డీఎంకే నేత వ్యాఖ్యలపై సీఎంను ప్రశ్నించిన ఖుష్భూ

డీఎంకే నేత వ్యాఖ్యలపై సీఎంను ప్రశ్నించిన ఖుష్భూ

డీఎంకే నేత సైదాయ్ సాదిక్ మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత ఖుష్భూ సుందర్ మండిపడ్డారు. ఈ విషయంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మౌనంగా ఉండడాన్ని ఆమె ప్రశ్నించారు. తనకు సీఎం అండగా నిలబడాలని కోరుకుంటున్నానన్న ఖుష్భు..ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటూ నిలదీశారు. ఈ విషయంపై తాను ఎక్కడివరకైనా వెళతానని, సాదిక్ పై చర్యలు తీసుకునేంత వరకు పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసి పరువు, గౌరవాన్ని నిలబెట్టుకుంటానన్నారు. ఇదే తరహాలో బీజేపీ నుంచి ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సీఎం ఇలానే మౌనంగా ఉండేవారా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను తాను చాలా వ్యక్తిగతంగా తీసుకున్నానని చెప్పారు. తనకు 22, 19 ఏళ్ల వయస్సున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, వారికి రోల్‌మోడల్‌గా ఉండాలనుకుంటున్న తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వాళ్లు ఏమనుకుంటారని ఖుష్బూ పేర్కొన్నారు.

సైదాయ్ సాదిక్ క్షమాపణలు.. 

బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూకు డీఎంకే నేత సైదాయ్ సాదిక్‌ క్షమాపణ చెప్పారు. ఖుష్బూతో సహా పలువురు నటీమణులను కించపరిచేలా సైదాయ్ సాదిక్‌ మాట్లాడారంటూ ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఖుష్బూ ఓ ట్వీట్‌ను ఎంపీ కనిమొళికి ట్యాగ్‌ చేశారు. దానికి ఆమె సైతం క్షమాపణ చెప్పిన నేపథ్యంలో సాదిక్‌ కూడా ఇటీవలే ఖుష్బూకు ట్విట్టర్‌లో క్షమాపణ చెప్పారు. తన ప్రసంగాన్ని వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారని వివరణ ఇచ్చారు. అయినా ఖుష్బూ మనసు గాయపడి ఉంటే క్షమాపణ చెబుతున్నట్టు వెల్లడించారు.

బీజేపీ నేతలైన ఖుష్బూ, గౌతమి, నమిత, గాయత్రి రఘురామ్‌లను ఉద్దేశిస్తూ రాజకీయాల్లోకి వచ్చిన ఐటెంలు అంటూ సైదాయ్ సాదిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన తరపున ఎంపీ కనిమొళి క్షమాపణ చెప్పారు. ఈ తరహా వ్యాఖ్యలను సీఎం సైతం సహించరని చెప్పారు. ఈ క్రమంలోనే సైదాయ్‌ సాదిక్‌ మహిళలను కించపర్చారని ఆరోపిస్తూ.. ఆయన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్పందించాలని ఖుష్బూ డిమాండ్‌ చేశారు.