ఆన్లైన్ గేమింగ్ ఆగుతుందా?

ఆన్లైన్ గేమింగ్ ఆగుతుందా?

దుబాయ్​లో  ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్​లో ఆటగాళ్లు ఎప్పటిలా డ్రీమ్ 11 బ్రాండ్ షర్టులు వేసుకోలేదు.  ఆట మధ్యలో వచ్చే ప్రకటనల్లో కూడా 'మెదడు పెట్టి ఆడితే ఆన్​లైన్ గేమ్స్ లో గెలవచ్చు' అని హుషారు రేకెత్తించే మాయ మాటలు కూడా మూగపోయాయి.  అందుకు కారణం ఆగస్టు 19 న కేంద్రం ఈ ఆటలను నియంత్రించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడమే. 22న రాష్ట్రపతి ఆమోదముద్ర పడిన ఈ ప్రతిపాదన త్వరలో చట్టంగా ఆచరణలోకి రానుంది. వాస్తవానికి  2023 నుంచి  2026 వరకు భారత క్రికెటర్లు మైదానంలో తమ జెర్సీలు ధరించాలని డ్రీమ్ 11 సంస్థ రూ. 358 కోట్లు చెల్లించి బిసిసిఐతో ఒప్పందం చేసుకుంది. అయితే,  పార్లమెంటులో 'ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్​లైన్ గేమింగ్ యాక్ట్ 2025 ' ను ఉభయసభలు అంగీకరించడంతో ఈ జెర్సీ ఒప్పందం వీగిపోయింది.


దే శంలో 45 కోట్ల మంది ఆడుతున్న ఆన్ లైన్ గేమ్స్​లో డ్రీమ్ 11 దే పైచేయి. 2008లో మొదలైన ఈ క్రీడా వేదిక ద్వారా యాజమాన్యం కాలు కదపకుండా ఏడాదికి రూ. 6 వేల కోట్ల వ్యాపారంతో  వందల కోట్ల లాభాలను ఆర్జిస్తోంది. ఈ ఆటల్లో గెలిచే అవకాశం 15%  ఉండగా మిగతా వాళ్లంతా నష్టపోయేవారే.  ఇదొక చక్రవ్యూహం. 
ప్రభుత్వంపై ఒత్తిడి ఈ క్రీడ వల్ల యువత, వారి కుటుంబాలు భారీగా నష్టపోతున్నారని 2017లో ఒకరు హైకోర్టులో కేసు వేయగా ఇది యువత మేధస్సుకు సంబంధించిన ఆట. నైపుణ్యంతో కూడిన ఈ ఆటను జూదంగా భావించలేమని తీర్పు వచ్చింది. చివరకు సుప్రీంకోర్టు కూడా డ్రీమ్ 11 వాదననే అంగీకరించింది. దీంతో  ఈ సంస్థలు రాష్ట్రాల నిర్ణయాలను బేఖాతరు చేస్తూ దేశమంతా విస్తరించాయి.  ఈ గేమ్స్ ను జూదంగా చూడనవసరం లేదు. మేధస్సు, ప్రజ్ఞ, నైపుణ్యం ఉపయోగించి ఆడే సాధారణ క్రీడలు ఇవి అని కోర్టులు, చట్టాలు బలపరచగానే ప్రభుత్వం వీటి ఆగడాలను తేలిగ్గా  తీసుకుంది. పైగా ఈ ఆటల ద్వారా సర్కారులకు ఎంతో రెవెన్యూ వస్తోంది. గత సంవత్సరం వీటి వల్ల రూ. 20 వేల కోట్లు పన్ను రూపంలో ప్రభుత్వ ఖజానాలో జమయ్యాయి.  ఈ మధ్య జీఎస్టీ సర్దుబాటులో వీటిని 40% స్లాబ్​లో చేర్చినందున ఈ ఆదాయం ఇంకా పెరిగే అవకాశం ఉంది.  అయితే ఈ మధ్య పెరిగిన సైబర్ నేరాల వల్ల ప్రజలు రోజుకు కోట్ల రూపాయల్లో నష్టపోతున్నారు. ఈ సెగ ఆన్​లైన్ గేమింగ్ మీద కూడా పడి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. 

ఆన్​లైన్ గేమ్స్ ఓ పెద్ద పరిశ్రమ

ఈ కొత్త చట్టంలో    నిషేధం అనే మాట మాత్రం లేదు. ఈ క్రీడల నిర్వహణ, నియంత్రణ అనే అర్థాలు వచ్చే పదాలు వాడారు. అంటే వీటిని భవిష్యత్తులో అవసరమైన మార్పుల ద్వారా  తిరిగి ప్రజలకు అందించే అవకాశం ఉంది. ఆన్​లైన్ గేమ్స్ ఓ పెద్ద పరిశ్రమ. దాన్ని కొత్త చట్టం ప్రకారం నియంత్రించడం కూడా సాధ్యపడక పోవచ్చు. విశ్వవ్యాప్తమైన ఇంటర్​నెట్ మార్గాన్ని  ఎవరూ అడ్డుకోలేరు. ఏ శక్తికి అందకుండా అది మంచికో, చెడుకో రోజుకొక కొత్త రూపు, దారిలో మనిషికి అందుబాటులోకి వస్తోంది. కొత్త చట్టం రాకతో ఆన్​లైన్ గేమింగ్ అక్రమార్కుల చేతిలో వెళ్లిపోయే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. వర్చువల్ ప్రైవేట్ నెట్​వర్క్ సాయంతో విదేశీ కంపెనీల ఈ ఆటలు ప్రభుత్వ నిఘా కన్నుగప్పి మన దేశంలోనూ ఆటగాళ్లకు దొరుకుతాయని అంటున్నారు. అదే జరిగితే చట్టం నీరుగారి పోవడంతో పాటు ప్రభుత్వం భారీగా రాబడి కోల్పోతుంది. 

విషమ పరీక్ష

చట్టం కోసం ప్రభుత్వం ఈ ఆన్​లైన్ ఆటలను మూడు విభాగాలుగా వేరు చేసింది.  నైపుణ్యం పెంచే క్రీడలు, పిల్లలు ఆడే వినోద క్రీడలు, విద్యా సంబంధిత ఆటలు, చివరిది డబ్బుపెట్టి ఆడేవి. తొలి మూడింటిపై ఎలాంటి నియంత్రణ లేకుండా ప్రస్తుతం డబ్బు పెట్టి ఆడే ఆటలను కట్టడి చేస్తున్నారు. నగదు ప్రమేయమున్న ఆన్ లైన్ క్రీడలను తయారు చేసినా, ప్రజలకు  అందుబాటులోకి తెచ్చినా, ఆ ఆట కోసం డబ్బు బదిలీ చేసినా మూడు నుంచి అయిదేళ్ల కారాగార శిక్షతో పాటు రూ. కోటి దాకా జరిమానా వేస్తారు. ఏదో మార్గంలో ఆటలు అందుబాటులోకి వచ్చినా నగదు బదిలీకి దేశంలోని బ్యాంకులు, ఆర్థిక లావాదేవీల సంస్థలు ఒప్పుకోవు. ఇందుకోసం కొత్త హవాలా మార్గాలు పుట్టుకురావచ్చు.  ఈ చట్టంరాకతో ఆన్​లైన్ గేమ్ పరిశ్రమ కుప్పకూలి పోతోంది. నాలుగు వందల కంపెనీల్లో   పనిచేస్తున్న 2 లక్షల ఉద్యోగులు రోడ్డునపడతారు. ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఇదో విషమ పరీక్ష. ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ఈ నిషేధాన్ని తొలగించమని హోమ్ మినిస్టర్ అమిత్ షాకు లేఖ రాసింది. అయితే, ఇలాంటి మోసకారి క్రీడల నుంచి ప్రజలను రక్షించే వైపే ప్రభుత్వం నిలబడాలి.

- బద్రి నర్సన్