టూత్ బ్రష్‌తో కూడా కరోనా మళ్లీ సోకుతుందా?

టూత్ బ్రష్‌తో కూడా కరోనా మళ్లీ సోకుతుందా?
  • కరోనా వచ్చిపోయినోళ్లకు మళ్లీ రావడానికి కారణమదేనా?
  • కరోనా నుంచి కోలుకున్న వాళ్లు పాత బ్రష్ వాడొద్దు
  • బ్రెజిల్ పరిశోధకుల సూచన

ప్రపంచం మొత్తం కరోనావైరస్‌తో వణికిపోతోంది. ఏ దేశంలో చూసినా కరోనా మరణాలే కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ ప్రభావం ప్రపంచం మీద పడి ఇప్పటికి దాదాపు రెండేళ్లు కావొస్తుంది. ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రావడంతో కరోనాను కొంచెంకొంచెంగా నియంత్రించగలుగుతున్నాం. అయితే ఒకసారి కరోనా బారినపడి వ్యక్తులు మరోసారి కూడా కరోనా బారినపడుతున్నారు. దీనికి గల కారణాలు ఏమైఉంటాయని శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఆ పరిశోధనల్లో కొన్ని కీలక అంశాలు బయటపడ్డాయి.

కరోనా బారినపడి ఇటీవల కోలుకున్న వ్యక్తులు మళ్లీ కరోనా బారినపడకూడదంటే సత్వరం వాళ్లు ఏంచేయాలో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా బారినపడినవాళ్లే కాకుండా.. ఇప్పటికీ కరోనా సోకని వాళ్లు కూడా ఈ నిబంధనను పాటిస్తే కరోనా బారినపడకుండా ఉండొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

కరోనా ఒకసారి వచ్చి తగ్గిన వాళ్లు వెంటనే వారి టూత్ బ్రష్‌ను మార్చాలని దంతవైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే కరోనా సోకిన సమయంలో వాడిన టూత్ బ్రష్‌‌లో వైరస్ దాగి ఉండే ఆస్కారముందట. దాంతో కరోనా తగ్గిన తర్వాత కూడా అదే టూత్ బ్రష్‌ వాడితే మళ్లీ కరోనా పాజిటివ్ వచ్చే అవకాశముందని డెంటిస్ట్‌లు చెబుతున్నారు. అంతేకాకుండా చాలామంది ఇంట్లో అందరూ ఒకే వాష్‌రూమ్‌ను ఉపయోగిస్తుంటారు. కాబట్టి పాత బ్రష్ వాడటం వల్ల వైరస్ వాష్‌రూమ్‌లో కూడా ఉండే చాన్స్ ఉంటుందని వైద్యుల అభిప్రాయం. 

‘మీరు లేదా మీ కుటుంబ సభ్యులు లేదా మీ ఫ్రెండ్ సర్కిల్‌లోని ఎవరైనా కరోనా బారినపడి కోలుకుంటే.. వెంటనే టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ మొదలైన వాటిని మార్చండి. ఇవి వైరస్‌ను వ్యాప్తిచేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి’ అని ఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్‌లో డెంటల్ విభాగ అధిపతి డాక్టర్ ప్రవేష్ మెహ్రా అన్నారు.

టూత్ బ్రష్ కూడా వైరస్ వ్యాప్తికి కారణమవుతుందనే విషయాన్ని ఆకాష్ హెల్త్‌కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ భూమికా మదన్ అన్నారు. సీజనల్‌గా వచ్చే ఫ్లూ, దగ్గు మరియు జలుబు నుండి కోలుకున్న వాళ్లు కూడా టూత్ బ్రష్ మరియు టంగ్ క్లీనర్‌లను మార్చాలని ఆమె సిఫారసు చేశారు. 

‘మేం కరోనా రోగులకు కూడా ఇదే సలహా ఇస్తున్నాం. మీలో కరోనా లక్షణాలు కనిపించిన 20 రోజుల తర్వాత మీరు మీ టూత్ బ్రష్ మరియు టంగ్ క్లీనర్ మార్చాలి. టూత్ బ్రష్ మీద ఉండే బ్యాక్టీరియా, వైరస్ వల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. నోటిలో వైరస్ లేదా బ్యాక్టీరియాను తగ్గించడానికి మౌత్ వాష్ లేదా బీటాడిన్ గార్గిల్ ఉపయోగించాలి. మౌత్ వాష్ అందుబాటులో లేకపోతే గోరువెచ్చని సెలైన్ వాటర్‌తో నోరు శుభ్రం చేసుకోవడం కూడా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా.. నోటి పరిశుభ్రతను పాటిస్తూ.. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలి’ అని డాక్టర్ భూమికా మదన్ చెప్పారు.

దీనికి సంబంధించి బ్రెజిల్ శాస్త్రవేత్తలు ఒక స్టడీని విడుదలచేశారు. ‘ఒకసారి కరోనా బారినపడిన వాళ్లు పాత బ్రష్, టంగ్ క్లీనర్‌లను మార్చాలి. ఎందుకంటే బ్రష్, టంగ్ క్లీనర్లు వైరస్‌కు రిజర్వాయర్లుగా పనిచేస్తున్నాయి. వీటి ద్వారా వైరస్ ఇతరులకు సులభంగా వ్యాప్తి చెందుతుంది’ అని ఆ దేశ పరిశోధకులు ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన జర్నల్ ఆఫ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్‌లో ప్రచురించారు.