నిర్మల్ కొయ్యబొమ్మల పరిశ్రమకు..మంచి రోజులు వచ్చేనా?

నిర్మల్ కొయ్యబొమ్మల పరిశ్రమకు..మంచి రోజులు వచ్చేనా?
  •     గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రోత్సాహం కరువు
  •     ప్రత్యేక పాలసీ తెస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని ప్రకటన
  •     ఈ సీటులో బీజేపీ గెలవడంతో మోదీ హామీపై కార్మికుల ఆశలు
  •     వెంటనే పాలసీ రూపొందించి అమలు చేయాలని విజ్ఞప్తి

నిర్మల్, వెలుగు : నిర్మల్  కొయ్యబొమ్మల పరిశ్రమ పుట్టెడు కష్టాల్లో ఉంది. సంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తున్న కొయ్యబొమ్మలకు బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైంది. ముడిసరుకుల ధరలు పెరిగిపోవడం,  పొనికి కర్ర కొరత ఏర్పడుతుండడంతో పాటు ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన విధానం సరిగా లేకపోవడంతో పరిశ్రమ మనుగడ  ప్రశ్నార్థకమవుతోంది.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్​ కొయ్యబొమ్మల పరిశ్రమ కోసం ప్రత్యేక పాలసీ ప్రకటిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో నిర్మల్​ నుంచి బీజేపీ అభ్యర్థి ఆలేటి మహేశ్వర్  రెడ్డి విజయం సాధించడంతో ప్రధాని హామీపై కార్మికులు ఆశలు పెట్టుకున్నారు. 

ధరల పెరుగుదలతో తగ్గుతున్న గిరాకీ

నిర్మల్ కొయ్య బొమ్మలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ తయారయ్యే కొయ్యబొమ్మలను విదేశాల్లో కూడా విక్రయిస్తుంటారు. అంతర్జాతీయ మార్కెట్ లో ఈ కొయ్యబొమ్మ లకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ సంప్రదాయ రీతిలో ఉన్న మోడల్స్ కు క్రమంగా ఆదరణ తగ్గుతోంది. అలాగే కొయ్యబొమ్మల తయారీ కోసం ఉపయోగించే ముడిసరుకు ధరలు, ఇతర ఖర్చులు భారీగా పెరగడంతో కొయ్యబొమ్మల ధరలు కూడా పెంచాల్సి వస్తోంది. దీంతో బొమ్మలకు గిరాకీ  క్రమంగా తగ్గుతోంది.

ఈ పరిశ్రమను బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి కార్యాచరణను చేపట్టకపోతుండడం కూడా ఈ పరిశ్రమకు శాపంగా మారింది. ఈ నేపథ్యంలోనే గత నెల 26 బీజేపీ తరఫున అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. కొయ్యబొమ్మల పరిశ్రమను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇందు కోసం ప్రత్యేక పాలసీ రూపొందిస్తామని ఆయన ప్రకటించారు.

ప్రధాని హామీతో నిర్మల్  కొయ్యబొమ్మల కళాకారుల కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురించాయి. నిర్మల్ లో బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ప్రధాని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కొయ్యబొమ్మల కళాకారులు కోరుతున్నారు. 

కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో  శిక్షణ

ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితం కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో ఎక్స్ పోర్ట్  ప్రమో షన్  కౌన్సిల్  ఫర్  హ్యాండీక్రాఫ్ట్స్  సంస్థ..  మార్కెట్ లో డిమాండ్ కు అనుగుణంగా నిర్మల్  కొయ్యబొమ్మలకు కొత్త అందాలు తేవాలని నిర్ణయించింది. ఇంటర్నేషనల్  లేస్ ట్రేడ్ సెంటర్  ఆధ్వర్యంలో  గురుశిష్య హస్త శిల్ప ప్రశిక్షణ కార్యక్రమం కింద నిర్మల్ కొయ్య బొమ్మల కేంద్రాన్ని ప్రత్యేకంగా ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి  కేవలం నిర్మల్  కొయ్యబొమ్మల కేంద్రాన్ని మాత్రమే ఎంపిక చేయడం విశేషం.

