పారా మిలటరీ కవాతు చేపడ్తం: కిషన్​రెడ్డి

పారా మిలటరీ కవాతు చేపడ్తం: కిషన్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. జూన్ 2న నిర్వహించే ప్రోగ్రామ్​లో ఉదయం పారా మిలటరీ దళాల కవాతు ఉంటుందని, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. గురువారం క్లాసిక్​ గార్డెన్​లో జరిగిన హైదరాబాద్​ సెంట్రల్ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశానికి కిషన్​రెడ్డి చీఫ్ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. తెలంగాణ నుంచి దోచుకున్న డబ్బులను దేశవ్యాప్తంగా ఉన్న పొలిటికల్ లీడర్లకు పంచేందుకే కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టారని ధ్వజమెత్తారు. ‘‘నిరుద్యోగ భృతి ఇస్తామని ఇయ్యలేదు. రైతు రుణమాఫీ చేయలేదు. దళిత బంధు ఏమైంది? ఏ పార్టీ చేయని అవినీతి, అక్రమాలు బీఆర్ఎస్ చేసింది. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కుటుంబ పార్టీ దోచుకున్నది”అని కిషన్​రెడ్డి ఫైర్ అయ్యారు.

మోడీ ఏ దేశానికెళ్లినా బ్రహ్మరథం పడుతున్నరు

‘‘తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కుటుంబ పాలన, అవినీతి, నియంతృత్వ పార్టీ పోవాలని ఎదురు చూస్తున్నరు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ ఒక మంచి ప్రభుత్వాన్ని దేశానికి అందిస్తున్నది. బీఆర్ఎస్ అవినీతిని ప్రజలకు వివరిస్తూ చైతన్యం, సంఘటితం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది”అని కిషన్​రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తొమ్మిదేండ్ల మోడీ పాలనలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈనెల 30 నుంచి వచ్చే నెల 30 వరకు ప్రజలకు వివరించాలని సూచించారు. ‘‘మనది కుటుంబ పార్టీ కాదు. లిక్కర్ స్కామ్​లో లేము. ప్రధాని మోడీ ఏ దేశానికి వెళ్లినా అక్కడి పాలకులు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రపంచమంతా ఇది గమనిస్తున్నది. ఇప్పుడు ప్రపంచమంతా ఇండియా లీడర్​షిప్​ను కోరుకుంటున్నది”అని కిషన్​రెడ్డి అన్నారు.

కేంద్రం చేసిన అభివృద్ధిని వివరించాలి

అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ ను ప్రతీ బీజేపీ కార్యకర్త విజయవంతం చేయాలని కిషన్​రెడ్డి కోరారు. ‘‘గడపగడపకూ వెళ్లి ప్రతీ వ్యక్తిని కలుద్దాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరిద్దాం. కర్నాటకలో ప్రజలు పూర్తి మెజార్టీ ఇచ్చినా.. ఎన్నో ఆందోళనలు, బుజ్జగింపులు, చర్చల తర్వాత ఓ సీఎంను ఎన్నుకున్నరు. సరిగ్గా సీఎంను ఎన్నుకోలేని కుటుంబ పార్టీలన్నీ మోడీకి వ్యతిరేకంగా పనిచేస్తాయట”అని కిషన్​రెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘మన రాష్ట్రానికి మోడీ వస్తే రిసీవ్ చేసుకునే సంస్కారం కేసీఆర్​కు లేదు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి పిలిస్తే రాడు. అలాంటి వ్యక్తి మోడీని, కేంద్రాన్ని విమర్శించడం ఏంటి?”అని కిషన్​రెడ్డి నిలదీశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, హైదరాబాద్ సిటీ బీజేపీ నేతలు పాల్గొన్నారు.