
చెన్నై: దేశ విద్యా విధానంలో కొత్తగా తీసుకొచ్చిన నేషన్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఈపీ) 2020 చాలా బాధాకరంగా ఉందని తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి అన్నారు. ఈ పాలసీని అమలు చేయొద్దన్నారు. హిందీ అమలుకు గతంలో తమిళనాడుకు సీఎంలుగా ఉన్న అన్నా దురై, ఎంజీఆర్, జయలలిత వ్యతిరేకించిన మాదిరిగానే పళనిస్వామి కూడా కామెంట్ చేశారు. త్రిభాషా విధానంపై ప్రధాని మోడీ పునరాలోచన చేయాలన్నారు.
‘కేంద్ర త్రిభాషా పాలసీని తమిళనాడు ఎప్పటికీ ఆమోదించబోదు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో త్రీ ల్యాంగ్వేజ్ పాలసీ చాలా బాధాకరంగా ఉంది. ఈ పాలసీ గురించి ప్రధాని మోడీ పునరాలోచించాలి’ అని పళనిస్వామి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 1965లో అప్పటి కాంగ్రెస్ సర్కార్ హిందీని అధికార భాష చేయడానికి యత్నించినప్పుడు తమ రాష్ట్ర స్టూడెంట్స్ యాంటీ హిందీ నినాదాలతో ఉద్యమించడాన్ని గుర్తు చేశారు. త్రీ ల్యాంగ్వేజ్ పాలసీ అమలును రాష్ట్రాల ఇష్టాఇష్టాలకు కేంద్రం వదిలినప్పటికీ.. హిందీని రాష్ట్రాలపై రుద్దడానికి కేంద్ర వ్యూహంగా తమిళనాడులోని రాజకీయ పార్టీలు అనుమానిస్తున్నాయి. కేంద్రం ఏ భాషను కూడా రాష్ట్రాలపై రుద్దదని హెచ్‌ఆర్‌డీ మినిస్టర్ రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ స్పష్టం చేశారు.