గోదాములు ఫుల్.. వడ్లకు జాగేది ? ఖాళీ చేయాలని కోరినా పట్టించుకోని కేంద్రం

గోదాములు ఫుల్.. వడ్లకు జాగేది ? ఖాళీ చేయాలని కోరినా పట్టించుకోని కేంద్రం
  • త్వరలో రానున్న వానాకాలం పంట
  • మిల్లింగ్ చేసిన బియ్యం నిల్వలకే ప్లేస్ లేదు 
  • ఖాళీ చేయాలని కోరినా పట్టించుకోని కేంద్రం
  • బియ్యం తరలించేందుకు రైళ్లను కేటాయించాలని 
  • ఇదివరకే కేంద్రానికి విజ్ఞప్తి చేసిన మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, వెలుగు: ఈ వానాకాలం సీజన్‌‌లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి సాగైంది. భారీగా దిగుబడులు వస్తాయనే అంచనాతో సర్కారు ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేస్తోంది. కానీ, రాష్ట్ర సర్కారు సేకరించే కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)తోపాటు కొత్త ధాన్యాన్ని నిల్వ చేసేందుకు స్టోరేజీ కొరత వేధిస్తోంది. ఒకవైపు పెద్ద ఎత్తున వడ్లు రానున్న నేపథ్యంలో నిల్వ చేసేందుకు గోదాములు ఎట్లా? అన్నది పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే భారత ఆహార సంస్థ(ఎఫ్‌‌సీఐ) గోదాములు ఫుల్‌‌ కావడంతో బియ్యం, ధాన్యం నిల్వ చేయడానికి స్థలం దొరక్క అధికారులు ఆందోళన చెందుతున్నారు. పోయిన వానాకాలంలో సేకరించిన వడ్లు మిల్లింగ్ చేసి తీసుకువస్తే నిల్వ చేసేందుకు స్టోరేజీ లేక మిల్లింగ్ నిలిపివేసే పరిస్థితి ఉంది.

గడువు సమీపిస్తున్నా ధాన్యం మిల్లింగ్ చేసే పరిస్థితి లేదని మిల్లర్లు అంటున్నరు. అయితే, ఈ సీజన్​లో వచ్చే వడ్లను నిల్వ చేయడానికి ఇంటర్మీడియెట్ గోదాములు అవసరమని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. ఈ స్టోరేజీ సమస్యను పరిష్కరించడం కోసం ఎఫ్‌‌సీఐ గోదాములు ఖాళీ చేయాలని.. ఇందుకోసం ప్రత్యేక రైల్వే రేక్‌‌లు కేటాయించాలని ఇప్పటికే రైల్వే మంత్రికి రాష్ట్ర సివిల్‌‌ సప్లయ్స్‌‌ మంత్రి ఉత్తమ్‌‌కుమార్​ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎగుమతులు లేకపోవడంతో ఎఫ్ సీఐకి చెందిన గోదాములన్నీ నిండిపోయాయి. మిల్లర్ల నుంచి తీసుకోవాల్సిన బియ్యం(సీఎంఆర్) నిల్వ చేసేందుకు ఖాళీ లేకపోవడంతో బియ్యం సేకరణ దాదాపుగా నిలిచిపోయింది. దీంతో బియ్యం నిల్వకు మిల్లర్లు తంటాలు పడుతున్నారు. 2024-–25 వానాకాలం సీజన్​కు సంబంధించిన సీఎంఆర్ సేకరణ తుది దశకు చేరుకుంది.

వానాకాలం కోటా పూర్తి చేసి యాసంగి సీజన్ పై అధికారులు దృష్టిపెట్టాల్సి ఉండగా గోదాములు నిండిపోవడం సివిల్ సప్లయ్స్ శాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. ఎఫ్​సీఐ గోదాముల సామర్థ్యం 22.61 లక్షల టన్నులు ఉండగా, ఇప్పటికే 21.72 లక్షల టన్నుల బియ్యం నిల్వలతో నిండిపోయాయి. ఇంకా 89 వేల టన్నులు నిల్వ చేసేంత స్థలం మాత్రమే ఖాళీగా ఉంది. ఎఫ్​సీఐ గోదాముల్లో దాదాపు 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్‌‌ను ఇతర రాష్ట్రాలకు రవాణా చేయకపోవడంతో గోదాములన్నీ ఫుల్ గా ఉన్నాయి. ఈ బియ్యాన్ని తరలించాలంటే భారీగా రైల్వే గూడ్సు వ్యాగన్లు(రేక్​లు) అవసరమని అధికారులు చెబుతున్నారు. “గోదాములు ఖాళీ చేస్తేనే కొత్త వడ్ల నిల్వ సాధ్యం. రైల్వే రేక్‌‌లు సమయానికి రాకపోతే నిల్వ, సేకరణ, మిల్లింగ్ ఇలా ఏకకాలంలో ఇబ్బందులు ఏర్పడతాయి” అని సివిల్‌‌ సప్లయ్స్‌‌ శాఖ అధికారులు అంటున్నారు.  

