సోమేశ్ కుమార్ పైన ఎందుకు కేసు పెట్టలేదు? : రఘునందన్​రావు

సోమేశ్ కుమార్ పైన ఎందుకు కేసు పెట్టలేదు? : రఘునందన్​రావు

హైదరాబాద్, వెలుగు: సోమేశ్ కుమార్ భార్య పేరు మీద ధరణిలో 25 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏసీబీ కేసు నమోదు చేయకపోవడానికి కారణం ఏంటని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో సోమేశ్ కుమార్ సీఎస్​గా ఉన్నారని, రిటైర్ అయిన తర్వాత ప్రత్యేక సలహాదారుగా పని చేసినట్టు గుర్తు చేశారు. సర్వీస్​లో ఉండగా సోమేశ్ లబ్ధి పొందారని, తమ కుటుంబ సభ్యుల పేరు మీద ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఆధారాలు బయటికి వచ్చాయన్నారు. కానీ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ధరణి పేరుతో అక్రమ ఆస్తులు సంపాదించుకున్నట్టు సోమేశ్​పై ఆరోపణలు వచ్చాయన్నారు. దీనిపై ఎందుకు విచారణ చేయడం లేదని రాష్ట్ర సర్కార్​ను నిలదీశారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీస్​లో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. డీవోపీటీ నిబంధనలకు విరుద్ధంగా సోమేశ్ సర్వీసులో ఉంటూ.. అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. ధరణి స్థానంలో ‘భూమాత’ తీసుకొస్తామన్న రేవంత్ హామీ ఏమైందన్నారు. తప్పు చేసిన వారిని శిక్షిస్తామన్న రేవంత్ ప్రకటన ఎటుపోయిందని మండిపడ్డారు. 

హెటిరో సంస్థ భూముల సంగతేంటి?

‘‘హెటిరో సంస్థలకు ఇచ్చిన భూములపై మళ్లీ సమీక్షించాలని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఆ సంస్థకు ఇచ్చిన భూములు.. అక్రమమని తెలిసినా.. రేవంత్ ఎందుకు విచారణ జరపడం లేదు? ఆ సంస్థపై కేసు బుక్ చేసి.. ఆ భూమిలో ‘ఇది ప్రభుత్వ భూమి’ అని బోర్డు ఎందుకు పెట్టడం లేదు. ఆ ల్యాండ్ స్వాధీనం చేసుకోవడంలో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటి? ఐఏఎస్ అధికారులుగా పని చేసిన సోమేశ్, అరవింద్ కుమార్, రజత్​కుమార్, వెంకట్​రామిరెడ్డి.. ఇలా చాలా మందిపై ఆరోపణలు ఉన్నాయి’’అని రఘునందన్ రావు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ లీడర్ల అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేసిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే ఆ ఊసెత్తడం లేదన్నారు. బిహారీ ఐఏఎస్ బ్యాచ్ అధికారులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించిన రేవంత్.. వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే

అవినీతి, అక్రమాలపై లీకులు ఇస్తున్న మంత్రులు.. వాళ్లపై చర్యలు తీసుకోకుండా సెటిల్​మెంట్ చేసుకుంటున్నారా? అని రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. ఇదంతా చూస్తుంటే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అని స్పష్టమవుతున్నదన్నారు. ఒక నాణేనికి బొమ్మ, బొరుసులా ఈ రెండు పార్టీల తీరు ఉందని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే తప్పితే.. అక్రమార్కులపై చర్యలు మాత్రం కనిపించడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో అమ్మిన, కేటాయించిన భూములు, ధరణిలో మాయమైన ల్యాండ్, రిటైర్డ్ ఐఏఎస్​లకు అప్పనంగా కట్టబెట్టిన భూములు ఎంత అనేదానిపై విచారణ జరిపి శ్వేత పత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. 

కేటీఆర్ పిచ్చోడిలా మాట్లాడుతున్నడు

‘‘బీఆర్ఎస్ లీడర్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని మోదీ గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటే అంటూ ప్రచారం చేశారు. ఎప్పుడైనా మేము కాంగ్రెస్​తో కలిసి పోటీ చేశామా? కేటీఆర్ ఎన్ని అభాండాలు వేసినా.. అసత్య ప్రచారాలు చేసినా.. కాంగ్రెస్, బీజేపీ వేర్వేరు పార్టీలే..’’అని రఘునందన్ రావు స్పష్టం చేశారు. కేటీఆర్ పిచ్చోడిలా మాట్లాడుతున్నారని, నోరు అదుపులోకి పెట్టుకోవాలని హెచ్చరించారు. లేదంటే.. సిరిసిల్లలో బీఆర్ఎస్ ఖాళీ అవుతదని ఫైర్ అయ్యారు. ముందు సిరిసిల్ల పరిస్థితి చక్కదిద్దుకోవాలని కేటీఆర్​కు సూచించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటూ గెల్వదన్నారు. ఉద్యమకారులకు చేసిన అన్యాయానికి బీఆర్ఎస్ లీడర్లంతా అమరవీరుల స్తూపం వద్దకొచ్చి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరిలో ఖాళీ అయ్యే రాజ్యసభ సీటు శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మకు ఇచ్చి చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు.