
కొత్తపల్లి, వెలుగు: అర్హులైన నిరుపేదలందరికీ దశలవారీగా డబుల్ బెడ్రూం ఇళ్లను అందిస్తామని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలగందల్, ఖాజీపూర్ గ్రామాలకు చెందిన 40 మంది లబ్ధిదారులకు కలెక్టర్ఆర్.వి.కర్ణన్‌తో కలిసి శనివారం పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. ఏ ప్రభుత్వమైనా ఒకేసారి అర్హులందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వదని, దశల వారీగా ఇస్తుందని స్పష్టం చేశారు. గ్రామసభల ద్వారా అర్హులైన 20 మందిని ఎంపిక చేసి జాబితా తయారు చేశామని, ఇల్లు రానివారు నిరాశ చెందకుండా వచ్చే వరకు ఓపికగా ఉండాలని కోరారు. ఎలగందులలో 50 మంది అర్హులుంటే 20 మందికే ఇండ్లు వచ్చాయని, మిగిలిన 30 మందికి పక్కనున్న స్థలంలో పట్టాలిచ్చి డబుల్‌బెడ్రూం ఇండ్లు కట్టుకునేందుకు ఆర్థికసాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు ఎలగందల్ జడ్పీ హైస్కూల్లో రూ.72 లక్షలతో నిర్మించిన భవనం, బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. జడ్పీ స్కూల్ నూతన భవన ప్రారంభం సందర్భంగా విద్యార్థులతో మంత్రి కమలాకర్ ముచ్చటించారు. ఈ సందర్భంగా భవిష్యత్‌లో ఏమవుతారంటూ స్టూడెంట్స్‌ను ప్రశ్నించగా కలెక్టర్.. ఎస్పీ.. పోలీస్.. అవుతామని సమాధానమిచ్చారు. మంత్రి స్పందిస్తూ ఎమ్మెల్యే అవుతానంటూ ఒక్కరూ చెప్పడం లేదని అనడంతో నవ్వులు విరిశాయి. కార్యక్రమంలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, ఎంపీపీ పిల్లి శ్రీలత-, జడ్పీటీసీ పిట్టల కరుణశ్రీ-, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ సాబీర్‌పాషా, డీఈవో జనార్ధన్‌రావు, ఆర్డీవో ఆనంద్‌కుమార్, తహశీల్దార్‌శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌షర్మిల, ఎంపీటీసీలు రమేశ్‌గౌడ్, తిరుపతినాయక్, కమల పాల్గొన్నారు.
ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు
కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దళిత బంధు స్కీం కింద ఎంపికైన లబ్ధిదారులకు శనివారం కరీంనగర్ పట్టణంలోని కిసాన్‌నగర్, రేకుర్తిలో యూనిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ప్రభుత్వం అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్, జ్యోతీబాపూలే కలలను సాకారం చేస్తోందన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 13,559 మంది లబ్ధిదారుల్లో 11 వేల ఐదు వందల మందికి స్కీం అమలు చేశామన్నారు. కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లో 300 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా ఇప్పటివరకు 250 మందికి యూనిట్లు అందజేశామన్నారు. మేయర్ వై.సునీల్‌రావు, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, యువ కేంద్ర కో ఆర్డినేటర్ రాంబాబు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్, కార్పొరేటర్లు ఎడ్ల సరిత-, శ్రీనివాస్, నక్క పద్మ పాల్గొన్నారు.