టిందా?

రాష్ట్రం వచ్చినప్పట్నుంచీ దుబ్బాకలో తమకు సరైన న్యాయం జరగలేదని పార్టీ కేడర్​ ఆవేదనలో ఉంది. ఎమ్మెల్యే తన అనుచరులకు మాత్రమే ప్రయార్టీ ఇ చ్చారని, మిగతా నేతలు, కార్యకర్తలను విస్మరించారన్న ప్రచారం ఉంది. ఈ విషయాన్ని పార్టీ పెద్దలకు చెప్పుకునే అవకాశం కూడా లేకపోవడంతో కేడర్​లో నిరాశ నెలకొందని పార్టీవర్గాలు చెప్తున్నాయి. పార్టీ పెద్దలకు ఎలక్షన్​ టైంలో మాత్రమే కేడర్ గుర్తుకు వస్తుందని, మిగతా టైంలో పట్టించుకోలేదని కొందరు అసంతృప్తిగా ఉన్నారని అంటున్నాయి. ఇది కూడా ఎఫెక్ట్​ చూపి ఉంటుందన్నాయి.

డెవలప్​మెంట్​ ఎక్కడ?

అభివృద్ధికి నోచుకోలేని దుబ్బాక ప్రజల్లో అసంతృప్తి ఉంది. పొరుగునున్న సిద్దిపేట, గజ్వేల్​లలో జరిగిన డెవలప్​మెంట్​ తమ నియోజకవర్గంలో ఎందుకు జరగలేదన్న ప్రశ్నలు మొదలయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్ కూడా  క్యాంపెయిన్​లో ఈ విషయాన్ని గట్టిగా ప్రస్తావించా యి. ఇది జనంలోకి వెళ్లింది. ఇప్పట్నుంచి నియోజకవర్గాన్ని డెవలప్​ చేస్తామని హరీశ్ రావు చేసిన ప్రకటనలను జనం నమ్మలేదు.

కేసీఆర్ కు రిజల్ట్​పై ముందే అంచనా ఉందా?

పార్టీ ఓడిపోతుందన్న విషయంపై కేసీఆర్ కు ముందే అంచనా ఉందని టీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. ప్రతి ఎన్నికను సీరియస్ గా తీసుకునే సీఎం.. ఓడిపోయే పరిస్థితి ఉందని తెలిసే దుబ్బాక ప్రచారానికి దూరంగా ఉన్నారని వినిపిస్తోంది. కేటీఆర్  కూడా ప్రచారానికి వెళ్లకుండా.. హైదరాబాద్ లో డిపార్ట్ మెంట్ రివ్యూలకు పరిమితం కావడం వెనుక ఆంతర్యం ఏమిటన్న చర్చ కూడా జరుగుతోంది.

సొంత జిల్లాలో ఎందుకిలా?

తెలంగాణ ఉద్యమం నాటి నుంచి సిద్దిపేట  ప్రాంత జనం కేసీఆర్ కు, టీఆర్ఎస్​కు బ్రహ్మరథం పట్టారు. రాష్ట్రం వచ్చాక కూడా కేసీఆర్​ ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతించారు. కానీ తొలిసారి దుబ్బాక జనం కేసీఆర్​ లీడర్ షిప్ ను వ్యతిరేకించారు. ఏ చిన్న పనికైనా ప్రతిరోజు అటు సిద్దిపేటకు, ఇటు గజ్వేల్ కు వెళ్లే ఇక్కడి జనం ఇలా ఎందుకు చేశారన్న దానిపై టీఆర్ఎస్​ పెద్దలు ఆరా తీసే పనిలో పడ్డారు. కేసీఆర్ పాలనను సొంత జిల్లా ప్రజలే వ్యతిరేకిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా జనం ఎలా మద్దతు తెలుపుతారనే ప్రశ్న టీఆర్ఎస్ లీడర్లలో మొదలైంది. కేసీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని జనం స్వాగతిస్తారని భావించడం సరికాదని, దీనిపై దుబ్బాక తీర్పును ఒక సంకేతంగా తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఫామ్ హౌస్లో కేసీఆర్.. డల్గా కేటీఆర్

దుబ్బాక కౌంటింగ్ కు ముందు రోజు రాత్రే సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి ఫామ్ హౌస్‌కు వెళ్లిపోయారు. కౌంటింగ్ సరళిని ఎప్పటికప్పుడు అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. 10 రౌండ్ల కౌంటింగ్​ సమయానికి టీఆర్ఎస్​ గెలుపు అసాధ్యమన్న భావనకు కేసీఆర్​ వచ్చారని పార్టీ లీడర్లు అంటున్నారు. రిజల్ట్ వచ్చాక మీడియా ముందు ఏం మాట్లాడాలో కేటీఆర్ కు సూచించారని సమాచారం. తెలంగాణ భవన్ కు వచ్చిన కేటీఆర్.. పూర్తిగా డల్​గా కనిపించారు. ఆయన తెలంగాణ భవన్ కు వచ్చే ప్రతిసారి పెద్ద సంఖ్యలో లీడర్లు వస్తుంటారు. కానీ ఈసారి మాత్రం కొందరే వచ్చారు. ఇక కేటీఆర్​ కూడా కేవలం ఐదు నిమిషాల్లోనే ప్రెస్​మీట్​ పూర్తి చేసి వెళ్లిపోయారు.