మా ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదు : హరీశ్‌ శర్మ

మా ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదు : హరీశ్‌ శర్మ
  • రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్‌ హరీశ్‌ శర్మపై హైకోర్టు ఫైర్

హైదరాబాద్, వెలుగు: తమ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో  వివరణ ఇచ్చేందుకు రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్‌ హరీశ్‌ శర్మ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలంలోని 20 ఎకరాల భూమిపై ప్రభుత్వానికి హక్కులు లేవని గతంలో కోర్టు తీర్పునిచ్చింది. ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించింది. 

కానీ కోర్టు తీర్పుకు అనుగుణంగా చర్యలు తీసుకోకపోవడంతో హరీశ్‌ శర్మ సహా మరో ఐదుగురికి హైకోర్టు జైలు శిక్ష విధించింది. దీనిపై అప్పీల్‌ దాఖలు చేసిన అధికారులు.. ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. అయినా.. ఆ హామీని నిలబెట్టుకోలేదు. దాంతో అధికారులపై ప్రతాప్‌ జంగిల్‌ రిసార్ట్స్‌  ప్రైవేట్‌ లిమిటెడ్‌ పిటిషన్‌ వేసింది. 

దాన్ని చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ శ్రవణ్‌ కుమార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ శుక్రవారం విచారించింది. 20 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి..కోర్టు ఉత్తర్వుల్ని అమలు చేశామని అధికారులు వెల్లడించారు. టెక్నికల్‌ ఇష్యూ వల్ల వెబ్‌సైట్‌లో కనబడటం లేదని  వివరించారు. దాంతో  విచారణను కోర్టు జనవరి 5కు వాయిదా వేసింది. ఆ విచారణకు వ్యక్తిగతంగా హాజరై, వివరణ ఇవ్వాలని హరీశ్‌ శర్మను ఆదేశించింది.