
మహాసభ సదస్సులో మంత్రి గంగుల హామీ
ఒకే కులం ఒకే సంఘం నినాదంతో ప్రొగ్రామ్
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ తో మాట్లాడి మున్నూరు కాపులకు కార్పస్ ఫండ్ ఇప్పించేలా కృషి చేస్తానని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. ఆదివారం హైదరాబాద్లో తెలంగాణ మున్నూరు కాపు మహాసభ ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ‘ఒకే కులం ఒకే సంఘం’ అనే నినాదంతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్నూరు కాపులంతా ఇప్పటి దాకా అనేక సంఘాలుగా ఉండటంతో మున్నూరు కాపుల అభివృద్ధి స్పీడ్గా జరగలేదదన్నారు. ప్రస్తుతం అందరూ కలసి ఒకే కుల సంఘంగా ముందుకు సాగాలని నిర్ణయం తీసుకోవడం శుభపరిణామన్నారు. ఇన్నేండ్లు అన్ని పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా రాజకీయ అవసరాలకు వాడుకున్నాయన్నారు. కానీ సీఎం కేసీఆర్ బీసీ కులాలను గుర్తించి, ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. మరోవైపు మున్నూరు కాపు సంఘాల అభివృద్ధి, నిర్మాణం కోసం సదస్సులో రిపోర్టు రెడీ చేశారు. దాని ప్రకారం రానున్న మూడు నెలల్లో సంఘం ఎన్నికలుంటాయని ప్రతినిధులు చెప్పారు. ఎన్నికలు జరిగే వరకు మున్నూరుకాపు మహాసభ రాష్ట్ర కన్వీనర్గా పి.పురుషోత్తం వ్యవహరిస్తారని తెలిపారు.గతంలో ఏ సీఎం చేయని విధంగా వివిధ బీసీ కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలపేరుతో 5 ఎకరాల స్థలంతో పాటు రూ. 5 కోట్లు కేటాయించడం సంతోషకరమైన విషయమని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. ఈ విషయంలో కేసీఆర్ను అభినందిస్తున్నట్లు చెప్పారు.
సావిత్రీబాయి స్ఫూర్తితోనే గురుకులాలు
సావిత్రీబాయి పూలేను స్ఫూర్తిగా తీసుకుని బలహీన వర్గాలకు విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ గురుకులాలు ప్రారంభించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం సావిత్రిబాయి పూలే 190వ జయంతి సందర్భంగా గంగుల హైదరాబాద్లోని తన ఛాంబర్లో పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమవుతుందని నమ్మి, పూణెలో తొలిసారిగా అమ్మాయిలకు స్కూల్ ప్రారంభించారని గుర్తు చేశారు. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా పోరాడినా గొప్ప సంస్కర్త అని కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పూలే.. విద్యతోపాటు మానవ హక్కులు, సామాజిక సమస్యలపై స్త్రీలను చైతన్యపరచడానికి మహిళా సేవా మండల్ అనే సంఘాన్ని స్థాపించి యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.