కొందరు న్యాయమూర్తుల నియామకాల్లోనే.. వేగం ఎందుకు?

కొందరు న్యాయమూర్తుల నియామకాల్లోనే.. వేగం ఎందుకు?

ఆగస్టు 29న న్యాయమూర్తులు ఆలోక్ అరాదే, ఎఎం పంచోలీలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు.  వారి పేర్లను భారత ప్రధాన న్యాయమూర్తి బీఎల్​ గవాయ్​ నేతృత్వంలోని కొలీజియం 25 ఆగస్టున సిఫారసు చేసింది.  వారి పేర్లను 27 ఆగస్టున కేంద్ర ప్రభుత్వం ఆమోదించి వారి నియామకాలను జారీ చేసింది. ఇంత త్వరితగతిన  సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం జరగడం అరుదైన విషయం.  

హైకోర్టు న్యాయమూర్తుల సిఫారసుని కేంద్ర ప్రభుత్వం చాలారోజుకిగానీ ఆమోదించదు. ఆమోదించకుండా పెండింగ్​లో ఉన్న సిఫారసులు కూడా ఉన్నాయి. కొన్ని సిఫారసులను ఆమోదించడానికి ప్రభుత్వం 9 నుంచి 10 నెలలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితులలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని మనం గమనించవచ్చు. జులై 28, 2025న సుప్రీంకోర్టు కొలీజియం బాంబే హైకోర్టు న్యాయమూర్తులను నియమించడానికి మూడు పేర్లను సిఫారసు చేసింది. ఆగస్టు 13, 2025 రోజున వారి పేర్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. రెండు వారాల్లోనే ఆ పేర్లు క్లియర్​ అయ్యాయి.

ఆగస్టు 19, 2025న సుప్రీంకోర్టు కొలీజియం 14మంది న్యాయవాదుల పేర్లను బొంబాయి హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించడానికి సిఫారసు చేసింది.  ఇక్కడ మనం ఇంకో  ఆసక్తికరమైన విషయాన్ని పైన చెప్పినవిధంగా ఆగస్టు 25, 2025 రోజు సుప్రీంకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. వారు ముంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  ఆలోక్​ అరాధే,  పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  విపుల్​ పంచోలి. 

ఆయన గుజరాత్​ రాష్ట్రానికి చెందినవారు. ఆలోక్​ అరాదే మధ్యప్రదేశ్​ రాష్ట్రానికి చెందినవారు.  ఆ రెండు  రాష్ట్రాల నుంచి ఇప్పటికే ఇద్దరు న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ఉన్నారు. విపుల్​ పంచోలిని సుప్రీంకోర్టుకి సిఫారసు చేసే విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి బివి నాగరత్న తన అసంతృప్తి నోట్స్​ను కొలీజియం ముందు ఉంచారు. అది సిఫారసుతోపాటు సుప్రీంకోర్టు వెబ్​సైట్​లో ప్రచురించాలని కోరినట్టు పత్రికా కథనాలు.  కానీ, అది అమలుజరగలేదు.  ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే కొలీజియం సిఫారసు చేసిన బొంబాయికు 14 మంది న్యాయవాదులను 27 ఆగస్టు 2025న ఆమోదించింది.  కేవలం 8 రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇది న్యాయవ్యవస్థలో 8వ వండర్​గా భావించవచ్చు.

జస్టిస్​ నాగరత్న అసంతృప్తి నోట్ 

ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదు.  కొలీజియం సిఫారసు తేదీ నుంచి హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి కనీసం నాలుగు నెలల వ్యవధి తీసుకోవడం జరిగేది.  ఇది మంచి పరిణామమే కానీ ఈ 14మంది పేర్లను సిఫారసు చేసే తేదీనాటికి ఎన్నో  కొలీజియం సిఫారసులు  కేంద్ర ప్రభుత్వం దగ్గర  పెండింగ్​లో ఉన్నాయి.  ఈ 14మంది న్యాయమూర్తులలో ప్రధాన న్యాయమూర్తి మేనల్లుడు రాజ్ వాకోడ్​ ఉండటం విశేషం.  

ఈ 14 మంది న్యాయవాదులను సిఫారసు చేసింది జస్టిస్ ఆలోక్​ అరాదే  నేతృత్వంలోని  బొంబాయి హైకోర్టు కొలీజియం.  జస్టిస్​ విపుల్​ పంచోలి నియామకం గతంలో తిరస్కరించినప్పటికీ మళ్లీ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. జస్టిస్​ నాగరత్న  అసంతృప్తి నోట్​ఉన్నప్పటికీ అతను గుజరాత్​ రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తి.  న్యాయవ్యవస్థ  నియామకాలు,  న్యాయవ్యవస్థకి, కార్య నిర్వాహక వ్యవస్థకి మధ్య ‘ఇచ్చిపుచ్చుకునే’ పద్ధతిగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శలోని నిజానిజాలను అర్థం చేసుకోవాలంటే ఈ నియామకాలను, తేదీలను గమనిస్తే సరిపోతుంది.  ఎలాంటి వ్యాఖ్యానాలు అవసరం లేదు. న్యాయవ్యవస్థ స్వతంత్రతని మనం బేరీజు వేసుకోవచ్చు. 

