డిసెంబర్ 3న అధికార పార్టీని ఖచ్చితంగా సాగనంపుతరు : కోదండరామ్

డిసెంబర్ 3న అధికార పార్టీని ఖచ్చితంగా సాగనంపుతరు : కోదండరామ్

దౌర్జన్యం, దోపిడిపై తిరుగుబాటే ఈ సారి జరిగిన అసెంబ్లీ ఎన్నిక అని టీజేఎస్ చీఫ్, ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ చూపినట్టు డిసెంబర్ 3న ఈ అధికార పార్టీని ఖచ్చితంగా సాగనంపుతారని చెప్పారు. ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా వస్తాయని, కావున ఇదొక అద్భుతమైన ప్రజా చైతన్యమని ఉద్ఘాటించారు. మార్పును కోరి ఈ సారి రెండు సార్లు పట్టం కట్టిన ప్రభుత్వాన్ని దించాలని నిర్ణయించుకున్నారని కోదండరామ్ అన్నారు. ఈ అరుదైన సందర్భాన్ని చూడడం కూడా ఓ అదృష్టంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు.  

ప్రజల అవసరాలను పట్టించుకోకుండా, ఇష్టారాజ్యంగా ప్రవర్తించే ప్రభుత్వాలున్నపుడు ఏం జరుగుతుందో చెప్పడానికి ప్రస్తుత పరిణామాలే నిదర్శమని కోదండరామ్ అన్నారు. ఇప్పుడు టన్నుల కొద్ది బరువు దిగిపోయిందన్న ఫీలింగ్ ఉందని చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజలు అద్భుతమైన ప్రదర్శన కనబర్చారని, దోపిడీని అంతం చేసేందుకే తాము కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించామని స్పష్టం చేశారు. ఇప్పడే కాదు ప్రజాస్వామ్య పాలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. ఉద్యమ కాలంలో తమకు ఏమైతే కావాలని పోరాటం చేశామో.. ఇప్పుడది నెరవేరేందుకు సమయం ఆసన్నమైందనిపిస్తుందని కోదండరామ్ అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రజలు ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరని, ఇప్పటికే అలా పాల్పడే వారి ఇంటి ముందు ఆందోళనలు చేసేందుకు సిద్ధమై ఉన్నారనుకుంటున్నానని కోదండరామ్ చెప్పారు.

కృష్ణా నీటి వివాదాన్ని రేకెత్తించి, ప్రయోజనం పొందాలని చూసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ వేసిన ఎత్తుగడ కూడా తన దృష్టిలో భగ్నమైందని కోదండరామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సాగర్ నీటి విషయంలో ఏపీ సర్కార్ తీరు సరైంది కాదని ఆరోపించారు. ఇది చాలా అప్రజాస్వామికమైన ధోరణి అని, చట్ట వ్యతిరేకం, అనాగరికమన్నారు. వారికి తాగునీటిని తీసుకోవడానికి చట్టబద్దమైన పద్దతులున్నాయని చెప్పారు. గతంలో హైదరాబాద్ కు నీరు అవసరమైతే బోర్డు జోక్యంతో సద్ధుమణిందని గుర్తు చేశారు. ఇది అనవసరమైన, తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసమే చేశారన్నారు. కేంద్రం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుంటుందనుకుంటున్నామని చెప్పారు.