బీఆర్ఎస్ లీడర్ల కమీషన్లపై హైకోర్టుకు వెళ్తా: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి

బీఆర్ఎస్ లీడర్ల కమీషన్లపై హైకోర్టుకు వెళ్తా: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
  • స్కీమ్​లన్నీ అవినీతిమయం అయ్యాయ్: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
  • 76 నుంచి 80 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తాం
  • అధికారంలోకి వచ్చాక అవినీతిపరులను జైలుకు పంపుతాం

నల్గొండ అర్బన్, వెలుగు: ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్స్​లో బీఆర్ఎస్ లీడర్ల కమీషన్లపై హైకోర్టుకు వెళ్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం హైకోర్టుకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని, 76 నుంచి 80 స్థానాల్లో గెలుస్తామని చెప్పారు. బుధవారం నల్గొండలో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర లేదని కేటీఆర్ అనడం సరికాదన్నారు.

 కేటీఆర్ ఐటీ మంత్రి కాదని.. విదేశాంగ మంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నెలలో 15 రోజులు విదేశాల్లో ఉండే కేటీఆర్​కు రాష్ట్ర ప్రజల అవసరాలేమో ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. ‘‘సోనియా గాంధీ దయ వల్లే తెలంగాణ ఏర్పడిందని కేసీఆర్ అంటుంటే.. కేటీఆర్ మాత్రం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ బానిసత్వ పార్టీ. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ. మేము పవర్​లోకొచ్చాక బీఆర్ఎస్ లీడర్ల అవినీతి అంతా బయటికి తీస్తాం. వాళ్లను చంచల్​గూడ, చర్లపల్లి జైలుకు పంపుతాం”అని కోమటిరెడ్డి పేర్కొన్నారు. 

ప్రతి ఇంటికీ 15 సార్లు వెళ్లి ప్రచారం చేస్తాం

ఉద్యోగులకు జీతాలివ్వలేని ప్రభుత్వం కేసీఆర్​ది అని కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మండిపడ్డారు. ప్రతి నెలా 1న జీతాలివ్వాలని, లేకపోతే ప్రగతిభవన్​పై మెరుపుదాడి చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరిస్తామని, కౌలు రైతులకూ లబ్ధి చేకూరుస్తామన్నారు. ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీతో పాటు కొత్త పథకాలు తీసుకొస్తామని తెలిపారు. 

నల్గొండలో ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభిస్తామని, ప్రతి ఇంటికీ 15 సార్లు వెళ్లి ప్రచారం చేస్తామని అన్నారు. ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, ఏప్రిల్​లో ఎన్నికలు ఉంటాయని తెలిపారు. రూ.200 కోట్లు ఇస్తే నల్గొండ జిల్లా ఎస్​ఎల్​బీసీ సొరంగ మార్గం కంప్లీట్ అయ్యేదని, కానీ.. కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు.  

ALSO READ: గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవస్థల స్థాపనతోనే ఈ‑వ్యర్థాల కట్టడి

జగదీశ్వర్ రెడ్డి.. పవర్​లేని మినిస్టర్మం

త్రి జగదీశ్వర్ రెడ్డి.. పవర్ లేని పవర్ మినిస్టర్ అని కోమటిరెడ్డి విమర్శించారు. సూర్యాపేటకు చెందిన వట్టే జానయ్యపై జగదీశ్వర్ రెడ్డి అక్రమంగా కేసులు బనాయించారని ఫైర్ అయ్యారు. జానయ్య తల్లి అయిలమ్మకు మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వట్టే జానయ్య.. ఉట్టి జానయ్య కాదని.. గట్టి జానయ్య అని, జగదీశ్ రెడ్డి సినిమా చూపిస్తారన్నారు. కొడుకుకు టికెట్ రాకపోవడంతో సుఖేందర్ రెడ్డికి మతిభ్రమించిందని, తనను తిడితే ఏమొస్తుందని.. కేసీఆర్​తో తేల్చుకోవాలని సూచించారు. నల్గొండ జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్ లీడర్లు చాలా మంది ఉన్నారని, కొత్తవారికి ఎంట్రీ లేదన్నారు. 

ఉద్యోగులకు జీతాలేవి?

సగం నెలవుతున్నా ఉద్యోగులకు సర్కారు జీతాలివ్వడం లేదని, రిటైర్డ్​ ఉద్యోగులకు పింఛన్లు ఇవ్వడం లేదని కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం పాలైందని అన్నారు. ‘‘యువత కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం ఎప్పుడో మరచిపోయిన రాష్ట్ర సర్కార్​.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులనూ పట్టించుకోవడం మానేసింది. సర్కారు ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలి” అంటూ బుధవారం ఆయన సీఎం కేసీఆర్​కు లేఖ రాశారు.