
- సిట్టింగుల సీట్ల కింద మాజీల మంట
- పటాన్ చెరు, జహీరాబాద్ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలకు వర్గపోరు
- జగ్గారెడ్డి బీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం
- అన్ని చోట్లా కాంగ్రెస్, బీజేపీల నుంచి టికెట్ల కోసం పోటీ
- బీఆర్ఎస్ విజయావకాశాలపై పెండింగ్పనుల ఎఫెక్ట్
సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లాలోని రెండు సెగ్మెంట్లలో సిట్టింగుల సీట్లకు మాజీ ఎమ్మెల్యేలు ఎసరు పెడ్తున్నారు. పోటాపోటీ కార్యక్రమాలతో చెమటలు పట్టిస్తున్నారు. పటాన్ చెరు, జహీరాబాద్ సెగ్మెంట్లలో ఈ పరిస్థితి ఉండగా, మిగిలిన నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలను ప్రత్యర్థి పార్టీలకు చెందిన బలమైన లీడర్లు బెంబేలెత్తిస్తున్నారు. అటు కాంగ్రెస్, బీజేపీలోనూ టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొన్నది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఓవైపు సీట్ల పంచాయితీ కొనసాగుతున్నప్పటికీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష లీడర్లు మాత్రం నియోజకవర్గాలను చుట్టి వస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. సభలు, సమావేశాలతో పాటు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అటు ప్రజలను, ఇటు హైకమాండ్‌ను ఆకట్టుకునే పనిలో పడ్డారు. జిల్లాలోని పెండింగ్ప్రాజెక్టులతో పాటు డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితబంధు లాంటి కీలక స్కీంలు అమలుకాకపోవడం బీఆర్ఎస్ విజయావకాశాలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది.
జగ్గారెడ్డి బీఆర్ఎస్లో చేరతారా?
సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్ కు అసమ్మతి సెగ ఎక్కువైంది. ఉమ్మడి జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ లీడర్పట్నం మాణిక్యం అనూహ్యంగా తెరపైకి వచ్చి చింతకు పోటీగా నిలిచారు. సీఎం కేసీఆర్ అండదండలు తనకు పుష్కలంగా ఉన్నాయని, ఎమ్మెల్యే కావాలన్న తన కోరిక తీరబోతోందని ఆ మధ్య ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. మాణిక్యం ఎంట్రీతో సెకండ్ క్యాడర్ గా ఉన్న బీఆర్ఎస్ లీడర్లు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాము కూడా రేసులో ఉన్నామని అనుచరుల దగ్గర చెప్పుకుంటున్నారు. ఇంతకాలం ప్రజల మధ్యలో ఉన్న మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంత్రి హరీశ్‌రావు తోపాటు పార్టీ హై కమాండ్ చింత వైపే మొగ్గు చూపుతున్నప్పటికీ టికెట్తనకే వస్తుందంటూ మాణిక్యం కాక రేపుతున్నారు. ఫౌండేషన్ పేరుతో ప్రజల్లో తిరుగుతూ అన్ని వర్గాల వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.అలాగే బీజేపీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రాజేశ్వర్ రావు దేశ్ పాండేకు పోటీగా ఈసారి ప్రముఖ న్యాయవాది, యువ నాయకుడు దయాకర్ రెడ్డి పోటీకి సిద్ధమై అధిష్టానం దృష్టిలో పడేందుకు వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. కాగా, కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కరెక్ట్ టైంలో బీఆర్ఎస్ లో చేరుతారన్న ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇస్తే బీఆర్ఎస్ లో ఆశావహుల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.
పటాన్చెరులో గూడెం వర్సెస్ నీలం మధు
బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, చిట్కుల్ సర్పంచ్, యూత్లీడర్నీలం మధు మధ్య పొలిటికల్ వార్ ముదురుతోంది. మధు యువసేన పేరుతో సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గం చుట్టేస్తున్నారు. తాజాగా శివరాత్రి ఉత్సవాలను కూడా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, నీలం మధు పోటాపోటీగా నిర్వహించారు. బీజేపీ విషయానికి వస్తే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, గోదావరి అంజిరెడ్డిలకు పోటీగా మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ పేరు తెరపైకి వస్తోంది. కాంగ్రెస్ తరఫున మెదక్ పార్లమెంట్ నుంచి 2019లో పోటీ చేసి ఓటమి పాలైన గాలి అనిల్ కుమార్, బీజేపీ యువ నాయకుడు ఎడ్ల రమేశ్ కూడా రేసులో ఉన్నారు. బీజేపీ నుంచి 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యాపారవేత్త కరుణాకర్ రెడ్డి సైలెంట్ అయ్యారు.
ఖేడ్‌లో ఒప్పంద రాజకీయాలకు బీఆర్ఎస్ చెక్
నారాయణఖేడ్ కాంగ్రెస్ పార్టీలో ఒప్పంద రాజకీయాలకు తెర లేపిన షెట్కార్ ఫ్యామిలీ, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టారెడ్డి కుటుంబీకులు దశాబ్దాల పాటు రాజకీయాలను శాసించారు. ఒకరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మరకరు ఎంపీగా పోటీ చేస్తూ గెలిచేవారు. కిష్టారెడ్డి మరణం తర్వాత షెట్కార్, దివంగత కిష్టారెడ్డి కుమారుడు పట్లోళ్ల సంజీవరెడ్డిల మధ్య ఈ ఒప్పంద రాజకీయాలకు బ్రేక్ పడింది. 2016లో జరిగిన బైపోల్ లో కాంగ్రెస్ తరపున సురేష్ షెట్కార్ పోటీ చేయగా సంజీవరెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరి పోటీ చేశారు. అయితే టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన భూపాల్ రెడ్డి గెలుపొందారు. అప్పటినుంచి బీఆర్ఎస్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ సెగ్మెంట్లో బీజేపీ తరఫున 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డికి లింగాయత్ వర్గానికి చెందిన జనవాడే సంగప్ప నుంచి గట్టిపోటీ ఎదురు కానుంది.