తమ బంధువులు ఉన్నప్పుడు..

సుప్రీంకోర్టు కొలీజియంలోని న్యాయమూర్తుల బంధువుల పేర్లు న్యాయమూర్తులుగా నియమించడానికి పరిశీలనకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు కొలీజియం నుంచి అతను వైదొలగాలి.  ఆ ఖాళీని మరో సీనియర్​ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో భర్తీ చేయాలి.  ప్రధాన న్యాయమూర్తి బంధువు రాజ్ వాకోడ్​ విషయంలో ఏం జరిగిందో మనకు తెలియదు. మరో సీనియర్​ న్యాయమూర్తిగా కొలీజియం సమావేశం జరిగినట్టుగా అనిపించడం లేదు. 

అసంతృప్తి నోట్​లుసుప్రీంకోర్టులో ఉన్న ఏకైక మహిళా న్యాయమూర్తి బివి నాగరత్న  సుప్రీంకోర్టు  కొలీజియంలో ఆమె ఒకరు.  జస్టిస్ పంచోలికి  సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా  పదోన్నతి  కల్పించడానికి  వ్యతిరేకంగా ఆమె అసంతృప్తి నోట్​ను ఇచ్చారు.  అది బహిర్గతం కాలేదు.  కానీ, హిందుస్తాన్​ టైమ్స్ దాన్ని బహిర్గతం చేసింది.  కొలీజియంలో  భిన్నాభిప్రాయాలు కొత్తేమీ కాదు.  కొలీజియం  చాలాకాలంగా తెరవెనుకనే పనిచేస్తుంది. ఈ విషయాన్ని  కొన్ని సంఘటనలు తేటతెల్లం  చేస్తాయి. 2016లో  జస్టిస్​ జి చలమేశ్వర్​ కొలీజియం సమావేశాలకు హాజరుకావడానికి నిరాకరించారు. 

కొలీజియం చర్చలను, కారణాలని ప్రచురించాలని డిమాండ్​ చేశారు. కొలీజియం పనితీరును సవాలు చేసిన మొదటి వ్యక్తి జస్టిస్​ చలమేశ్వర్​.  జాతీయ  న్యాయ నియామకాల కమిషన్​ (ఎన్​జేఏసీ)ను కొట్టివేసిన తీర్పులో భిన్నాభిప్రాయ తీర్పును ఆయన రాశారు. 2018లో జస్టిస్​ మదన్​ బి లోకూర్​ సభ్యులు. ఆయన కొలీజియంలో ఉన్నప్పుడు  జస్టిస్​ ప్రదీప్​నంద్​ రాజోగ్​ని రాజేంద్ర మీనన్​ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా  పదోన్నతి కలిపించాలని తీర్మానించారు. కానీ, ఆ తీర్మానాన్ని సుప్రీంకోర్టు వెబ్​సైట్​లో ప్రచురించలేదు. 

జూనియర్లకు పదోన్నతి

జస్టిస్​ మదన్ లోకూర్​ పదవీ విరమణ తరువాత జస్టిస్ దినేష్​ మహేశ్వరి,  జస్టిస్​ సంజీవ్​ ఖన్నాలను సుప్రీంకోర్టుకు సిఫారసు చేశారు. 2019 జనవరిలో మదన్​ లోకూర్​ ఈ విషయం పట్ల తన  అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచారు.  కొలీజయం తిరిగి ఆ పేర్లను పున:పరిశీలించి కొత్త పేర్లను పంపించారనిచెప్పారు.  జస్టిస్​ అఖిల్​ ఖురేషి కన్నా జూనియర్లని సుప్రీంకోర్టుకి పదోన్నతిని కలిపించడాన్ని​ అప్పటి కొలీజియం సభ్యుడు జస్టిస్​ ఆర్​ఎఫ్​ నారిమన్​ వ్యతిరేకిస్తూ వాదనలు చేశారు. దీని ఫలితంగా సుప్రీంకోర్టులో ఆయన పదవీ విరమణ చేసేవరకు కొలీజియం సమావేశాలు జరగలేదు. చాలా ఆలస్యంగా జస్టిస్​ ఖురేషికి త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కలిపించారు. ఆ తరువాత ఆయన సుప్రీంకోర్టుకి పదోన్నతి పొందకుండానే పదవీ విరమణ చేశారు. ఈ భేదాభిప్రాయాలు న్యాయమూర్తుల లీకుల ద్వారా, వారి జ్ఞాపకాల ద్వారా ప్రజాక్షేత్రంలోకి ఈ సమాచారం అందింది. 

