రూ.3 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించి.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య..యాక్సిడెంట్గా చిత్రీకరించే యత్నం

రూ.3 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించి.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య..యాక్సిడెంట్గా చిత్రీకరించే యత్నం
  •      ముగ్గురు నిందితులు అరెస్ట్

మంచిర్యాల, వెలుగు: భర్తపై రూ. 3 కోట్లకు ఇన్సూరెన్స్  చేయించి ప్రియుడితో కలిసి భర్తను చంపించింది. మంచిర్యాల డీసీపీ ఎగ్గని భాస్కర్  మంగళవారం తన ఆఫీస్​లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్  మండలం గుడిపేట ఆర్అండ్ఆర్  కాలనీకి చెందిన సాయిని కుమార్(45), భారతి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

అదే కాలనీకి చెందిన వ్యాపారి లగిశెట్టి సురేందర్, భారతి మధ్య కొన్నేండ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. విషయం భర్తకు తెలిసి మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగి వచ్చి భార్యను కొట్టి హింసించేవాడు. ఈక్రమంలో గుడిపేటకు చెందిన రామ్​ మల్లేశ్  వద్ద రూ.60 వేలు బాకీ తీసుకున్నాడు. అప్పు తీర్చకపోవడంతో మల్లేశ్  చాలా సార్లు కుమార్  ఇంటికి వచ్చి గొడవ చేయడంతో పాటు చంపుతానని బెదిరించాడు. 

దీంతో భారతి, సురేందర్  కలిసి మల్లేశ్ తో కుమార్​ను చంపించాలని ప్లాన్  చేశారు. గత ఏడాది జనవరి నుంచి కుమార్ కు తెలియకుండా అతడి పేరిట వివిధ కంపెనీల్లో రూ.3 కోట్లకు యాక్సిడెంటల్  ఇన్సూరెన్స్  పాలసీలు చేయించారు. కుమార్ ను చంపేందుకు రామ్  మల్లేశ్ తో రూ.12 లక్షలకు ఒప్పందం చేసుకొని రూ.2 లక్షలు చెల్లించింది. మిగిలిన రూ. 10 లక్షలు కుమార్ ను చంపిన తరువాత ఇన్సూరెన్స్  క్లెయిమ్  చేసుకొని చెల్లిస్తామని ఒప్పుకున్నారు. మల్లేశ్​ మంచిర్యాలకు చెందిన తాపీ మేస్త్రీ శ్రీరామ్ కుమార్ తో కలిసి ఈ నెల 22న రాత్రి సాయిని కుమార్ ను మద్యం తాగుదామని పిలిచాడు. 

ముల్కల్ల పంపు హౌస్  రోడ్ లో ముగ్గురు కలిసి మద్యం తాగిన తరువాత కుమార్ పై సుత్తితో దాడి చేసి, చనిపోయాడని భావించి వెళ్లిపోయారు. రాత్రి ఒంటి గంట టైమ్ లో అటుగా వెళ్లిన ప్రయాణికులు చూసి హాజీపూర్  పోలీసులకు సమాచారం అందించారు. 

వారు108లో మంచిర్యాల జీజీహెచ్ కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు కరీంనగర్  హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ 23న ఉదయం కుమార్  చనిపోయాడు. మృతుడి తల్లి లక్ష్మి  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణలో సాయిని కుమార్​ది హత్యగా నిర్ధారించారు. 

ఈ కేసులో శ్రీరామ్ కుమార్  పరారీలో ఉండగా, మిగిలిన ముగ్గురిని మంగళవారం అరెస్ట్​ చేసి రిమాండ్​కు పంపించారు. ఏసీపీ ఆర్.ప్రకాశ్, రూరల్ సీఐ జి. రవీందర్, హాజీపూర్  ఎస్సై కిరణ్​కుమార్ ను డీసీపీ అభినందించారు.