ఇంటింటికీ మంచి నీళ్లు ఇస్తలేరు

 ఇంటింటికీ మంచి నీళ్లు ఇస్తలేరు

షాద్ నగర్, వెలుగు: ‘‘రెండేండ్లుగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలకు 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నది, కేసీఆర్ ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి 6 కిలోల బియ్యం ఇస్తానని చెప్పింది. ఈ లెక్కన ఒక్కో పేద వ్యక్తికి నెలకు 11 కిలోల రేషన్ బియ్యం ఇవ్వాలి. కానీ కేసీఆర్.. కేంద్రం ఇస్తున్న బియ్యాన్ని అమ్ముకుంటూ పేదల నోటికాడ ముద్ద లాక్కుంటున్నడు” అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బుధవారం రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో బండి సంజయ్ ప్రజలతో మాట్లాడారు. ‘‘వ్యవసాయం చేసి నష్టపోతున్న పేద, కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వట్లే, కానీ వందల ఎకరాలున్న భూస్వాములకేమో ఇస్తున్నడు. ఇంకెన్నాళ్లు టీఆర్ఎస్ అరాచకాలను భరిద్దాం. ఇదేం న్యాయమని కేసీఆర్​ను, టీఆర్ఎస్ నేతలను నిలదీయండి’’అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సీఎంకు ఇంటింటికీ నీళ్లు ఇవ్వడం చేతకాదు కానీ.. ఊరికి 10 బెల్టుషాపులు పెట్టి తాగండి- ఊగండి అని చెబుతుండని మండిపడ్డారు. అందుకే ఈ దుర్మార్గపు కేసీఆర్ పాలన పోయి పేదలకు న్యాయం జరగాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వలని కోరారు.
మా ఊరిపై కక్ష కట్టారు
బీజేపీ అభ్యర్థిని సర్పంచ్​గా ఎన్నుకున్నామని టీఆర్ఎస్ ప్రభుత్వం తమ గ్రామంపై కక్ష్య కట్టినట్లు వ్యవహరిస్తోందని సంతాపూర్ వాసులు సంజయ్ ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. అర్హత ఉన్నా పెన్షన్లు, ఇండ్లిస్తలేరని, అంగన్ వాడీ స్కూల్ కూడా పెట్టడం లేదన్నారు. వారి సమస్యలను విన్న సంజయ్.. అంగన్ వాడీ కేంద్రం కోసం తన ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.5 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.