తొలి కప్పు వేటలో పంజాబ్‌‌‌‌ కింగ్స్‌‌

తొలి కప్పు వేటలో పంజాబ్‌‌‌‌ కింగ్స్‌‌
  • మయాంక్‌‌ కెప్టెన్సీలో బరిలోకి

(వెలుగు స్పోర్ట్స్‌‌‌‌ డెస్క్‌‌)

యువరాజ్‌‌ సింగ్‌‌, సంగక్కర, గిల్‌‌క్రిస్ట్‌‌ వంటి లెజెండ్స్‌‌ మొదలుకొని.. మ్యాక్స్‌‌వెల్‌‌, అశ్విన్‌‌, లోకేశ్‌‌ రాహుల్‌‌ వంటి మేటి స్టార్ల వరకు ఎంత మంది కెప్టెన్లు ప్రయత్నించినా.. టీమ్‌‌ పేరు మార్చుకున్నా.. ఎన్ని సీజన్లు వచ్చిపోతున్నా ఐపీఎల్‌‌ ట్రోఫీ అందుకోలేకపోయిన ఫ్రాంచైజీ పంజాబ్‌‌ కింగ్స్‌‌. స్టార్లు అందుబాటులో ఉన్నా  స్థాయికి తగ్గట్టు ఆడలేకపోతున్న పంజాబ్‌‌ 2014లో ఫైనల్‌‌ వరకు రావడమే ఇప్పటిదాకా బెస్ట్‌‌ పెర్ఫామెన్స్‌‌. ఆ తర్వాత  కింగ్స్‌‌ ఆట మరింత దిగజారింది. గత మూడు సీజన్లలో అయితే ఆరో స్థానానికి పరిమితమైంది. గత రెండు సీజన్లలో టీమ్‌‌ను నడిపించిన లోకేశ్‌‌ రాహుల్‌‌ను వదులుకున్న  పంజాబ్‌‌ ఈ సారి మయాంక్‌‌ అగర్వాల్‌‌కు కెప్టెన్సీ అప్పగించింది. అదే సమయంలో తమ టీమ్‌‌ రూపును మొత్తం మార్చేసింది. ఎంతో కసరత్తు చేసి మెగా వేలంలో ప్లేయర్లను ఎంచుకుంది. కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తున్న ఓపెనర్‌‌ మయాంక్‌‌కు జోడీగా అనుభవజ్ఞుడైన శిఖర్‌‌ ధవన్‌‌ను తీసుకుంది. వీరికి తోడు జానీ బెయిర్‌‌స్టో, కగిసో రబాడ, లియామ్‌‌ లివింగ్‌‌స్టోన్‌‌, డొమెస్టిక్‌‌ సెన్సేషన్‌‌ షారుక్‌‌ ఖాన్‌‌ తదితరులతో  2014 తర్వాత పంజాబ్‌‌ బలంగా కనిపిస్తోంది. ఈసారైనా విజేతగా నిలవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.  స్టార్లకు తోడు డొమెస్టిక్‌‌ ప్లేయర్లు కూడా సత్తా చాటితే పంజాబ్‌‌ ప్లే ఆఫ్స్‌‌ చేరుకోగలదు. 

బలాలు

ఈసారి పంజాబ్‌‌ టాపార్డర్‌‌ చాలా బలంగా కనిపిస్తోంది. మయాంక్‌‌ అగర్వాల్‌‌, ధవన్‌‌, బెయిర్‌‌స్టో ముగ్గురూ ఒంటిచేత్తో  మ్యాచ్​ను గెలిపించే సత్తా ఉన్నవాళ్లే. ఈ ముగ్గురికీ  ఇంటర్నేషనల్​తో పాటు ఐపీఎల్‌‌లో మంచి అనుభవం ఉంది. భారీ స్కోర్లు చేయడం ఎలాగో తెలుసు. అదే టైమ్‌‌లో పరిస్థితులకు తగ్గట్టు ఆట తీరును మార్చే సమర్థులు. గత సీజన్‌‌లో మిడిలార్డర్‌‌ వైఫల్యం టీమ్‌‌ను దెబ్బకొట్టింది. కానీ, ఈ సారి లివింగ్‌‌స్టోన్‌‌, ఒడియన్‌‌ స్మిత్‌‌, రిషి ధవన్‌‌ వంటి టాలెంటెడ్​ ప్లేయర్లను తీసుకున్న ఫ్రాంచైజీ మిడిల్‌‌ను కూడా బలోపేతం చేసుకుంది. ఈ ముగ్గురూ బౌలింగ్‌‌లోనూ రాణించగలిగే సామర్థ్యం ఉన్నవాళ్లు కావడం టీమ్​కు కచ్చితంగా ప్లస్‌‌ పాయింట్‌‌. అదే టైమ్‌‌లో యంగ్‌‌ సెన్సేషన్‌‌  షారుక్‌‌ ఖాన్‌‌ రూపంలో హార్డ్‌‌ హిట్టర్‌‌, ఫినిషర్‌‌ కూడా అందుబాటులో ఉన్నాడు. పెద్ద మొత్తం ఖర్చుచేసి రిటైన్​ చేసుకున్న షారుక్​ మంచి ఫామ్‌‌లో ఉండటం కలిసొచ్చే అంశం.  బౌలింగ్‌‌లో సౌతాఫ్రికా  స్టార్‌‌ పేసర్‌‌ కగిసో రబాడ, ఇండియా లెగ్‌‌ స్పిన్నర్‌‌ రాహుల్‌‌ చహర్ వంటి మ్యాచ్‌‌ విన్నర్లు ఉన్నారు. 

