ప్రమాదం కాదు పక్కా మర్డర్.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను చంపించిన భార్య

ప్రమాదం కాదు పక్కా మర్డర్.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను చంపించిన భార్య

మంచిర్యాల జిల్లాలో హత్యచేసి  రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన ఓ కేసు మిస్టరీని చేధించారు మంచిర్యాల పోలీసులు.ఇన్సురెన్స్ డబ్బులు, ప్రియుడితో వివాహేతర సంబంధం కోసం భార్యే  భర్తను చంపించినట్లు తేల్చారు పోలీసులు. 

మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. హాజీపూర్ మండలం గుడిపేట గ్రామానికి చెందిన సాయిని కుమార్ అనే వ్యక్తి  మే  23 అర్ధరాత్రి హాజీపూర్ మండల ముల్కల శివారులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుమార్ భార్య సాయిని భారతికి, లగిశెట్టి సురేందర్ అనే వ్యక్తితో వివాహేతర  సంబంధం ఉంది. భర్త అడ్డు తొలగించుకోవడంతో పాటు, అతని పేరు మీద ఉన్న ఎల్ఐసీ ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేయాలని వీరిద్దరూ ప్లాన్  వేశారు. ఇన్సూరెన్స్ డబ్బులు రాగానే రూ. 10 లక్షల  సుపారీ ఇస్తామని నమ్మించి, రామ్ మల్లేష్, శ్రీరామ్ కుమార్ అనే ఇద్దరు కిరాయి హంతకులను రంగంలోకి దించారు.

ప్లాన్  ప్రకారం.. మే  23 అర్ధరాత్రి నిందితులు మల్లేష్, శ్రీరామ్ కుమార్‌లు మృతుడు సాయిని కుమార్‌కు మద్యం తాగించారు. ఆ తర్వాత సుత్తితో తలపై దారుణంగా కొట్టి హత్య చేశారు. అనంతరం ఇది రోడ్డు ప్రమాదంలో జరిగిన మరణంగా నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే కుమార్ తల్లికి కోడలి ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రంగంలోకి దిగిన మంచిర్యాల పోలీసులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసును  దర్యాప్తు చేశారు. భారతికి ఉన్న వివాహేతర సంబంధం కోణంలో విచారించడంతో ఈ నిజాం వెలుగుచూసింది. ఇది ప్రమాదం కాదు, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యేనని పోలీసులు నిర్ధారించారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు డీసీపీ తెలిపారు. ఇంకా విచారణ పూర్తి కాలేదని, నిందితులను కస్టడీకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరిస్తామన్నారు.

అతి తక్కువ రోజుల్లోనే ఈ గుట్టు విప్పిన మంచిర్యాల్ రూరల్ సీఐ జి. రవీందర్, హాజీపూర్ ఎస్సై కిరణ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ సదానందం, పీసీలు చంద్రశేఖర్, గంగాధర్‌లను డీసీపీ భాస్కర్ ప్రత్యేకంగా అభినందించారు.