జీఎస్టీ సంస్కరణల లాభం కంపెనీలకా? ప్రజలకా? ..కీలక రంగాల విషయంలో అనుమానాలు

జీఎస్టీ సంస్కరణల లాభం  కంపెనీలకా? ప్రజలకా? ..కీలక రంగాల విషయంలో అనుమానాలు
  •  
  • సిమెంట్ రేట్లను తగ్గించబోమంటూ 
  • ఇప్పటికే పలు ఫ్యాక్టరీల ప్రకటన 
  • హెల్త్​ పాలసీలు, వెహికల్స్​పైనా ఇదే యోచన?
  • జీఎస్టీ స్లాబుల తగ్గింపుపై పలు కంపెనీలకు ఇప్పటికే లీక్​
  • గడిచిన కొన్ని నెలల్లో కొన్ని నిత్యావసర వస్తువుల రేట్ల అనూహ్య పెంపు
  • వినియోగదారులకు లాభం రాక.. ప్రభుత్వ ఖజానాకు చేరక అంతా కంపెనీలకే?
  • మినహాయింపు ప్రయోజనాలు ప్రజలకే దక్కేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి రాష్ట్రాల విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రభుత్వానికి పన్ను ఆదాయం తగ్గనుండగా, ఆ ప్రయోజనం నేరుగా ప్రజలకు దక్కుతుందా? లేదా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రాలు ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తెచ్చినప్పటికీ పలు కంపెనీలు చేస్తున్న ప్రకటనలు ఇందుకు ఊతమిస్తున్నాయి. సిమెంట్​పై జీఎస్టీని ప్రభుత్వం 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. ఒక్కో సిమెంట్ బస్తాపై 10 శాతం రేట్లు తగ్గితే ఆ మేరకు వినియోగదారునికి కలిసివస్తుంది. దీని వల్ల నిర్మాణ రంగానికి ఊతమిచ్చినట్లు అవుతుందని సర్కారు భావించింది. కానీ, తాము ఎట్టిపరిస్థితుల్లోనూ సిమెంట్ రేట్లు తగ్గించేది లేదని ఫ్యాక్టరీల యజమానులు ఇప్పటికే ప్రకటించాయి. హెల్త్ పాలసీలు, వాహనాల రేట్ల విషయంలోనూ ఇదే వ్యూహం అనుసరించాలని ఆయా కంపెనీలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

కంపెనీల ఒత్తిళ్లకు కేంద్రం తలొగ్గితే వినియోగదారునికి ఫలితం ఉండదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు రావాల్సిన సొమ్ము కూడా కంపెనీలకే చేరుతుంది. గతంలో జీఎస్టీ రేట్లు తగ్గించినప్పుడు కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. దీనికితోడు స్లాబుల మార్పుపై అనేక కంపెనీలకు ముందే సమాచారం లీక్​కావడంతో తమ ఉత్పత్తుల రేట్లను గడిచిన 6 నెలల్లో పెంచుకున్నాయని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. అందువల్ల ఇప్పుడు జీఎస్టీ తగ్గినా, ఆమేరకు తమ వస్తువుల ధరల్లో మార్పు లేకుండా చూసుకుంటున్నారని వివరిస్తున్నారు. గతంలో జీఎస్టీ తగ్గినప్పటికీ వినియోగదారులకు పెద్దగా లాభం చేకూరలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుందనే ఆందోళనలున్నాయి. పండుగల సీజన్ కావడంతో నిత్యావసరాలు, ఇతర వస్తువుల ధరలు ఇప్పటికే పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించినా, ఆ లాభం వినియోగదారులకు చేరకపోతే జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సిమెంట్ ధరలు యథాతథం..!

జీఎస్టీ తగ్గించినప్పటికీ సిమెంట్ ధరలు తగ్గించబోమని ఇప్పటికే కొన్ని ప్రధాన సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు ప్రకటించాయి. ఉత్పత్తి వ్యయం, రవాణా ఖర్చు, ఇతరత్రా కారణాల వల్ల సిమెంట్ ధరలు తగ్గించే అవకాశం లేదని యజమానులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో తమకు కలిసివస్తుందని  కొత్తగా ఇండ్ల నిర్మాణం చేపడ్తున్నవారు ఆశించారు. కానీ, ఇప్పుడు సిమెంట్ కంపెనీల ప్రకటనతో ఆందోళన చెందుతున్నారు. ఇదే విధంగా హెల్త్ పాలసీలు, వాహనాల ధరలు తగ్గించే విషయంలో కూడా కంపెనీలు ఇలాంటి ఆలోచనే చేస్తున్నాయనే వార్తలు వస్తుండడంతో ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని వినియోగదారులకు ఊరట చేకూర్చాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. 

అవగాహన కల్పించాలి..

జీఎస్టీ తగ్గింపుతో వచ్చే లాభం వినియోగదారులకు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జీఎస్టీ రేట్లు తగ్గిన వస్తువుల ధరలపై ప్రభుత్వం నిఘా పెంచాలని, కంపెనీలు ధరలు తగ్గించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. జీఎస్టీ తగ్గింపుతో ఎంత లాభం వినియోగదారులకు చేరిందో లెక్కతీయాలని సూచిస్తున్నారు. జీఎస్టీ తగ్గింపుతో వచ్చే లాభాల గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సలహా ఇస్తున్నారు. 
    