బలహీనతలు

రబాడ, రాహుల్‌‌ చహర్‌‌ను తీసుకున్నప్పటికీ  ఇతర జట్లతో పోలిస్తే పంజాబ్‌‌ బౌలింగ్‌‌ కాస్త బలహీనంగా ఉంది. రబాడ బౌలింగ్‌‌ను నడిపించబోతున్నాడు. ఒకవేళ రబాడకు గాయం అయితే ఆ స్థాయి బౌలర్‌‌ మరొకరు లేడు. మరో ఫారిన్‌‌ పేసర్‌‌గా నేథన్‌‌ ఎలిస్‌‌ను తీసుకున్నప్పటికీ ఐపీఎల్‌‌లో అతనికి తగిన అనుభవం లేదు. గత సీజన్‌‌లో కూడా జే రిచర్డ్‌‌సన్‌‌, రిలీ మెరిడెత్‌‌పై నమ్మకం ఉంచిన పంజాబ్‌‌ దెబ్బతిన్నది. ఇండియా స్పిన్‌‌ లెజెండ్‌‌ అనిల్‌‌ కుంబ్లే హెడ్‌‌ కోచ్‌‌గా ఉన్నప్పటికీ.. నాణ్యమైన స్పిన్నర్లను ఎంచుకోకపోవడంపై ఇప్పటికే విమర్శలు వచ్చాయి. రవి బిష్నోయ్‌‌ను వదులుకున్న ఫ్రాంచైజీ తమ ప్రధాన స్పిన్నర్‌‌గా రాహుల్‌‌ చహర్‌‌ను తీసుకుంది. కానీ, అతనికి తోడు మరో పేరున్న స్పిన్నర్‌‌ లేకపోవడం మైనస్‌‌. లివింగ్‌‌స్టోన్‌‌కు ఈ బాధ్యతలు అప్పగించే చాన్సుంది. కానీ, ఇండియా పిచ్‌‌లపై అతను ఏ మేరకు ప్రభావం చూపుతాడో చూడాలి. 

ఎవరితో ఎన్ని మ్యాచ్ లు 

గ్రూప్‌‑బిలో బరిలోకి దిగుతున్న పంజాబ్‌ ఆ గ్రూప్‌లోని చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, గుజరాత్‌తో పాటు గ్రూప్‌–ఎలోని ఢిల్లీతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. ముంబై, కోల్‌కతా, రాజస్తాన్‌, లక్నోతో ఒక్కో మ్యాచ్‌లో పోటీ పడుతుంది.

పంజాబ్‌‌‌‌ కింగ్స్‌‌ టీమ్‌‌

ఇండియన్స్‌‌: మయాంక్‌‌ అగర్వాల్‌‌ (కెప్టెన్‌‌), శిఖర్‌‌ ధవన్‌‌, అర్షదీప్‌‌ సింగ్‌‌, రాహుల్‌‌ చహర్‌‌, హర్‌‌ప్రీత్‌‌ బ్రార్‌‌, షారుక్‌‌ ఖాన్‌‌, ప్రభ్‌‌సిమ్రన్‌‌ సింగ్‌‌, జితేశ్‌‌ శర్మ, ఇషాన్‌‌ పోరెల్‌‌, సందీప్‌‌ శర్మ, రాజ్‌‌ అంగద్‌‌ బవా, రిషి ధవన్‌‌, ప్రేరక్‌‌ మన్కడ్‌‌, వైభవ్‌‌ అరోరా, వ్రితిక్‌‌ చటర్జీ, బాల్‌‌తేజ్‌‌ ధండ, అన్ష్‌‌ పటేల్‌‌. అథర్వ తైడె.

ఫారిన్‌‌ ప్లేయర్లు: కాగిసో రబాడ,  జానీ బెయిర్‌‌స్టో, లివింగ్‌‌స్టోన్‌‌, ఒడియన్‌‌ స్మిత్‌‌, నేథన్‌‌ ఎలిస్‌‌, భానుక రాజపక్స, బెన్నీ హోవెల్‌‌.