లద్దాఖ్ లో ఎందుకీ యువత నిరసనలు..? అశాంతి వెనక డిమాండ్లు ఏంటీ?

లద్దాఖ్ లో ఎందుకీ యువత నిరసనలు..? అశాంతి వెనక డిమాండ్లు ఏంటీ?

కేంద్ర పాలిత ప్రాంతం లడాఖ్ అల్లర్లతో అట్టుడికిపోతోంది. లడాఖ్ ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు  చేయాలని యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. యువతను అదుపు చేసే క్రమంలో పోలీసులు, సీఆర్ పీఎఫ్ బలగాలు, ఆందోళన కారుల మధ్య వివాధం చోటు చేసుకుంది. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది నిరసన కారులను అదుపులోకి తీసుకున్నారు.  లడాఖ్ యువత ఎందుకు ఆందోళను చేస్తోంది.. అశాంతి వెనక వారి డిమాండ్లు ఏమిటీ..?

కేంద్ర పాలిత ప్రాంతమైన లడాఖ్ రాజధాని లెహ్‌లో బుధవారం( సెప్టెంబర్24) హింసాత్మక నిరసనలు చెలరేగాయి.లడాఖ్ ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని లేహ్ అపెక్స్ బాడీ (LAB) ఆధ్వర్యంలో లడాఖ్ రాజధాని లేహ్ లో పెద్ద ఎత్తున యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. స్థానిక బీజేపీ కార్యాలయాన్ని తగలబెట్టారు నిరసనకారులు. డిమాండ్లను నెరవేర్చే వరకు నిరాహార దీక్ష చేస్తామని LAB నాయకులు ప్రకటించిన కొద్ది గంటల్లో లేహ్ లో యువత నిర్వహించిన భారీ ర్యాలీ హింసకు దారి తీసింది. ఈఘర్షణలో నలుగురు మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు.     

నిరసనలకు కారణం ఇదేనా?..

కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్‌తో కలిసిన లేహ్ అపెక్స్ బాడీ (LAB).. డిసెంబర్ 2024 నుంచి  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA)తో చర్చలు జరుపుతోంది. అక్టోబర్ 6న తదుపరి చర్చలు నిర్వహించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. అయితే షెడ్యూల్ ఏకపక్షంగా చేశారని LAB నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.నిరాహారా దీక్షకు పిలుపునిచ్చారు 

సెప్టెంబర్ 10 నుంచి 35 రోజుల పాటు LAB కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష కు దిగారు. రాబోయే హిల్ కౌన్సిల్ ఎన్నికలకు ముందు లడాఖ్ ను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కిందకు తీసుకువస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని గతంలో కోరారు. అయితే కేంద్రం ఎటూ తేల్చకపోవడంతో నిరాహార దీక్ష కొనసాగిస్తామని  సోమవారం ప్రకటించారు. 

నాలుగు ప్రధాన డిమాండ్లు.. 

లడఖ్‌కు రాష్ట్ర హోదా..

లడాఖ్ కు రాజకీయ స్వయం ప్రతిపత్తికోసం పూర్తి రాష్ట్రంగా ప్రకటించాలని లేహ్ అపెక్స్ బాడీ (LAB) మొదటి ప్రధాన డిమాండ్. 

ఆరవ షెడ్యూల్‌లో చేర్చాలి.. 

లడాఖ్ ను ఆర్టికల్ 244 కిందకు తీసుకురావాలని నిరసన కారుల రెండో డిమాండ్. ఇది స్వయం ప్రతిపత్తి జిల్లా కౌన్సిల్ ద్వార గిరిజన ప్రాంతాలకు ఎక్కువ అధికారాలను అందిస్తుంది. భూమిహక్కులు, ఆచారాలు, పరిపాలన పరమైన నిర్మాణాలను కాపాడుతుందని ఆందోళన కారులు వాదిస్తున్నారు. 

ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావాలి.. 

లడాఖ్ లోని గ్రాడ్యుయేట్లలో అత్యధికులు నిరుద్యోగులే.. దాదాపు 26.5 శాతం నిరుద్యోగులతో దేశంలో రెండో స్థానం. స్థానిక నియామకాలను వేగంగా జరగాలన్నా, స్థానిక యువతకు ఉద్యోగాలు రావాలన్నా స్వంత సర్వీస్ కమిషన్ ఉండాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. 

రెండు పార్లమెంటరీ సీట్లు..

ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతమైన లడాఖ్ లో ఒక లోక్ సభ నియోజకవర్గం ఉంది. లడాఖ్ ప్రాంతం వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా రెండు పార్లమెంటరీ నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. 

అయితే లేహ్ అపెక్స్ బాడీ (LAB) డిమాండ్లను కొన్నింటిని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నప్పటికీ ప్రధానమైన రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్ లో చేరికపై పెండింగ్ లో ఉంచింది. స్థానిక సర్వీస్ కమిషన్ ఏర్పాటు, రెండు పార్లమెంటరీ స్థానాల ఏర్పాటుకు ఒప్పుకున్న కేంద్ర హోంశాఖ.. మిగతా డిమాండ్లపై చర్చలకు అక్టోబర్ 6 న ముహూర్తం నిర్ణయించింది. 

కేంద్రం ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడంతో నిర్లక్ష్యం చేస్తోందని నిరాశ చెందిన లడాఖ్ యువత ఆందోళనకు దిగిందని ఆందోళనకారులు చెబుతున్నారు.