గౌరవెల్లి ప్రారంభానికి అడ్డంకులు తొలగేనా?.. ప్రాజెక్టు పూర్తయినా షురూ చేయలేని పరిస్థితి

గౌరవెల్లి ప్రారంభానికి అడ్డంకులు తొలగేనా?.. ప్రాజెక్టు పూర్తయినా షురూ చేయలేని పరిస్థితి
  • ఎన్జీటీలో నిర్వాసితుల కేసులతో జాప్యం
  • పరిహారం సంగతి తేలిస్తేనే ఆరంభానికి గ్రీన్​సిగ్నల్
  • మంత్రి పొన్నం ముందుకు ఇష్యూ

సిద్దిపేట, వెలుగు : మెట్టప్రాంతమైన హుస్నాబాద్  నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి ఉద్దేశించిన గౌరవెల్లి ప్రాజక్టు ప్రారంభానికి చిక్కుముళ్లు వీడడం లేదు. పనులు పూర్తయి ట్రయల్ రన్  నిర్వహించినా ఎన్జీటీలో నిర్వాసితులు కేసులు వేయడంతో ప్రాజెక్టు ప్రారంభించలేని పరిస్థితి నెలకొంది. ఈ  కేసులు తేలే వరకు ప్రారంభానికి ముహూర్తం ఖరారయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గౌరవెల్లి రిజర్వాయర్  ప్రారంభమైతే  హుస్నాబాద్‌‌‌‌  నియోజకవర్గం పరిధిలో 1.20 లక్షల ఎకరాలకు ప్రయోజనం కలుగుతుంది. ఎడమ కాలువ ద్వారా 18 వేల ఎకరాలకు, కుడి కాలువ ద్వారా 90 ‌‌‌‌వేల ఎకరాలకు నీరు అందించేలా ప్రణాళిక రూపొందించారు. గౌరవెల్లి రిజర్వాయర్‌‌ ‌‌నుంచి మూడు జిల్లాలో పరిధిలో  104 గ్రామాలకు నీరు అందే అవకాశం ఉంది. హుస్నాబాద్‌‌‌‌, అక్కన్నపేట మండలాల్లోని 17, కోహెడలో  8, చిగురుమామిడిలో 10, భీమదేవరపల్లిలో 12, సైదాపూర్‌‌‌‌లో 3, ధర్మసాగర్‌‌‌‌లో 13, ఘనపూర్‌‌‌‌లో 36 , జాఫర్‌‌‌‌గఢ్‌‌ 1, హన్మకొండల్లో 1, రఘునాథపల్లి మండలంలో  నాలుగు  గ్రామాలకు గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా నీరు అందించేందుకు ప్లాన్  చేశారు.

పర్యావరణ అనుమతులు తీసుకోకపోవడంతో..

హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేకపోవడం  కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాజెక్టు  ప్రారంభించాలని  గత బీఆర్ఎస్  ప్రభుత్వం భావించి యుద్ధప్రాతిపదికన పనులు  పూర్తి చేసి ట్రయల్ రన్  నిర్వహించినా  సర్కారుకు ఎన్జీటీ షాకిచ్చింది. రీడీజైన్ తో ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించినా పర్యావరణ అనుమతులు తీసుకోకపోవడం, నిర్వాసితులందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు అందించకపోవడం, ప్రాజెక్టు డీపీఆర్​లు సైతం అధికారులు ఇవ్వకపోవడం వంటి కారణాలతో గుడాటిపల్లి  నిర్వాసితులు బద్దం భాస్కర్  రెడ్డి, కొత్త సంజీవరెడ్డి,  ఉస్కె సురేందర్  రెడ్డి, రాగి శివ.. గ్రీన్  ట్రైబ్యునల్​ను ఆశ్రయించారు. ఎన్జీటీ  ఆర్డర్లను  పట్టించుకోకుండా  పనులు సాగుతుండడంతో  జీఆర్ఎంబీ (గోదావరి రీవర్  మేనేజ్ మెంట్ బోర్డు) ఆగ్రహించి  గౌరవెల్లి ప్రాజెక్టు కట్ట వద్ద 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి  ప్యాచ్  వర్క్  పనులను నిలిపివేసింది. ఆరు నెలలుగా ప్రాజెక్టు వద్ద ఎలాంటి పనులు సాగకపోగా కట్టపై ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలతో పరిస్థితిని  ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

