భారతదేశ టెలికాం, డిజిటల్ రంగంలో ఇటీవల చోటు చేసుకున్న ఒక కీలక పరిణామం ఏమిటంటే దేశంలోని అన్ని స్మార్ట్‌ఫోన్లలో ‘సంచార్ సాథీ’ యాప్‌ను విధిగా ఇన్‌స్టాల్ చేయాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం. కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం, డిజిటల్ గోప్యత, వినియోగదారుల హక్కులు, సైబర్ భద్రతకు సంబంధించిన చర్చలను మరోసారి తెరపైకి తెచ్చింది. కేంద్రం కీలక నిర్ణయం, నిబంధన రద్దు భారతదేశంలో విక్రయించే ప్రతి కొత్త స్మార్ట్‌ఫోన్‌లోనూ ప్రభుత్వం రూపొందించిన ‘సంచార్ సాథీ’ యాప్‌ను తయారీదారులు (OEMs) ముందే ఇన్‌స్టాల్ చేయాలన్న మునుపటి ఆదేశాన్ని కమ్యూనికేషన్ మంత్రిత్వశాఖ అధికారికంగా రద్దు చేసింది.
గత కొన్ని నెలలుగా ఈ ప్రతిపాదనపై మొబైల్ తయారీ కంపెనీలు, ప్రభుత్వం మధ్య చర్చలు జరుగుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు సైబర్ భద్రతను కల్పించే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనను మొదట తెచ్చినప్పటికీ, దాన్ని తప్పనిసరి చేయడంపై అనేక వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాజా ప్రకటనతో, స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలకు, వినియోగదారులకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఇకపై ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలా వద్దా అనేది పూర్తిగా వినియోగదారుని ఇష్టానికే వదిలివేయడమైనది.
‘సంచార్ సాథీ’ యాప్ నేపథ్యం
అసలు ఈ ‘సంచార్ సాథీ’ యాప్ లేదా పోర్టల్ ఎందుకు సృష్టించారు? 2023లో కేంద్ర ప్రభుత్వం దీనిని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. దేశంలో పెరిగిపోతున్న సైబర్ మోసాలు, ఆన్‌లైన్ ఫిషింగ్ కాల్స్, ఐడెంటిటీ థెఫ్ట్ వంటి సమస్యలను అరికట్టడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా పౌరులు తమ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు (TAFCOP మాడ్యూల్), పోగొట్టుకున్న ఫోన్లను బ్లాక్ చేయవచ్చు (CEIR మాడ్యూల్), అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్‌ల గురించి ఫిర్యాదు చేయవచ్చు. సైబర్ ప్రపంచంలో సామాన్యుడికి ఒక రక్షణ కవచంలా ఉండాలన్నదే దీని సృష్టికర్తల ఉద్దేశ్యం. ఇది కేవలం ఒక యాప్ మాత్రమే కాదు, పౌరుల డిజిటల్ భద్రతను పర్యవేక్షించే ఒక సమగ్ర వ్యవస్థ.
ప్రస్తుతం ఉన్న వినియోగదారుల గణాంకాలు
తాజా సమాచారం ప్రకారం, ‘సంచార్ సాథీ’ యాప్‌ను దాదాపు 1.4 కోట్ల మంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. ఇది భారత జనాభాతో పోలిస్తే తక్కువ సంఖ్యే అయినప్పటికీ, డిజిటల్ అక్షరాస్యత తక్కువగా ఉన్న మన దేశంలో ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయికి చేరడం విశేషం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ యాప్ ద్వారా రోజుకు సుమారు 2,000 సైబర్ మోసపు కేసులు నమోదు అవుతున్నాయి. అంటే, ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారని, వారికి ఈ యాప్ ఒక ఫిర్యాదు వేదికగా ఉపయోగపడుతోందని ఇది స్పష్టం చేస్తోంది.
