భర్తకు తల కొరివి పెట్టిన భార్య

భర్తకు తల కొరివి పెట్టిన భార్య

కృష్ణా జిల్లా: అనారోగ్యంతో చెట్టంత కొడుకు చనిపోతే కడసారి చూపులు చూడడానికి రాలేదు ఆ తండ్రి. కనీసం తల కొరివి పెట్టేందుకైనా రావాలని కోరినా ససేమిరా అన్నాడు. దీంతో మృతుడి భార్య కంటతడిపెట్టుకుని విలపించింది. విషయం తెలిసిన కొందరు చివరకు జిల్లాకు చెందిన  మంత్రి  ఆళ్ల నాని దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి తక్షణ ఆర్ధిక సాయం పంపించారు. మృతుడు ప్రసాద్ తండ్రి రిటైర్డు టీచర్ కావడంతో ఆయనకు అధికారులతో మాట్లాడి బుజ్జగించగా కడసారి చూపులకు వచ్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మాచవరం రెండో డివిజన్ లో జరిగిందీ ఘటన.
మాచవరంలో ప్రసాద్, నాగమణి దంపతులు నివసిస్తున్నారు. 15 రోజుల కిందట అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స ఫలించక నిన్న చనిపోయాడు. దంపతులకు మగ పిల్లలు లేకపోవడం.. తండ్రి రిటైర్డు టీచర్ ఉన్నా వేరే చోట నివసిస్తుండడంతో కొడుకు అంత్యక్రియలకు, తలకొరివి పెట్టేందుకు రమ్మని సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలకు కాదు కదా.. వచ్చి చూసేందుకే తండ్రి అంగీకరించలేదు. ఆర్ధికంగా సర్వస్వం భర్త ట్రీట్మెంట్ కే ఖర్చు పెట్టుకున్న నాగమణి అంత్యక్రియలకు డబ్బులు లేక ఇబ్బందిపడుతుండడంతో మంత్రి ఆళ్లనాని సహాయం పంపించారు. అయితే హిందూ ధర్మం ప్రకారం తల కొరివి పెట్టేందుకు ఇష్టపడని అతని తండ్రి  వాళ్లు వీళ్లు నచ్చచెప్పడంతో తన కొడుకు ప్రసాద్ చివరి చూపుల కోసం వచ్చి దూరం నుంచే చూసి వెళ్లిపోయాడు. దీంతో చేసేదేమీలేక నాగమణి స్వయంగా తన భర్తకు తలకొరివి పెట్టి కడసారి అంతిమ సంస్కారాలు పూర్తి చేసింది.