జహీరాబాద్‌లో ఎర్రోళ్ల వర్సెస్ మాణిక్‌రావు
జహీరాబాద్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్ రావుకు టికెట్ విషయంలో సొంత పార్టీ నుంచే గట్టి పోటీ ఎదురవుతోంది. తెలంగాణ మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఐడీసీ) చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే మాణిక్ రావు ఎర్రోళ్ల శ్రీనివాస్ ను అధికారిక కార్యక్రమాలకు పిలవడం లేదు. మంత్రి హరీశ్ రావు పాల్గొన్న సభల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటివి చేస్తున్నారు. అయితే శ్రీనివాస్ దీన్ని పట్టించుకోకుండా మంత్రి హరీశ్‌రావు ప్రోత్సాహంతో టికెట్‌కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటీవల వివిధ మండలాల్లో అనధికార కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలను, నాయకులను కలుసుకుంటున్నారు. మొగుడంపల్లి జడ్పీటీసీ భర్త మోహన్ రెడ్డి బర్త్ డే వేడుకల్లో శ్రీనివాస్ పాల్గొనగా, విషయం తెలుసుకున్న మాణిక్ రావు ఆ వేడుకలకు హాజరుకాలేదు. వారం క్రితం న్యాల్కల్ జడ్పీటీసీ భర్త భాస్కర్ రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఆయనను శ్రీనివాస్పరామర్శించారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ వ్యవహారంపై మాణిక్ రావు పార్టీ హై కమాండ్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. మరోవైపు సామాజిక కార్యక్రమాలు చేస్తూ బీఆర్ఎస్లీడర్ఢిల్లీ వసంతం ప్రజల్లో తిరుగుతున్నారు. చెరుకు రైతుల సమస్యలపై గతంలో ఢిల్లీ వరకు పాదయాత్ర చేసి తన పేరునే ఢిల్లీ వసంత్ గా మార్చుకున్న ఆయన జహీరాబాద్ టికెట్ రేసులో తర్వాత ఉన్నారు.
ఆందోల్‌లో త్రిముఖ పోటీ
అందోల్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కు టికెట్ విషయంలో పోటీ లేదు. అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహా నుంచి గట్టిపోటీ ఎదురుకానున్నది. దామోదర్ రెండు సార్లు ఓడిపోవడంతో ఆయనపై ప్రజల్లో సానుభూతి పెరిగింది. స్థానిక నినాదంతో ఎమ్మెల్యేగా గెలిచిన క్రాంతి కిరణ్ ఆ స్థాయిలో పనిచేయడం లేదని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. బీజేపీ విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ గతంలో ఇక్కడి నుంచి గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. ఈసారి బీజేపీ తరఫున పోటీ చేసి గెలుస్తానన్న నమ్మకంతో ఆయన ఉన్నారు. కాకపోతే బాబుమోహన్ తో పాటు మాజీ జడ్పీ చైర్మన్బాలయ్య టికెట్ రేసులో ఉన్నారు. బాబు మోహన్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా నియోజకవర్గంలో కలియ తిరుగుతూ ప్రజలకు దగ్గరవుతున్నారు.
అన్ని నియోజకవర్గాల్లో సమస్యలే..
జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో సమస్యలు వేధిస్తున్నాయి. సంగారెడ్డి నియోజకర్గంలోని సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట మండలాల్లో తాగునీటి సమస్య ఉంది. పటాన్చెరులో పొల్యూషన్ సమస్యతో జనం ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గాన్ని గ్రీన్ జోన్ గా మారుస్తామని మాట ఇచ్చిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నిలబెట్టుకోలేకపోయారు. జహీరాబాద్ లో సాగునీటి ప్రాజెక్టులు లేవు. నారింజ ప్రాజెక్టులో పూడికతీత పనులు లేక వర్షాకాలంలో పడ్డ నీళ్లు పడ్డట్టుగా పక్క రాష్ట్రమైన కర్ణాటకకు తరలిపోతున్నాయి. ఇక్కడ చెరుకు రైతులు కూడా సమస్యలతో సతమతమవుతున్నారు. కర్ణాటకకు పోయి పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఆందోల్‌లో సింగూరు జలాలు సాగునీటికి ఇవ్వాలన్న డిమాండ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ హయాంలో అప్పటి డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ కాల్వలు తవ్వించగా..కేసీఆర్ సర్కారు ఇప్పటివరకు నీళ్లు పారించలేకపోయింది. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఈ విషయంలో పెద్దగా చొరవచూపలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. నారాయణఖేడ్ లో ఉపాధి లేక 30 శాతం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు.
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (కాంగ్రెస్)
అనుకూల అంశాలు
- మాస్ లీడర్ గా పేరు
- నియోజకవర్గ అభివృద్ధిపై అసెంబ్లీలో ప్రస్తావన
- ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేయడం
- రాష్ట్ర కాంగ్రెస్ లో కీలక పదవి..సమస్యలపై ఎవరినైనా నిలదీసే తత్వం
ప్రతికూల అంశాలు
- నియోజకవర్గంలో తిరగకుండా గాంధీ భవన్ కే పరిమితం కావడం
- కార్యకర్తలను పక్కనపెట్టి పార్టీ పరంగా సొంత కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం
- ప్రతిపక్ష ఎమ్మెల్యే కావడంతో నిధులు విడుదల కాకపోవడం
- కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి
- మంత్రి కేటీఆర్ తో సన్నిహితంగా ఉండడం.. పార్టీ మారతారన్న ప్రచారం