గోప్యతా ఆందోళనలు, వాదనలు
ముందస్తు ఇన్‌స్టాలేషన్ ఆదేశం వెనుక ఉన్న అతిపెద్ద ఆందోళన ‘గోప్యత’ (Privacy). ఒకవేళ ఈ యాప్ ప్రతి ఫోన్‌లోనూ ఉంటే, ప్రభుత్వం పౌరుల కదలికలను, వారి సంభాషణలను ట్రాక్ చేసే అవకాశం ఉందా? అని. స్మార్ట్‌ఫోన్‌లో ఒక యాప్ ఇన్‌స్టాల్ అయినప్పుడు దానికి లొకేషన్, కాంటాక్ట్స్, మెసేజ్ వంటి అనేక పర్మిషన్లు అవసరమవుతాయి. ప్రభుత్వ యాప్‌కు ఇవన్నీ ఇవ్వడం ద్వారా, పౌరుల ప్రైవేట్ డేటా ప్రభుత్వ సర్వర్లకు చేరే ప్రమాదం ఉందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘మాస్ సర్వైలెన్స్’కు ఇది ఒక సాధనంగా మారుతుందన్న భయం ప్రజల్లో కలిగింది. ఈ ఆందోళనలే ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి ప్రధాన కారణమయ్యాయి. మరో ముఖ్యమైన వాదన ‘బ్లోట్‌వేర్’ కు సంబంధించినది. సాధారణంగా మనం కొత్త ఫోన్ కొన్నప్పుడు, అందులో మనకు అవసరంలేని అనేక యాప్స్ ముందే ఇన్‌స్టాల్ చేసి ఉంటాయి. వీటిని తొలగించడం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ యాప్ కూడా అలాగే వస్తే, అది ఫోన్ మెమొరీని ఆక్రమించడమే కాకుండా, ఫోన్ పనితీరును మందగించేలా చేస్తుందని వినియోగదారులు భావించారు. సైబర్ ప్రపంచంలో పొంచి ఉన్న ‘చెడు వ్యక్తులు, సైబర్ క్రిమినల్స్ నుంచి అమాయక పౌరులను రక్షించడానికి మాత్రమే ఈ యాప్‌ను రూపొందించామని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా, ముందస్తు ఇన్‌స్టాలేషన్ ఉన్నప్పటికీ, వినియోగదారులు ఎప్పుడైనా ఆ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది.
సైబర్ నేరాల తీవ్రత, భవిష్యత్తు కార్యాచరణ
భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. ఫేక్ కాల్స్, లోన్ యాప్ వేధింపులు, ఓటీపీ మోసాలు రోజువారీ వ్యవహారంగా మారాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ‘సంచార్ సహాయం’ వంటి టూల్స్ అత్యంత అవసరం. ప్రభుత్వం ఇప్పుడు మాండేటరీ మార్గాన్ని వదిలి, అవగాహన మార్గాన్ని ఎంచుకుంది. ప్రజలకు ఈ యాప్ వల్ల కలిగే లాభాలను వివరించడం ద్వారా, వారిని స్వచ్ఛందంగా దీనివైపు మళ్లించడానికి ప్రయత్నిస్తోంది. టెలికాం ఆపరేటర్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పిస్తోంది.
ప్రతిపక్షాలు, డిజిటల్ హక్కుల సంస్థల పాత్ర
ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కేవలం యాప్ ఇన్‌స్టాల్ మాత్రమే కారణం కాదు. ఈ ప్రతిపాదన వెలువడినప్పటి నుంచి డిజిటల్ హక్కుల సంస్థలు , గోప్యతా కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఒక ప్రభుత్వ యాప్‌ను ఫోన్లలో ముందే ఇన్‌స్టాల్ చేయడం అనేది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని వారు వాదించారు. ఇది పరోక్షంగా ప్రభుత్వ నిఘా పెరగడానికి దారితీస్తుందన్న ఆందోళనలను వారు లేవనెత్తారు. ప్రజాస్వామ్య దేశంలో వినియోగదారుడికి ఎంపిక చేసుకునే హక్కు ఉండాలని, ఏ యాప్ వాడాలో ప్రభుత్వమే నిర్ణయించడం సరికాదని ప్రతిపక్షాలు గట్టిగా వాదించాయి. ఈ తీవ్ర వ్యతిరేకత, ఒత్తిడి కూడా ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవడానికి ఒక కారణంగా చెప్పవచ్చు.
- డా. ఏలూరి
యాదయ్య,
అధ్యక్షుడు, రాష్ట్రీయ సైనిక్ మహా సంఘ్