యువతుల పరిహారంపై పేచీ

గుడాటిపల్లిలో నిర్వహించిన సర్వే జాబితాల ప్రకారం 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ  ఇవ్వాల్సి ఉన్నా పెండ్లి జరిగిందన్న సాకుతో కొందరు   యువతులకు ప్యాకేజీ ఇవ్వడానికి  ప్రభుత్వం నిరాకరించింది. గతంలో 2010 నుంచి 2015 వరకు 18 సంవత్సరాలు నిండిన 141 మందికి రూ.6  లక్షల పరిహారం  అందించారు. రెండు సంవత్సరాల క్రితం నిర్వహించిన సర్వే  ప్రకారం  85 మంది యువతులకు  పెండిండ్లు అయ్యాయి. కటాఫ్ తేదీని పొడిగించడంతో మరో 30 మందితో కలుపుకుని మొత్తం 120  మంది పెండ్లయిన యువతులు  ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం ఎదురుచూస్తుండగా  పెండ్లై స్థానికంగా ఉండడం లేదన్న ఒకేఒక్క కారణంతో  ప్యాకేజీకి అనర్హులని అధికారులు తేల్చి వేశారు.   

మంత్రి చొరవ తీసుకుంటే పరిష్కారం

హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిపదవిని చేపట్టిన పొన్నం ప్రభాకర్ కు  గౌరవెల్లి ప్రాజెక్టును ప్రారంభించడం అగ్ని పరీక్షగా మారింది. గతంలో నిర్వాసితుల పక్షాన పోరాటం చేసిన పొన్నం ప్రభాకర్.. ఇప్పుడు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అందరి చూపులు ఆయనపైనే ఉన్నాయి. ఎన్జీటీ కేసులు, పరిహారాలు, ప్యాకేజీల విషయంపై ఆయన చొరవ తీసుకుంటే సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది.

12 ఏండ్ల క్రితమే  ప్రాజెక్టు ప్రారంభించాలని నిర్ణయం

హుస్నాబాద్‌‌‌‌  నియోజకవర్గం పరిధిలోని  అక్కన్న పేట మండలంలో  గౌరవెల్లి ప్రాజెక్టును 2007 లో  1.45 టీఎంసీల సామర్థ్యంతో   నిర్మించాలని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఎకరాకు రూ.2.1‌‌‌‌లక్షల చొప్పున పరిహారం అందించారు.  2014 లో ప్రాజెక్టు సామర్థ్యాన్ని 8.2 టీఎంసీలకు పెంచి అప్పటి టీఆర్ఎస్  ప్రభుత్వం రీడిజైన్ చేసింది.  సామర్థ్యం పెంచడంతో కట్ట పొడవు 10.5 కిలోమీటర్లు, వెడల్పు 6 మీటర్లు, ఎత్తు  42 మీటర్లతో గౌరవెల్లి రిజర్వాయర్‌‌  ‌‌కట్టను నిర్మించారు. మిడ్ మానేరు నుంచి తోటపల్లి బ్యాలెన్సింగ్  రిజర్వాయర్  మీదుగా హుస్నాబాద్​ మండలం రేగొండ పంప్ హౌజ్ కు నీటిని తరలించాలని ప్రాజెక్టును రీడిజైన్  చేశారు. తోటపల్లి నుంచి రేగొండ వరకు 16 కిలోమీటర్ల మేర అప్రోచ్  కెనాల్, టన్నెల్  ద్వారా నీటిని తరలించే పనులు పూర్తి చేశారు. రీడిజైన్  పేరుతో ప్రాజెక్టు సామర్థ్యం పెంచడంతో పలు గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. దీంతో ప్రభుత్వం భూసేకరణ జరిపి నిర్వాసితులకు ఎకరాకు రూ.6.95 లక్షల పరిహారం అందించింది.  గౌరవెల్లి  ప్రాజెక్టు కోసం మొత్తం 3,870 ఎకరాలను సేకరించి పరిహారం అందజేయగా కొందరు రైతులు  కోర్టును ఆశ్రయించారు.