
బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ అగ్రనేతలు ఆగ్రహంగా ఉన్నారు. బీజేపీ శ్రేణులు మండిపోతున్నాయి. ఆయన ఏమైనా సాధారణమైన వ్యక్తా అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ కార్యకర్తలు. కరీంనగర్ పార్లమెంట్ నుంచి లోక్ సభకు ఎన్నికైన ఎంపీ.. అంతేకాకుండా జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు.. అలాంటి వ్యక్తిని కారణాలు చెప్పకుండా అర్థరాత్రి.. ఇంటి మీదకు వచ్చి.. బలవంతంగా అరెస్ట్ చేయటం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బండి సంజయ్ అరెస్టు విషయంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు బీజేపీ నేతలు. ప్రశ్నాపత్రాల లీకేజీకీ, బండి సంజయ్‌కీ ఏంటి సంబంధం అని నిలదీస్తున్నారు బీజేపీ నేతలు. ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
అర్థరాత్రి సమయంలో ఓ ఎంపీని అరెస్ట్ చేయటంపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఏది ఏమైనా అర్థరాత్రి సమయంలో బండి సంజయ్‌ని ఇంటికి వచ్చి మరీ బలవంతంగా అరెస్టు చెయ్యడం బీజేపీ వర్గాలను షాక్ కు గురి చేసింది. ఊహించని పరిణామంగా చెబుతున్నారు.
బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా.. ఏప్రిల్ 5వ తేదీ బుధవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు పార్టీ శ్రేణులు.