భీమారం మండలంలోని నాలుగేండ్ల బాలికపై అడవి పంది దాడి

భీమారం మండలంలోని నాలుగేండ్ల బాలికపై అడవి పంది దాడి

జైపూర్(భీమారం), వెలుగు: మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని కాజిపల్లి గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ నాలుగేండ్ల బాలికపై అడవి పంది దాడి చేసింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోదరి రాజమణి -పురుషోత్తం దంపతుల కూతురు స్ఫూర్తి రాణి ఉదయం ఇంటి ముందు ఆడుకుంటోంది. ఆ సమయంలో ఇంటి దగ్గర్లోని పత్తి చేనులో నుంచి వచ్చిన ఓ అడవి పంది ఇంట్లోకి చొరబడి వాకిట్లో అడుకుంటున్న బాలికపై దాడి చేసింది. దీంతో బాలిక ఎగిరి సిమెంటు ఇటుకలపై పడడంతో తలతో పాటు ఒంటి నిండా తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కుతరలించారు. ఫారెస్ట్ ఆఫీసర్లు గ్రామానికి చేరుకొని పంచనామా చేశారు. బాలికకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

పదేండ్ల బాలికపై కుక్కల దాడి..

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలలోని హైటెక్​ సిటీ కాలనీలో ఓ పదేండ్ల బాలికపై వీధి కుక్కులు దాడి చేశాయి. పెద్దపల్లి జిల్లా సుందిళ్లకు చెందిన మారం రాములు శనివారం సాయంత్రం హైటెక్  సిటీ కాలనీలో ఉండే బంధువుల ఇంటికి కుటుంబసభ్యులతో కలిసి వచ్చాడు. రాములు కూతురు సుధీక్ష ఆదివారం ఉదయం పక్కనే ఉన్న ఓపెన్​జిమ్​గ్రౌండ్​లో ఆడుకునేందుకు మరికొందరు పిల్లలతో కలిసి వెళ్లింది. అక్కడ ఉన్న కుక్కలు ఒక్కసారిగా బాలికపై దాడి చేశాయి. స్థానికులు గమనించి బాలికను కాపాడారు. సుధీక్ష మెడకు తీవ్ర గాయాలు కాగా మంచిర్యాల జీజీహెచ్​కు, అక్కడి నుంచి కరీంనగర్​లోని ఓ ప్రైవేట్​హాస్పిటల్​కు తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్టు బంధువులు తెలిపారు.