అరుణ్​ జైట్లీ వాదన

తక్కువస్థాయి వ్యక్తులను కొలీజియం సిఫారసు చేస్తుందని మాజీ కేంద్ర మంత్రి అరుణ్​ జైట్లీ తరచూ వాదించేవారు. జస్టిస్ ఎసి షా, జస్టిస్​ పట్నాయక్​లకి పదోన్నతి కలిపించకపోవడాన్ని ఆయన విమర్శించారు కూడా. చివరికి పట్నాయక్​ని  సుప్రీంకోర్టుకి పదోన్నతి  కలిపించారు. అదేవిధంగా జస్టిస్​ మురళీధర్​కి  కూడా  పదోన్నతి కల్పించలేదు. వీటన్నిటి  వెనుక కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ఉందని జస్టిస్ లోకూర్​లాంటి వాళ్ల అభిప్రాయం.  గతంలోని అసమ్మతి  అభిప్రాయాలకి,  జస్టిస్ నాగరత్న అసమ్మతికి ఒక భేదం ఉంది. ఆమె తన అసమ్మతి భావనను రాతపూర్వకంగా కొలీజియం ముందు ఉంచారు. అది అధికారికంగా బయటకు రాలేదు. అంతేకాని విషయం మొత్తం ప్రపంచానికి తెలిసిపోయింది.   కొలీజియం వ్యవస్థ అనేది కార్యనిర్వహణ అతిక్రమణకు వ్యతిరేకంగా న్యాయవ్యవస్థ ‘మూడవ న్యాయమూర్తుల’ కేసు ఫలితంగా ఏర్పడింది.  

సంవత్సరాలుగా జరిగిన నియామకాలను గమనిస్తే ఈ నియామకాలు ‘తక్కువ చెడు’ని వ్యవస్థకి  కలిగించాయని  చాలామంది  న్యాయనిపుణుల అభిప్రాయం. ఈ వాదనలో చాలామంది ఏకీభవించకపోవచ్చు.  ఇది  బలహీనంగా  కూడా ఉండవచ్చు.  జస్టిస్​ నాగరత్న అసమ్మతిని కొలీజియం పక్కనపెట్టడం, కేంద్ర ప్రభుత్వం తొందరగా నియామకాలను చేయడం, ముంబాయి హైకోర్టు న్యాయమూర్తుల నియామకం లాంటివి విశ్వసనీయతకు సంబంధించిన అంశాలు. కొలీజియం మెజారిటీ వాదంగా ఉండకూడదు. కొలీజియం సభ్యుల అభ్యంతరాలను పట్టించుకోకుండా నియామకాలు చేస్తే న్యాయ నియామకాలు సూత్రాల మీద కాకుండా సౌలభ్యం కోసమేనన్న అనుమానాలు బలపరిచినట్టుగా ఉంటుంది. చేయగలిగింది చాలామంది చేస్తున్నారు. భగవంతుడే కాపాడాలి. 

కొలీజియం పరిమితులు

కొలీజియం సిఫారసులను ప్రభుత్వం జాప్యం చేసినా, పెండింగ్​లో పెట్టినా వాటిని ప్రభుత్వంతో సంప్రదించడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇటీవలే  పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి అభయ్ ఓక్​ ప్రకారం ‘సుప్రీంకోర్టు ముందు బెంగళూరు బార్​ అసోసియేషన్​ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్​ సుప్రీంకోర్టులో పెండింగ్​లో ఉంది. ఈ విషయం గురించే,  ఈ జాప్యాల గురించే అది విచారణలో ఉంది. దీన్ని న్యాయపరంగా సుప్రీంకోర్టు  పరిష్కరించవచ్చు. ఏప్రిల్​ నెలలో  నేను ఇచ్చిన తీర్పులో సమస్యను పేర్కొన్నాను.  

సుప్రీంకోర్టు  ప్రచురించిన  డేటాను  నేను  ప్రస్తావించాను. ఆలస్యం ఎలా జరుగుతుందో చెప్పాను.  దాన్ని సరిదిద్దడానికి చాలాకాలంగా పెండింగ్​లో ఉన్న ఆ కోర్టు ధిక్కార పిటిషన్​ను  చేపట్టడం ఉత్తమమైన మార్గం’.  తమ బంధువులను, అనుయాయులను న్యాయమూర్తులుగా చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు,  ఇతరేతర పదవీ కాంక్షలు ఉన్నప్పుడు ఆ కోర్టు ధిక్కార కేసు పరిష్కారం అవుతుందని ఊహించలేం. 

- డా. మంగారి రాజేందర్, 
జిల్లా జడ్జి (రిటైర్డ్)