టెస్టుల రిజల్ట్స్ లో లేటెందుకు?

టెస్టుల రిజల్ట్స్ లో లేటెందుకు?

గాంధీలో కరోనా ట్రీట్మెంట్ సౌకర్యాలేంటి?
టిమ్స్ను ఇంకా ఎందుకు ప్రారంభించలేదు?
సీఎస్, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీకి గవర్నర్ ప్రశ్నల వర్షం
గంట పాటు కరోనాపై చర్చ.. సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం
కరోనా కట్టడికి ప్రభుత్వ చర్యలపై తమిళిసై అసంతృప్తి


రోజూ ఎన్ని టెస్టులు చేస్తున్నారు? టెస్టింగ్ కెపాసిటీ ఎంత? పాజిటివ్ వచ్చిన వారికి ట్రీట్మెంట్ ఎట్లా చేస్తున్నారు? పేదలకు ట్రీట్మెంట్ అందుతోందా? గాంధీలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? టెస్టులు ఎక్కువగా చేయాలి. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్లో బెడ్లసంఖ్యను పెంచాలి. వైద్య సాయం కోరుతూ హాస్పిటల్కు వచ్చే ప్రతి ఒక్కరికీ ట్రీట్మెంట్ అందాలి. – గవర్నర్ తమిళి సై

హైదరాబాద్, వెలుగు: కరోనా టెస్టుల రిజల్ట్స్ లేటుగా ఎందుకు ఇస్తున్నారని సీఎస్ సోమేశ్ కుమార్ ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశ్నించారు. ‘‘రోజూ ఎన్ని టెస్టులు చేస్తున్నారు? టెస్టింగ్ కెపాసిటీ ఎంత? పాజిటివ్ వచ్చిన వారికి ట్రీట్మెంట్ ఎట్లా చేస్తున్నారు? పేదలకు వైద్యం అందుతోందా? గాంధీలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు?’’ అని ప్రశ్నించారు. కరోనాపై చర్చించేందుకు రావాల్సిందిగా సోమవారం ఆమె ఆదేశించినా మరో పనిలో ఉన్నామని సీఎస్ సోమేశ్ కుమార్ చెప్పారు. మంగళవారం సాయంత్రం హెల్త్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతాకుమారితో కలిసి రాజ్భవన్కు వెళ్లారు. గంట పాటు కరోనాపై గవర్నర్తో చర్చించి కరోనాపై స్టేటస్ రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే, కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబ్లలో చేస్తున్న టెస్టులు, పాజిటివ్ రోగులకు అందుతున్న ట్రీట్మెంట్, ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్లు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక బిల్లుల వసూళ్లపై సమగ్ర రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా సీఎస్ను, హెల్త్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆమె ఆదేశించారు. కరోనా నియంత్రణపై ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు.

అందరికీ ట్రీట్మెంట్ అందేలా చూడండి

ఒకవైపు కేసులు పెరుగుతున్నా టిమ్స్ను ఇంకా ఎందుకు ప్రారంభించలేదని సీఎస్ను గవర్నర్ ప్రశ్నించారు. దానికి గల కారణాలు, డాక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ట్విట్టర్లో, ఇతర సోషల్ మీడియా ద్వారా వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, అభిప్రాయాలను అమె వివరించారు. టెస్టులు ఎక్కువగా చేయాలని, ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్లో బెడ్లసంఖ్యను పెంచాలని, వైద్య సాయం కోరుతూ హాస్పిటల్కు వచ్చే ప్రతి ఒక్కరికీ ట్రీట్మెంట్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఒకరోజు ఆలస్యంగా..

నిజానికి గవర్నర్తో సీఎస్, ప్రినిపల్ సెక్రటరీ భేటీ సోమవారం జరగాల్సి ఉంది. కానీ, మంగళవారం వస్తామని గవర్నర్ ఆఫీసుకు సీఎస్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం గవర్నర్ దాదాపు గంటపాటు ట్విట్టర్ వేదికగా కరోనాపై తన అభిప్రాయాలను పంచుకోవడం, ప్రభుత్వ ఫెయిల్యూర్స్, కరోనా పరిస్థితిపై నెటిజన్ల ఫిర్యాదులు వెల్లువెత్తడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు, వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుంటంతో ఇదే అంశంపై గవర్నర్ ఫోకస్పెట్టడంతో ప్రభుత్వ వర్గాలు అప్రమత్తమయ్యాయి. అంతేగాక మంగళవారం ఉదయం ప్రైవేటు హస్పిటళ్ల మేనేజ్మెంట్లతో గవర్నర్ సమావేశం కావడం, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్మెంట్కు చార్జీలు ఎక్కువ వసూలు చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై చర్చించడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం సీఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీలు సోమవారం రాకపోవడంపై గవర్నర్కు సంజాయిషీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం