జాబ్ పర్మినెంట్ చేసేదాకా  చెత్త ఎత్తేది లేదు

జాబ్ పర్మినెంట్ చేసేదాకా  చెత్త ఎత్తేది లేదు
  •     స్వచ్ఛ ఆటోలు ఆపేస్తాం: బల్దియా ఔట్​సోర్సింగ్ కార్మికులు
  •     డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్

సికింద్రాబాద్, వెలుగు : ఉద్యోగాలు పర్మినెంట్ చేసేదాకా చెత్త ఎత్తేది లేదని జీహెచ్ఎంసీ ఔట్ సోర్సింగ్ కార్మికులు తేల్చి చెప్పారు. బల్దియాలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని కోరారు. బల్దియాపై బీఆర్ఎస్ జెండా ఎగురవేసిన కార్మికులను కేసీఆర్ విస్మరిస్తున్నారని మండిపడ్డారు. సిటీలోని వివిధ సర్కిల్ ఆఫీసుల ఎదుట కార్మికులు చేస్తున్న ఆందోళనలకు పలు సంఘాలు మద్దతు పలికాయి. కార్మిక సంఘాల లీడర్లు మలక్​పేట్​లో వివిధ సంఘాల ముఖ్య నాయకులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు ఊదరి గోపాల్ మాట్లాడారు. సోమవారంలోగా తమ సమస్యకు పరిష్కారం చూపుతూ ప్రకటన చేయకుంటే సమ్మె ఉధృతం చేస్తామని ప్రకటించారు. రోడ్లపై ఉన్న చెత్త ఎత్తమని, ఊడ్చబోమని అన్నారు. కాలనీలు, బస్తీలు, రోడ్లపై ఉన్న చెత్తను ఎక్కడికక్కడే వదిలేస్తామని, డంపింగ్ యార్డులకు చెత్త చేరవేయకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇంటింటికీ వచ్చి చెత్తను సేకరించే స్వచ్ఛ ఆటోలను కూడా నిలిపివేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బల్దియా ఔట్​సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్

చేశారు. కార్మికులందరికీ డబుల్ బె​డ్రూం ఇండ్లు మంజూరు చేయాలని, స్వచ్ఛ ఆటో ట్రైవర్లకు, కార్మికులకు నెలనెలా వేతనాలు ఇవ్వాలన్నారు. కార్మికులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాంకీ సంస్థతో బల్దియా కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని, అలాగే ట్రాన్స్​పోర్ట్ సెక్షన్​లో తొలగించిన కార్మికులను, డ్రైవర్లను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

రూ.24 వేల జీతం ఇవ్వాలి

బషీర్​బాగ్ : తమ జీతాలను రూ.24 వేలకు పెంచాలని జీహెచ్ఎంసీ శానిటేషన్ కార్మికులు డిమాండ్  చేశారు. జీహెచ్ఎంసీ కాంట్రాక్టు కార్మికుల సమ్మెలో భాగంగా లిబర్టీలోని జీహెచ్ఎంసీ హెడ్డాఫీసు ముందు శానిటేషన్  కార్మికులు ఆందోళనకు దిగారు.  సీఐటీయూ, హెచ్ఎంఎస్  ఆధ్వర్యంలో కార్మికులు మెయిన్ గేటు ముందు బైఠాయించారు. సీఐటీయూ తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్  యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అణిచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నదని విమర్శించారు. మలిదశ ఉద్యమంలో కేసీఆర్  ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్  చేయాలని ఆయన డిమాండ్ చేశారు.