కేసీఆర్​ అవినీతి పాలనపై మరో శ్వేతపత్రం విడుదల చేస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

కేసీఆర్​ అవినీతి పాలనపై మరో శ్వేతపత్రం విడుదల చేస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • కేసీఆర్​ అవినీతి పాలనపై మరో శ్వేతపత్రం విడుదల చేస్తాం
  • కాళేశ్వరంపై నిలదీసినందుకే ‘కృష్ణా’ వివాదం లేవనెత్తిన్రు
  • పాలమూరు రంగారెడ్డి’ నుంచి ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు
  • వనపర్తి జిల్లా కొత్తకోటలో న్యాయ యాత్రలో పాల్గొన్న మంత్రి పొంగులేటి

వనపర్తి/కొత్తకోట, వెలుగు:  పదేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఇప్పటికే రెండు శ్వేతపత్రాలు విడుదల చేశామని, త్వరలోనే కేసీఆర్ పాపాలపై మరో శ్వేతపత్రం విడుదల చేయబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. గురువారం రాత్రి వనపర్తి జిల్లా కొత్తకోటలో కొనసాగిన ‘కాంగ్రెస్​ న్యాయ్​ యాత్ర’లో ఆయన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తకోట చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. వైఎస్​రాజశేఖర్ ​రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పాలమూరు ప్రజల కష్టాలను గుర్తించి, ఇక్కడి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేశారని చెప్పారు. కేసీఆర్​సీఎం అయ్యాక వైఎస్​హయాంలో నిర్మించిన కాలువల్లో కంపను పీకి, ఆ ప్రాజెక్టులు తామే పూర్తిచేశామంటూ గొప్పలు చెప్పుకున్నారని మండిపడ్డారు.

పదేండ్ల పాలనలో ‘పాలమూరు– రంగారెడ్డి’ ప్రాజెక్టు కోసం రూ.27వేల కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్.. ఒక్క ఎకరాకైనా నీరు అందించారా అని ప్రశ్నించారు. కృష్ణా పరివాహక ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించినట్లు ఒక్క పత్రమైనా చూపగలరా అని నిలదీశారు. బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్​ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి విషప్రచారం మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్​కొనుగోలు పేరుతో రూ.వేల కోట్లను పక్కదారి పట్టించారని చెప్పారు. పేదలకు ఇళ్లు కట్టించకుండా, ప్రగతి భవన్​వంటి భారీ నిర్మాణాలకు పెద్ద ఎత్తున ఖర్చు చేశారని, అదే అదునుగా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన విషయంపై తాము నిలదీయడాన్ని తట్టుకోలేక, బీఆర్ఎస్ లీడర్లు కృష్ణ పరివాహక ప్రాంత జలాల వివాదాన్ని సృష్టించారని మండిపడ్డారు. జనం అన్నీ గమనిస్తున్నారని, ప్రజా ప్రభుత్వం జోలికొస్తే వారే తరిమి కొడతారని చెప్పారు.

సీఎం రేవంత్​రెడ్డి ఇచ్చిన హామీలను వంద రోజుల్లో నెరవేరుస్తారని తెలిపారు. లోక్​సభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో పచ్చగడ్డి పెట్టారని, ఈసారి ఎండు గడ్డి పెట్టి ఇంట్లో కూర్చోబెట్టాలన్నారు. రాముడు అంటే ఎవరికీ తెలిదన్నట్టుగా,  రాముడు తమ పేటెంట్ గా బీజేపీ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున చాన్స్​ఉంటే వంశీచందర్ రెడ్డి రంగంలో ఉంటారని, ఆయనకు మద్దతు ఇచ్చి గెలిపించాలని పొంగులేటి విజ్ఞప్తి చేశారు. ధరణిలోని లోపాలపై రెండు, మూడు రోజుల్లో కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, వాకిటి శ్రీహరి, అనిరుధ్​రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి పాల్గొన్నారు.