సెక్రటేరియట్ కూల్చివేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో విచారణ జరిగింది. P.L విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ పై వాదోపవాదాలను విన్న కోర్టు..సెక్రటేరియట్ ను ఎందుకు కూల్చివేస్తున్నారని హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదులను ప్రశ్నించింది. ప్రస్తుత భవనాలకు అగ్నిప్రమాదాల నుంచి రక్షణ లేదని అగ్నిమాపక శాఖ నివేదిక ఇచ్చిందని ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. దీనిపై కోర్టు వ్యాఖ్యానిస్తూ అగ్ని ప్రమాదాలను నివారించే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని మాత్రమే అగ్నిమాపక శాఖ ప్రభుత్వానికి సూచించిందని… భవనాలు కూలగొట్టాలని చెప్పలేదు కదా అని కోర్టు తెలిపింది. అన్ని శాఖలు ఒకే దగ్గర ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన అని అదనపు ఏజీ కోర్టుకు తెలిపారు. దీంతో ఏపీ వదిలిపెట్టిన భవనాలు ఉన్నాయి కదా కోర్టు గుర్తు చేసింది. కొత్త సచివాలయం నిర్మించాలని సాంకేతిక కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని ప్రభుత్వ న్యాయవాదులు తెలపగా… ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాతనే సాంకేతిక కమిటీ నివేదిక ఇచ్చిందని హైకోర్టు తెలిపింది. పిటిషనర్ విశ్వేశ్వరరావు తరపున చిక్కుడు ప్రభాకర్ వాదనలు విన్పించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు విచారణను రేపటికి(మంగళవారం) వాయిదా వేసింది.

