
- కర్నాటక యాద్గిర్ జిల్లాలో ఘటన
బెంగళూరు: సెల్ఫీ తీసుకుందామంటూ చెప్పిన భార్య.. భర్తను బ్రిడ్జి మీది నుంచి తోసేసింది. అయితే, సమయానికి స్థానికులు స్పందించడంతో భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన కర్నాటకలోని యాద్గిర్ జిల్లాలో జరిగింది. పుట్టింటికెళ్లిన భార్యను తీసుకెళ్లడానికి భర్త వెళ్లాడు. భార్యను తీసుకుని బైక్ పై తిరిగొస్తుండగా కృష్ణా నదిపై ఉన్న గుర్జాపూర్ బ్రిడ్జి మీదకు రాగానే భార్య సెల్ఫీ తీసుకుందామని అడిగింది. భార్య కోరికను మన్నించిన భర్త బ్రిడ్జిపై బైక్ ను ఆపాడు. అయితే, సెల్ఫీ తీసుకుంటుండగా భర్తను ఆమె నదిలోకి తోసేసింది. నీళ్లలో పడిపోయిన అతడు రక్షించమని అరవసాగాడు.
నదిలో కొట్టుకుపోతూ ఒక బండరాయిని పట్టుకుని ప్రాణాలను కాపాడుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు తాడు సహాయంతో అతడిని రక్షించారు. ప్రాణాలతో బయటపడిన అనంతరం భార్యే తనను బ్రిడ్జిపై నుంచి తోసేసిందని భర్త ఆరోపించాడు. భార్య మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. ఈ ఘటనపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
‘‘సెల్ఫీ కోసం ఆమె పట్టుబట్టడంతో నేను అంగీకరించాను. ఫొటో తీసుకుంటుండగా నన్ను హఠాత్తుగా నదిలోకి తోసేసి చంపడానికి ప్రయత్నించింది. ప్రవాహానికి కొట్టుకుపోయిన నేను నది మధ్యలో ఉన్న ఒక బండరాయిని పట్టుకున్నాను. స్థానికులు రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డాను”అని ఫిర్యాదులో పేర్కొన్నాడు.