
- రూ.8.53 లక్షల కోట్లకు చేరుకున్న ఇండియా వాణిజ్య లోటు
- రా మెటీరియల్స్, ఫార్మా ఇంటర్మీడియట్స్, సిలికాన్ వేఫర్స్, సోలార్ సెల్స్ కోసం చైనానే దిక్కు
- ద్వైపాక్షిక వాణిజ్యంలో భారత వాటా 20 ఏళ్లలో 42.3 శాతం నుంచి 11.2 శాతానికి డౌన్
- 2024–25 లో మన ఎగుమతులు చైనాకు 14.25 బిలియన్ డాలర్లు, దిగుమతులు 113.5 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: ఇండియా, చైనా మధ్య వాణిజ్యం గత 20 ఏళ్లుగా పెరుగుతూ వస్తోంది. కానీ, మనం చైనాకు ఎగుమతి చేసే వస్తువుల కంటే దిగుమతి చేసుకునేవే ఎక్కువగా ఉన్నాయి. దీంతో చైనాతో భారత్ వాణిజ్య లోటు ఏడాదికేడాది పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–-జులైలో భారత్ ఎగుమతులు చైనాకు 19.97శాతం పెరిగి 5.75 బిలియన్ డాలర్లకి చేరాయి. అదే సమయంలో దిగుమతులు 13.06శాతం పెరిగి 40.65 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2024–-25లో మొత్తం ఎగుమతుల విలువ కేవలం 14.25 బిలియన్ డాలర్లే. దిగుమతులు మాత్రం 113.5 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. వాణిజ్య లోటు 2003–-04లో 1.1 బిలియన్ డాలర్లు ఉంటే, 2024–-25లో 99.2 బిలియన్ డాలర్ల (రూ.8.53 లక్షల కోట్ల)కు పెరిగింది. ఇండియా ఎదుర్కొంటున్న మొత్తం వాణిజ్య లోటు(283 బిలియన్ డాలర్ల) లో 35శాతం చైనాతోనే ఉంది.
వాణిజ్య లోటుతో ఆందోళన
చైనాతో మన దేశ వాణిజ్య లోటు కేవలం ఎక్కువ మాత్రమే కాదు. మెజార్టీ సెక్టార్లు ఈ దేశంపై ఆధారపడుతున్నాయి. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, నిర్మాణ సామగ్రి, రెన్యూవబుల్ ఎనర్జీ, కన్స్యూమర్ గూడ్స్ వంటి అన్ని రంగాల్లో భారత్ దిగుమతుల్లో చైనా వాటానే ఎక్కువ.
అధికంగా ఆధారపడితే ప్రమాదమే..
చైనా దిగుమతులపై ఇండియా ఎక్కువగా ఆధారపడుతోంది. రాజకీయ ఉద్రిక్తతలు నెలకొంటే వస్తువుల సప్లయ్‌ను చైనా ఆపేయొచ్చు. ఇండియాపై ఒత్తిడి పెంచొచ్చు. ఈ దేశానికి భారత్ ఎగుమతులు తగ్గుతున్నాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ అన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యంలో భారత వాటా 20 ఏళ్లలో 42.3శాతం నుంచి 11.2శాతానికి తగ్గిందని చెప్పారు. కామర్స్ మంత్రిత్వ శాఖ ప్రకారం, చైనా నుంచి దిగుమతులు ఎక్కువగా రా మెటీరియల్స్, ఇంటర్మీడియట్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్ ఉన్నాయి. వీటితో భారత్‌లో తుది ఉత్పత్తులు తయారవుతున్నాయి. దేశీయ సరఫరా–-డిమాండ్ మధ్య గ్యాప్ వల్లే చైనాపై ఆధారపడడం పెరిగింది.
దిగుమతులను తగ్గించే చర్యలు..
దేశంలో తయారీని పెంచేందుకు మోదీ ప్రభుత్వం పద్నాలుగుకు పైగా రంగాల్లో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (పీఎల్‌ఐ) ను తీసుకొచ్చింది. నాణ్యత ప్రమాణాలు పాటించడం, టెస్టింగ్ ప్రోటోకాల్, తప్పనిసరిగా సర్టిఫికేషన్ ఉండడం వంటి రూల్స్ అమలు చేస్తోంది. సప్లయ్ చెయిన్‌ను మెరుగుపరిచేందుకు ప్రత్యామ్నాయ సరఫరాదారులను వెతుకుతోంది. డైరక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ (డీజీటీఆర్) ద్వారా అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసులపై చర్యలు తీసుకుంటోంది. అలానే చైనా వస్తువులపై యాంటీ-డంపింగ్ డ్యూటీలు (కెమికల్స్, ఇంజనీరింగ్ వస్తువులు) వేస్తోంది.
వాణిజ్య లోటు పెరిగితే కష్టమే
వాణిజ్య లోటు పెరిగితే మన విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి ఎక్కువవుతుంది. వస్తువుల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి ఉంటుంది. దిగుమతులు చౌకగా ఉంటే స్థానిక తయారీదారులు నష్టపోతారు. కరెన్సీ విలువ తగ్గడం, దిగుమతి ధరలు, ద్రవ్యోల్బణం పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కీలక రంగాల్లో దేశీయ సామర్థ్యం అభివృద్ధి చెందదు. లాంగ్‌టర్మ్‌లో పారిశ్రామిక వృద్ధి మందగిస్తుంది. వాణిజ్య లోటును తగ్గించుకోవడం భారత్‌కు వ్యూహాత్మక అవసరమని, దీని పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బిజినెస్‌లు కూడా ముందుకు రావాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.