బ్రోకర్ మొగుళ్లు : పెళ్లాడుతారు..వ్యభిచారంలోకి దించుతారు

బ్రోకర్ మొగుళ్లు : పెళ్లాడుతారు..వ్యభిచారంలోకి దించుతారు

స్త్రీలను గౌరవిద్దాం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం అనే నినాదాలు RTC బస్సులకే పరిమితమా. ఈ విషయం తెలిస్తే ఇలాంటి అనుమానాలు ప్రతి ఒక్కరికీ రావాల్సిందే. అసలే పేదరికం. దీన్ని ఆసరాగా చేసుకుంటారు బడా బాబులు. వయసులోకి వచ్చిన అమ్మాయిలకు వల వేస్తారు. పైసా కట్నం లేకున్నా పెళ్లి చేసుకుంటామని చెబుతారు. బరువు దించుకోవాలనుకునే తల్లిదండ్రులు పెళ్లి చేసేస్తారు. కానీ అక్కడే మొదలవుతాయి అసలు కష్టాలు. పెళ్లి తర్వాత భార్యలను వ్యభిచారంలోకి దించుతారు. లేదంటే ఇష్టంవచ్చినట్లు కొడుతారు. అన్నంపెట్టరు. మీ ఇంటికి వెళ్లిపో అని బెదిరాస్తారు. పుట్టింట్లో తల్లిదండ్రుల బాధలు చూడలేక..ఇష్టంలేకున్నా భర్తలు చెప్పినట్లు చేస్తూ నిత్యం నరకం అనుభవస్తున్నారు అమాయకపు ఆడపడుచులు. ఈ సంఘటన అక్కడక్కడ సీక్రెట్ గా జరుగుతున్నప్పటికీ..బీహార్ లో మాత్రం విచ్చలవిడిగా వ్యాపారం చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు బ్రోకర్ మొగుళ్లు.

ఇటీవల ఎన్నికల సమయంలో ప్రచారం కోసం పలువురు రాజకీయ నాయకులు అక్కడికి వెళ్లగా..ఇలాంటి తమ భర్తల నుంచి విముక్తి కలిగించాలంటూ..అదే మాకు మీరిచ్చే గొప్ప పథకాలు అని కొందరు మహిళలు వేడుకున్నారంటే పరిస్థితి ఎంతకు దిగజారిందో తెలుస్తుంది.

కొందరి మహిళల కష్టాలు..

మహిళ పేరు మార్చాం..(సోనమ్) తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. ఇరుగుపొరుగువారు ఓ వ్యక్తితో మాట్లాడి ఆమె పెళ్లిచేశారు. కానీ ఆమెను వ్యభిచారం చేయాలంటూ భర్త ఒత్తిడి చేసేవాడు. కాదంటే కొట్టేవాడు. ఓరోజు తన ఇద్దరు పిల్లలతో కలిసి సోనమ్ కతిహార్‌ కు పారిపోయారు. ఇప్పుడు ఆమె ఇక్కడే ఓ కిరాణాషాపు నడుపుకుంటున్నారు. పెళ్లైన మొదటి సంవత్సరం బాగానే ఉన్నాడు. ఆ తర్వాత వ్యభిచారం చేస్తేనే భోజనం పెడతామని అత్తమామలతో కలసి చెప్పాడు. కాదంటే ఆకలితో మాడిపోవాల్సిందేనన్నారు అని అక్కడి పెద్దలకు సోనమ్ చెప్పింది.

రాబియాను 30 వేల రూపాయలకు అమ్మేశారు. ఆమె అత్త ఈ ఒప్పందాన్ని కుదిర్చింది, తల్లిదండ్రులు పెళ్లి చేశారు. పెళ్లి అనే ముసుగులో వ్యభిచారకూపంలోకి దిగబోతున్నామని రాబియా, సోనమ్‌ లకు తెలియదు. రాబియా కూడా కతిహార్‌ కు తన పిల్లలతో కలిసి పారిపోయి వచ్చారు.

అధికారిక లెక్కల ప్రకారం, గత పదేళ్లలో మహిళల అక్రమ రవాణాపై బిహార్ పోలీసులు 753 కేసులు నమోదు చేశారు. 1049 మంది మహిళలను రక్షించారు. ఇలాంటి నీచులపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు స్థానికులు.