భర్త హత్య కేసులో భార్యకు జీవిత ఖైదు ..మెదక్ జిల్లా కోర్టు జడ్జి తీర్పు

భర్త హత్య కేసులో భార్యకు జీవిత ఖైదు ..మెదక్ జిల్లా కోర్టు జడ్జి తీర్పు

మెదక్​ టౌన్​, వెలుగు:  భర్త హత్య కేసులో భార్యకు జీవిత ఖైదు, రూ.5 వేలు జరిమానా విధిస్తూ మెదక్ జిల్లా కోర్టు జడ్జి నీలిమ శుక్రవారం తీర్పు ఇచ్చారు. ఎస్పీ డీవీ శ్రీనివాస్​రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్​జిల్లా హవేళీ ఘనపూర్​ మండలం శమ్నాపూర్ గ్రామానికి చెందిన సంగపోల్ల మల్లయ్య, లక్ష్మి దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. లక్ష్మి అదే గ్రామానికి చెందిన జాల రాందాస్‌‌‌‌తో వివాహేతర సంబంధం పెట్టుకోగా..   

పెద్ద మనుషుల్లో పంచాయితీ పెట్టి చెప్పినా ఆమెలో మార్పులేదు. 2020, ఫిబ్రవరి 24న దంపతులు మరోసారి గొడవ పడ్డారు. దీంతో మల్లయ్య తమ్ముడు నర్సింలు వెళ్లి సర్ది జెప్పివెళ్లాడు. మరుసటి రోజు ఉదయం ఇంట్లో మల్లయ్య మృతిచెంది ఉండడంతో కుటుంబసభ్యులు లక్ష్మి, జాల రాందాస్‌‌పై అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్​కోర్టులో చార్ట్ షీట్ దాఖలు చేశారు. కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితురాలు లక్ష్మికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.  కేసులో శిక్షపడేలా వ్యవహరించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు, పోలీసులను ఎస్పీ శ్రీనివాస రావు అభినందించారు.