సీఎంఆర్​కూ స్టోరేజీ సమస్య 
రాష్ట్రంలో సీఎంఆర్ సేకరణకు కూడా స్టోరేజీ సమస్య అడ్డంకిగా మారింది. కొన్ని జిల్లాల్లో సీఎంఆర్ సేకరణ మెరుగ్గా ఉండగా, మరికొన్ని జిల్లాల్లో కనీసం 50 శాతం కోటా సేకరణ కూడా పూర్తి కాలేదు. కేంద్రం 2024-25 వానాకాలం కోసం సీఎంఆర్ డెలివరీ గడువును నవంబర్ 12, 2025 వరకు పొడిగించింది. అయితే పారాబాయిల్డ్ రైస్‌‌గా మాత్రమే సరఫరా చేయాలని షరతును విధించింది. గోదాముల లభ్యత లేకపోవడంతో సీఎంఆర్ చేసి ఇవ్వాలన్నా ఇబ్బందిగా మారుతోంది. అయితే, రేషన్ దుకాణాలకు సన్న బియ్యం సరఫరా కోసం సేకరణ వేగవంతం చేయడంతో ప్రక్రియ తుదిదశకు చేరింది. గత వానాకాలంకు సంబంధించి పెద్దపల్లి జిల్లాలో 99 శాతం, కరీంనగర్ జిల్లాలో 95 శాతం సీఎంఆర్ సేకరణ పూర్తయింది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అతి తక్కువగా 52 శాతం కోటా మాత్రమే పూర్తయింది. కాగా, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాలలో ఎఫ్​సీఐకు సంబంధించి 22 ప్రాంతాల్లో 6,06,45 టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములున్నాయి. వీటిలో కరీంనగర్ జిల్లా పరిధిలో 18,354  టన్నులు, పెద్దపల్లి జిల్లా పరిధిలో 4,519 టన్నులు నిల్వ చేసుకునేందుకు మాత్రమే అవకాశముంది. జగిత్యాలలోని 7 ప్రాంతాల్లో ఉన్న గోదాముల్లో స్టోరేజీ నిండిపోయింది. 86,667 టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన రాఘవపూర్ లోని గోదాములు కూడా ఫుల్ అయ్యాయి. ఇలా ఎక్కడ చూసినా ఎఫ్​సీఐ గోదాములన్నీ నిండిపోయి ఉన్నాయి.  

రవాణా చేస్తేనే సమస్యకు పరిష్కారం 
రాష్ట్రంలో ఉన్న ఎఫ్​సీఐ గోదాములు ఖాళీ చేయడానికి నెలకు 300 ప్రత్యేక రైలు రేక్‌‌లు అవసరం. రాష్ట్రంలో 7.80 లక్షల టన్నుల ముడి బియ్యం.. 1.67 లక్షల టన్నుల ధాన్యం మిల్లర్ల వద్ద ఉన్నాయి. గత వానాకాలం (2024–-25) సీజన్​కు సంబంధించి 5.44 లక్షల టన్నుల సీఎంఆర్, యాసంగికి సంబంధించి 14.92 లక్షల టన్నుల సీఎంఆర్ పంపిణీ నేటికీ పూర్తి చేయలేదు. స్టోరేజీ లేక పోవడంతో మిల్లింగ్ కార్యకలాపాలను నిలిపివేస్తున్నారు.

రాష్ట్రంలోని ఎఫ్​సీఐ గోడౌన్లను ఖాళీ చేయడానికి నెలకు కనీసం 300 ప్రత్యేక గూడ్సు రైళ్లు (రేక్‌‌లను) ఇవ్వాలని ఇటీవల రైల్వే మంత్రిని రాష్ట్ర సివిల్ సప్లయ్స్ మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి కోరారు. వీటిని రవాణా చేస్తేనే రాష్ట్రంలో స్టోరేజీ సమస్య తీరుతుందని కేంద్రానికి స్పష్టం చేశారు. గత వానాకాలం సీజన్ సీఎంఆర్ గడువును కూడా మరింత పెంచాలని కేంద్రాన్ని ఆయన కోరారు.