
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఏపీలోనే శంకుస్థాపన చేసిన 2100 మెగావాట్ల నేదునూరు పవర్‌ప్లాంట్‌ను.. అన్ని పర్మిషన్లు ఉన్నప్పటికీ, పదేండ్లు అధికారంలో ఉండీ కూడా బీఆర్ఎస్ సర్కార్ ఆ ప్రాజెక్టును ఎందుకు నిర్మించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. దీనికి బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని నిలదీశారు. అసెంబ్లీలో విద్యుత్‌పై వైట్‌పేపర్ సందర్భంగా బీఆర్‌ఎస్‌నేత హరీశ్మాట్లాడుతూ తెలంగాణ కోసమే గతంలో కాంగ్రెస్, టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత రాజకీయ లబ్ధి కోసం పొత్తు పెట్టుకున్నాడని ఆయన విమర్శించారు. సిద్దిపేట, గజ్వేల్, ఓల్డ్ సిటీపై సీఎం రేవంత్‌రెడ్డి అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు.
ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కలుగజేసుకొని మాట్లాడారు. తమ సీఎం ఎవరిపై అక్కసు వెళ్లగక్కలేదని, విద్యుత్ బకాయిలు ఉన్నాయని చెప్పారే తప్పితే, ఆ బకాయిలు ప్రజలు కట్టాల్సినవా, పరిశ్రమలు కట్టాల్సినవా అనే విషయాన్ని ప్రస్తావించలేదని పొన్నం క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ కోసం ఒక్క పార్టీ మాత్రమే కొట్లాడలేదని, సబ్బండ వర్గాల ప్రజలు ఉద్యమం చేశారని ఆయన గుర్తు చేశారు. ఆప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న తాను, తన సహచర ఎంపీలు పార్లమెంటులో ఫైట్ చేశామన్నారు. ఆరోజు తాము లేకుంటే, పార్లమెంటులో కొట్లాడి బిల్లు పాస్ చేయించకపోతే తెలంగాణ వచ్చేదే కాదని పొన్నం తెలిపారు. ఆనాడు తాను ఎంపీగా పార్లమెంటులో రాష్ట్రం కోసం కొట్లాడుతుంటే, నియోజకవర్గంలో తనకు బీఆర్‌ఎస్ నాయకులు పిండం పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.
2010 ఫిబ్రవరిలో అప్పటి సీఎం రోశయ్యను ఒప్పించి, కరీంనగర్ జిల్లా నేదునూరులో 2100మెగా వాట్ల పవర్ ప్లాంటుకు తాను శంకుస్థాపన చేయించానని గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టు పనులు వివిధ పర్మిషన్లు రాక ఉమ్మడి రాష్ట్రంలో ఆలస్యమైతే, తనకు బీఆర్‌ఎస్ నాయకులు పిండ ప్రధానం చేయించారని.. మరి పదేండ్లు అధికారంలో ఉండి, అన్ని పర్మిషన్లున్నా ఎందుకు ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదని బీఆర్‌ఎస్‌ను నేతలను ప్రశ్నించారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో బొగ్గు గనులు ఉంటే, యాదాద్రిలో పవర్ ప్లాంటు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. ఆపై స్పీకర్ కేటీఆర్‌కు మైక్ ఇచ్చారు. గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు దేశంలో సక్సెస్ కాలేదని, అందుకే ఆ ప్రాజెక్టును తాము చేపట్టలేదని సమాధానం ఇచ్చారు.