హైకోర్టు ఆర్డర్స్​ ఎందుకు అమలు చేయట్లే

హైకోర్టు ఆర్డర్స్​ ఎందుకు అమలు చేయట్లే
  • డీఎంఈ నియామక జీవోపై కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయకపోవడంపై ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ఇన్‌‌చార్జి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) రమేశ్‌‌రెడ్డి నియామక జీవోను కొట్టివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై హైకోర్టు ప్రభుత్వంపై మండిపడింది. తదుపరి విచారణకు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్‌‌రెడ్డి వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌‌ విచారణ పూర్తయ్యే వరకు క్రమం తప్పకుండా హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. ఫామ్‌‌-1 నోటీసులు జారీ చేసింది. విచారణను 21వ తేదీకి వాయిదా వేసింది.

డీఎంఈ రమేశ్‌‌రెడ్డిని నియమిస్తూ 2017, జులై 3న ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌‌ 603 జారీ చేయగా.. ఆ జీవో చట్టవిరుద్ధమని దానిని కొట్టివేస్తూ ఏప్రిల్‌‌ 24 హైకోర్టు ఆదేశించింది. 7 నెలలైనా కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంతో హెల్త్‌‌కేర్ రీఫామ్స్ డాక్టర్స్ అసోసియేషన్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని  జస్టిస్‌‌ సూరేపల్లి నందా ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌‌ తరఫు లాయర్ సామ సందీప్‌‌రెడ్డి వాదించారు.

ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే కోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదన్నారు. జులైలోగా నియామకం చేపట్టాల్సి ఉన్నా.. డిసెంబర్‌‌ వరకు ఎలాంటి చర్యలు చేపట్టకుండా రమేశ్‌‌రెడ్డిని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. వాదనల తర్వాత హైకోర్టు  రిజ్వీ, రమేశ్‌‌రెడ్డిలను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.