బ్యాగు బరువు తగ్గలే.. స్కూళ్ల పేర్లు మారలే

బ్యాగు బరువు తగ్గలే.. స్కూళ్ల పేర్లు మారలే

హైదరాబాద్‌‌, వెలుగు:

కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో సర్కారు నిబంధనలు అమలు కావడం లేదు. వాటిని అమలు చేయించాల్సిన విద్యాశాఖాధికారులూ పట్టించుకోవడం లేదు. దీంతో కార్పొరేట్‌‌, ప్రైవేటు మేనేజ్మెంట్ల ఇష్టారాజ్యం కొనసాగుతుంది. ఫిర్యాదులొస్తే కేవలం స్కూళ్లకు నోటీసులు ఇచ్చి, అధికారులు ‘మమ’ అనిపిస్తున్నారు. దీంతో పేరెంట్స్‌‌, స్టూడెంట్స్‌‌ ఇబ్బందులు
పడుతున్నారు.

రాష్ట్రంలో సుమారు 10,700  కార్పొరేట్‌‌, ప్రైవేటు స్కూళ్లుండగా, వీటిలో 31 లక్షల మంది స్టూడెంట్స్‌‌ చదువుతున్నారు. వీటిలో చాలాస్కూళ్లు నిబంధనల ప్రకారం లేకపోయినా, అధికారులు పలు షరతులతో ప్రతిఏటా అనుమతులిస్తూ పోతున్నారు. వీటిని సాకుగా చేసుకుని స్టేట్‌‌లో అనేక స్కూళ్లు, ప్రభుత్వ, విద్యాశాఖాధికారులు ఇచ్చిన నిబంధనలు అమలు చేయడం లేదు. కేవలం విద్యాసంవత్సరం ప్రారంభంలోనే హడావుడి చేసే విద్యాశాఖాధికారులు, ఆ తర్వాత వాటి గురించి పట్టించుకోవడం లేదు. సెలవుదినాల్లో స్కూళ్లు నడుపొద్దని అధికారులు ఆదేశాలిచ్చినా, అవేవీ అమలు కావడం లేదు. పండగ సెలవుల్లోనూ స్పెషల్‌‌ క్లాసులు నిర్వహించినా, ఇప్పటికీ ఆదివారాలూ క్లాసులు పెడుతున్నా అడితే నాథుడు కరువయ్యాడు. అయితే ఇటీవల దసరా సెలవుల్లో కార్పొరేట్‌‌, ప్రైవేటు కాలేజీలు క్లాసులు నిర్వహిస్తే, ఇంటర్‌‌ బోర్డు సీరియస్‌‌గా రియాక్ట్‌‌ అయింది. ఆ కాలేజీలకు నోటీసులు ఇచ్చి, జరిమానా వేసింది. అది కట్టకపోవడంతో ప్రస్తుతం గుర్తింపు రద్దు చేయాలని, వచ్చే ఏడాది అఫ్లియేషన్‌‌ ఇవ్వొద్దనే ఆలోచనలో బోర్డు ఉన్నది. కానీ స్కూల్‌‌ ఎడ్యుకేషన్‌‌లో అలాంటి చర్యలు తీసుకున్న చర్రిత లేదు. ప్రైవేటు స్కూళ్లలో ఏ స్కూల్‌‌కు ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారో మేనేజ్‌మెంట్లు నోటీస్‌‌ బోర్డుపై పెట్టాలి. కానీ ఏ స్కూల్‌‌ కూడా ఈ నిబంధనను అమలు చేయడం లేదు.  దీంతో మేనేజ్మెంట్లు ఎంత వసూలు చేసినా, పట్టించుకునే పరిస్థితి కరువైంది.

తోకలు తొలగట్లే..

విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు, కార్పొరేట్‌‌ స్కూల్స్‌‌ పేర్ల చివర కేవలం ప్రైవేటు అనే ఉండాలి. టెక్నో, ఈటెక్నో, మోడల్‌‌, డిజిటల్‌‌, ఇంటర్నేషనల్‌‌, కాన్సెప్ట్‌‌, స్పెస్‌‌, ఐఐటీ ఒలంపియాడ్‌‌.. లాంటి పేర్లు ఉండొద్దని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నిబంధన చాలా స్కూళ్లలో అమలవడం లేదు. ఇప్పటికీ అనేక బడులకు తోకపేర్లు దర్శనమిస్తున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. కొన్ని స్కూళ్లు బయట బోర్డు, బస్సులపై తొలగించినా, పేరెంట్స్‌‌కు పంపించే లెటర్లు, స్టూడెంట్స్‌‌ బుక్స్‌‌లో అవే దర్శనమిస్తున్నాయి. ఈ పేర్లతోనే కార్పొరేట్‌‌ మేనేజ్మెంట్లు పేరెంట్స్‌‌ నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. నిబంధనలు పాటించని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, పేరెంట్స్‌‌ యూనియన్లు డిమాండ్‌‌ చేస్తున్నాయి.