గతంలో ఒక హెల్త్​ ఇన్సూరెన్స్ పాలసీ వార్షిక ప్రీమియం రూ.23,600 అనుకుంటే.. అందులో జీఎస్టీ (18%) రూ.3,600  కలిసి ఉండేది. కానీ, ప్రస్తుతం హెల్త్​ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీని తొలగించిన తర్వాత వినియోగదారుడు కేవలం రూ.20 వేలు చెల్లిస్తే సరిపోతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో జీఎస్టీ పూర్తిగా ఎత్తివేసినా ఇన్సూరెన్స్ కంపెనీలు వైద్య ఖర్చులు పెరిగాయనో, క్లెయిమ్స్ రేషియో పెరుగుతోందనో సాకులు చెప్పి పాత ప్రీమియాన్నే కొనసాగిస్తే ప్రజలకు మేలు జరగకపోగా ప్రభుత్వాలకు పన్ను ఆదాయం తగ్గే ప్రమాదముంది.
    
ఒక సిమెంట్ బస్తా ధర రూ.350 అనుకుందాం. పాత జీఎస్టీ (28%) ప్రకారం రూ.98 ఇందులో కలిసి ఉంటుంది. ఇప్పుడు జీఎస్టీని 18 శాతానికి పరిమితం చేసినందున రూ.63 తగ్గి రూ.287కే బస్తా సిమెంట్ రావాలి. కానీ, జీఎస్టీ తగ్గుదల అమల్లోకి వచ్చేలోపే చాలా కంపెనీలు ‘ముడి సరుకు ధరలు, రవాణా,  ఇంధన వ్యయాలు పెరిగాయి’అని సాకులు చెప్పి సిమెంట్ బస్తా ప్రాథమిక ధరను రూ.350 నుంచి రూ.380కి పెంచే ప్లాన్​ చేస్తున్నాయి. దీని వల్ల వినియోగదారులకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు.
    
వంట నూనెలు ఇప్పటిదాకా 12% జీఎస్టీ పరిధిలో ఉన్నాయి. దీన్ని ప్రస్తుతం 5%కు తగ్గించారు. కానీ, కొన్ని రోజుల ముందే ఆయిల్ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగాయని సాకులు చెప్పి, లీటరు నూనెను రూ.150 – రూ.160కి పెంచాయి.
    
గతంలో టీవీలు, ఫ్రిజ్​లు, వాషింగ్​ మెషీన్ల వంటి వస్తువులపై జీఎస్టీ తగ్గించినప్పుడు ఇదే పరిస్థితి తలెత్తింది. జీఎస్టీ తగ్గడానికి కొన్ని రోజుల ముందే కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను స్వల్పంగా పెంచాయి. తర్వాత జీఎస్టీ తగ్గినప్పుడు, పెరిగిన ధరల నుంచి స్వల్పంగా తగ్గించి, మిగిలిన లాభాన్ని తమ వద్దే ఉంచుకున్నాయి. ఉదాహరణకు, ఒక టీవీ ధర రూ.30 వేలు అనుకుంటే, జీఎస్టీ తగ్గడానికి ముందు ఆ కంపెనీ ధరను రూ.31,500కు పెంచింది. జీఎస్టీ తగ్గడంతో రూ.31,500 నుంచి రూ.500 తగ్గించి, రూ.31 వేలకు అమ్మింది. జీఎస్టీ తగ్గింపుతో వినియోగదారులకు లాభం చేకూరకపోగా, రూ.1,000 ఎక్కువ చెల్లించాల్సి వచ్చింది.

సమాచారం లీక్.. ముందే ధరలు పెంచేసిన్రు

ప్రభుత్వం జీఎస్టీ స్లాబులను నాలుగు నుంచి రెండుకు కుదిస్తోందని, దీని వల్ల చాలా వస్తువుల రేట్లు తగ్గించాల్సి ఉంటుందన్న సమాచారం కేంద్రం స్థాయిలో ముందే లీకైనట్లు చెప్తున్నారు. దీని వల్ల కంపెనీలు అలర్ట్​అయి, ఇప్పటికే రేట్లు పెంచాయంటున్నారు. గత 6 నెలల్లో కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చేలా ఉంది. పన్నులు తగ్గించడం వల్ల ప్రజల మీద భారం తగ్గించాలని సర్కారు భావిస్తుంటే, కంపెనీల స్వార్థంతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కార్ల పరిశ్రమలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. గతంలో చిన్న కార్లపై జీఎస్టీ రేట్లను ప్రభుత్వం తగ్గించినప్పుడు, కొన్ని కార్ల తయారీ కంపెనీలు మాత్రం ధరలను  తగ్గించలేదు. దీనికి కారణం ఉత్పత్తి వ్యయం, డీలర్ కమీషన్లు, ఇతర పన్నులు వంటి అంశాలను సాకుగా చూపించాయి. చివరికి, జీఎస్టీ తగ్గింపుతో వచ్చిన లాభం వినియోగదారులకు బదులుగా డీలర్ల కమీషన్ల రూపంలో, లేదా కంపెనీల జేబుల్లోకి వెళ్లిపోయింది.