పంటలను ఆగం పట్టిస్తున్నయ్.. చేన్లలో అడవి పందులు, జింకల బీభత్సం

పంటలను ఆగం పట్టిస్తున్నయ్..   చేన్లలో అడవి పందులు, జింకల బీభత్సం

 

  • మహబూబ్​నగర్​, నారాయణపేట జిల్లాల్లో పంటలను నాశనం చేస్తున్న వన్యప్రాణులు
  • పత్తి కాయలను మేస్తుండడంతో నష్టపోతున్న రైతులు
  • కాపలా కాస్తున్నా నియంత్రించలేని పరిస్థితి

మహబూబ్​నగర్​, వెలుగు: రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ వానాకాలం సీజన్​లో పంటల సాగు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సీజన్​ మొదట్లో వర్షాభావ పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనగా.. గత నెల కురిసిన భారీ వర్షాలకు చేలలో నీళ్లు నిలిచి తెగుళ్లు సోకాయి. మందులు, ఎరువులు చల్లుకొని ఎలాగోలా పంటలను కాపాడుకుంటే.. ఇప్పుడు వన్యప్రాణులు చేన్ల మీద పడి మేస్తున్నాయి. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. కష్టం మొత్తం కండ్ల ముందే నాశనం అవుతుండటంతో లబోదిబోమంటున్నారు.

పత్తి, మక్క, పల్లి, వరి చేన్లపై..

మహబూబ్​నగర్​, నారాయణపేట జిల్లాల్లోని పెద్దదర్పల్లి, పల్లెమోని కాలనీ, పిల్లిగుండు, హన్వాడ, నాయినోనిపల్లి, బుద్దారం, గుడిమల్కాపూర్​, దాచక్​పల్లి, కొత్తపేట, కొనగట్టుపల్లి, అమ్మాపూర్​, కురుమూర్తి, చిన్నచింతకుంట, వెంకంపల్లి, పేరూరు, రేకులంపల్లి, చిన్నరాజమూరు, గుడిబండ, ఉందేకోడ్​, పుట్టపల్లి, మాగనూరు, తండిగి, కృష్ణ, నర్వ, నారాయణపేట, ధన్వాడ ప్రాంతాల రైతులు ఏండ్లుగా పత్తి, పల్లి, మక్క, వరి పంటలు సాగు చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతాల్లో కొంత కాలంగా వన్య ప్రాణుల బెడద ఎక్కువైంది. గుట్టలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అడవి పందులు, నెమళ్లు, కృష్ణానది తీరం వెంట ఉన్న ప్రాంతాల్లో జింకల అలజడి ఎక్కువగా ఉంది. అయితే ఇవి ఆహారం కోసం పొలాల్లోకి చొరబడుతున్నాయి. మందలు మందలుగా వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయి. ప్రస్తుతం పత్తి చేన్లకు కాయలు పట్టగా.. చేన్ల మీద పడి పత్తి కాయలు తింటున్నాయి. మక్క చేనులలో అడవి పందులు మకాం వేస్తున్నాయి. 

ఈ పంట ఏపుగా ఉండటంతో పాటు గుబురు గుబురు ఉండటంతో ఇక్కడే ఉండి పంటలను మొత్తం మేస్తున్నాయి. నాలుగు రోజుల కిందట అమ్మాపూర్​ గ్రామ శివారులోని పత్తి చేనులోకి అడవి పందుల మంద చొరబడింది. రైతు మూడు ఎకరాల్లో పత్తి వేయగా.. ప్రస్తుతం కాయలు పట్టాయి. రాత్రి చేనులోకి చొరబడిన అడవి పందులు దాదాపు అర ఎకరంలో పత్తి కాయలు తిన్నాయి. నెల రోజుల్లో పంట చేతికొచ్చే సమయంలో వన్యప్రాణులు పంటల మీద పడి దాడులు చేస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణుల బారి నుంచి తమ పంటలను కాపాడాలని ఫారెస్ట్​ ఆఫీసర్లను కోరుతున్నారు. 

మైకులు పెట్టినా అదుర్తలేవు..

చేన్లలోకి వన్యప్రాణులు రాకుండా ఉండేందుకు రైతులు రక్షణ చర్యలు చేపడుతున్నా ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు. చాలా మంది రైతులు పొలాల చుట్టూ చీరలు కడుతున్నారు. కొందరు బైడింగ్​ వైర్లు, ఇంకొందరు సోలార్​ ఫెన్సింగ్​ను ఏర్పాటు చేసుకున్నారు. మనుషులు అదిలిస్తున్నట్లు, కుక్కలు అరుస్తున్నట్లు సౌండ్​ మైకులనూ ఏర్పాటు చేసుకున్నారు. అయినా కూడా వన్యప్రాణులు అదరడం లేదు. మైకులు ఏర్పాటు చేసినా ఒకటి, రెండు రోజుల తర్వాత మళ్లీ చేన్లలోకి వస్తున్నాయి. చీరలు, బైండింగ్​ వైర్​తో కంచె ఏర్పాటు చేసినా.. జింకలు వాటి మీద నుంచి దూకి పంటల మీద పడుతున్నాయి. సోలార్​ ఫెన్సింగ్​ ఉన్న పొలాల్లోకి మాత్రమే అవి రావడం లేదు.

పరిహారం అందిస్తాం

వన్యప్రాణుల దాడుల్లో పంటలు దెబ్బతింటే రైతులు ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​ను సంప్రదించాలి. ఏ ప్రాంతంలో, ఎంత పంట నష్టం జరిగిందో దరఖాస్తు ఇస్తే.. ఆ ప్రాంత వ్యవసాయాధికారితో విచారణ చేయిస్తాం. వారు ఇచ్చే రిపోర్టును ఉన్నతాధికారులకు పంపించి నష్టపరిహారం అందిస్తాం. ఇందుకు రైతులు వారి ఆధార్​ కార్డు, పట్టాదారు పాస్​ పుస్తకం, బ్యాంక్​ అకౌంట్​ నంబరు ఇవ్వాలి. ఆన్​లైన్​ ద్వారా పరిహారం డబ్బులు అందుతాయి.
- కమాలొద్దీన్​, ఫ్లయింగ్​ స్వ్కాడ్​ పార్టీ, మహబూబ్​నగర్​