తెలంగాణలో లాక్‌డౌన్ ఎందుకు పెట్టట్లేదు ?

తెలంగాణలో లాక్‌డౌన్ ఎందుకు పెట్టట్లేదు ?
  • ప్రభుత్వంపై హైకోర్టు మళ్లీ సీరియస్

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు మళ్లీ సీరియస్ అయింది. రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలపై బుధవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది.  డీజీపీ మహేందర్ రెడ్డి, హెల్త్ డైరెక్టర్ కోర్టుకు హాజరయ్యారు. కరోనా విస్తరణ, ట్రీట్మెంట్ , ఆక్సిజన్, పడకల వివరాలతో  పబ్లిక్ డొమైన్ ఎందుకు అప్డేట్ చేయడం లేదంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మేం చెప్పినా కరోనా డేటా ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించింది. కేవలం నైట్ కర్ఫ్యూ పెట్టి చేతులు దులిపేసుకుంటున్నట్లు కనిపిస్తోందని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసులు తగ్గుతున్నాయన్న వివరణతో హైకోర్టు ఏకీభవించలేదు. టెస్టులు తగ్గించి కేసులు తగ్గాయని ఎలా చెబుతారు..? టెస్టుల సంఖ్య ఎందుకు పెంచడం లేదు..? ఒక్క రోజు కూడా టెస్టులు లక్ష దాట లేదు. నైట్ కర్ఫ్యూ పెట్టినా కేసులు ఎందుకు పెరుగుతున్నాయని హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. లాక్ డౌన్ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కోర్టు నిలదీసింది. రాష్ట్రంలో ఆక్సిజన్ డిమాండ్ పరిస్థితి ఎలా ఉంది.. సరిపడినన్ని నిల్వలు ఉన్నాయా... ? సకాలంలో సరఫరా జరుగుతోందా..? ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్, బెడ్ల పరిస్థితి ఎలా ఉంది.. వెంటనే వివరాలివ్వాలని హైకోర్టు ఆదేశించింది.