
- కవ్వాల్ అభయారణ్యంలో సంరక్షణ చర్యలు
- రూ.61 కోట్లతో కొనసాగుతున్న పనులు.. మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశం
- అటవీ, ఎన్‌హెచ్ శాఖల ఉమ్మడి పర్యవేక్షణ
నిర్మల్, వెలుగు: కవ్వాల్ అభయారణ్యంలో సంచరించే వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడు తోంది. మూగజీవాలు యాక్సిడెంట్లబారినపడి చనిపోకుండా అండర్‌పాస్‌లు నిర్మిస్తోంది. కవ్వాల్ అభయారణ్యంలో వన్యప్రాణుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే అభయారణ్యాల్లో నిర్మించే హైవేలు, రోడ్లను దాటే క్రమంలో వాహనాలు ఢీకొని వణ్యప్రాణులు చనిపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే వాటి సంరక్షణ విషయంలో అటవీ శాఖ అధికారులు మరింత పకడ్బందీగా ఉంటున్నారు. 61 నేషనల్ హైవేలో యానిమల్ అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నారు. హైవే నిర్మాణ సమయంలోనే వన్య ప్రాణుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత నేషనల్ హైవే (ఆర్ అండ్ బీ) శాఖ అధికారులకు అటవీ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే వన్యప్రాణులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలను అటవీశాఖ అధికారుల సహాయంతో గుర్తించి అక్కడ యానిమల్ అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు.
చివరి దశలో పనులు
మహారాష్ట్రలోని కల్యాణ్ నుంచి నిర్మల్ మీదుగా జగిత్యాల వరకు ఉన్న ఎన్‌హెచ్61లో.. నిర్మల్ నుంచి ఖానాపూర్ వరకు అటవీ శాఖ అధికారులు గుర్తించిన ఏడు చోట్ల యానిమల్ అండర్ పాస్‌లు నిర్మిస్తున్నారు. మొత్తం రూ.61 కోట్ల వ్యయంతో సాగుతున్న పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయి. మరో మూడు నెలల్లో నిర్మా ణాలు పూర్తి చేసి హైవేను క్లియర్ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఫ్లై ఓవర్ లను తలపించేలా దిమ్మదుర్తి ప్రధాన రోడ్డుపై మూడు చోట్ల అండర్‌పాస్‌లు, సాంగ్వి వద్ద రెండు, మామడ మండలం బోరిగాం వద్ద ఒకటి, ఎగ్బాల్పూర్ సమీపంలోని ఖానాపూర్ జంక్షన్ వద్ద మరో అండర్ పాస్ నిర్మిస్తున్నారు.
మారిన ఎస్టిమేషన్స్..
ఇప్పటికే నిర్మాణం పూర్తిచేసిన 61 ఎన్‌హెచ్‌ను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోకి తీసుకొచ్చారు. దీన్ని నేషనల్ హైవే (ఆర్ అండ్ బీ) పర్యవేక్షిస్తోంది. మొదట్లో నిర్మల్ నుంచి ఖానాపూర్ వరకు ఫారెస్ట్ క్లియరెన్స్ లభించడంతో రూ.100 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టారు. ఈ క్రమంలోనే వన్యప్రాణుల సంరక్షణ విషయంలో అటవీ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అండర్ పాస్‌లు నిర్మించాలని షరతు విధించింది. అండర్ పాసుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తేనే హైవే నిర్మాణానికి అనుమతులు జారీ చేస్తామంటూ స్పష్టం చేసింది. దీంతో చాలా రోజులు హైవే పనులు నిలిచిపోయాయి. ఎట్టకేలకు ప్రభుత్వం అండర్ పాసుల నిర్మాణానికి రూ.61 కోట్లు ప్రత్యేకంగా మంజూరు చేసింది.