అలాగే ఆంధ్రప్రదేశ్  లోని తిరుపతిలో లక్ష్మీగారిపల్లె, విశాఖ జిల్లాలోని ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలను ఈ పథకం కింద ఎంపిక చేశారు. తెలంగాణలో కేవలం నిర్మల్  కొయ్యబొమ్మలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి కొయ్యబొమ్మల రూపురేఖలను మరింత ఆధునికీకరించేందుకు సిద్ధమవుతున్నారు. గురుశిష్య హస్త శిల్ప ప్రశిక్షణలో భాగంగా 25 నుంచి 30 సంవత్సరాలలోపు ఉన్న యువ కళాకారులకు మూడు నెలల పాటు నిర్మల్  కొయ్యబొమ్మల కేంద్రంలో శిక్షణ ఇచ్చారు.

శిక్షణ పూర్తయిన తర్వాత వారందరికీ ఆర్టిజన్  ఐడీ కార్డులను కేంద్ర జౌళి శాఖ అం దించింది. అలాగే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో కూడా కొయ్యబొమ్మల విక్రయాలకు కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో  ఎక్స్ పోర్ట్  ప్రమోషన్ కౌన్సిల్  ఫర్  హ్యాండీక్రాఫ్ట్స్  సంస్థ చర్యలు తీసుకోవాలని మొదట్లో భావించారు. నిర్మల్ లోని కొయ్యబొమ్మల కేంద్రం వర్క్ షాప్ లో గురుశిష్య హస్త శిల్ప ప్రశిక్షణ కార్యక్రమాన్ని ఇప్పటికే నిర్వహించారు.

ఎంత శిక్షణ ఇచ్చినా పొనికి కర్రను అందుబాటులోకి తేకపోవడంతో పాటు ముడిసరుకుల రేట్ల తగ్గించేందుకు చర్యలు తీసుకోకుంటే నిర్మల కొయ్యబొమ్మల పరిశ్రమ మనుగడ సాధించదని కళాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ సాధ్యమైనంత త్వరగా అమలయ్యేలా నిర్మల్  నియోజకవర్గ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చూడాలని కళాకారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

వెంటాడుతున్న పొనికి కలప కొరత

పదేళ్లుగా నిర్మల్  కొయ్యబొమ్మల పరిశ్రమను పొనికి కలప కొరత వెంటాడుతోంది. ప్రస్తుతం అడవుల్లో పొనికి చెట్ల సంఖ్య తగ్గిపోతుండడం, ప్రత్యేకంగా ప్లాంటేషన్  చేపట్టకపోతుండడంతో  కలప కొరత ఏర్పడింది. ఒకటి రెండు టింబర్  డిపోలలో మాత్రమే పొనికి కలప నిల్వలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఉపాధి హామీ పథకం కింద నిర్మల్ లోని పలుచోట్ల పొనికి ప్లాంటేషన్  చేపట్టినా వాటి పెంపకం ఇప్పట్లో పూర్తికాదని కళాకారులు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొనికి ప్లాంటేషన్ ను మరింత విస్తృతంగా చేపడితే ఈ కలపకు కొరత తీరుతుందని పేర్కొంటున్నారు.

ప్రధాని హామీ నెరవేర్చాలి

కొయ్యబొమ్మల పరిశ్రమను ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. కొయ్యబొమ్మల పరిశ్రమను ప్రోత్సహించేందుకు కొత్త పాలసీ రూపొందిస్తామని ప్రధాని ప్రకటించారు. వెంటనే ఆ పాలసీని రూపొందించి అమలు చేయాలి. ప్రధాని హామీ మా కళాకారుల జీవితాల్లో కొత్త ఆశలు నింపింది. ఇప్పటికే ఉపాధి లేక, బొమ్మలకు సరైన మార్కెట్  లేక నష్టాల పాలవుతున్నాము.   

పెంటయ్య, కొయ్య బొమ్మల కళాకారుడు, నిర్మల్ 

పరిశ్రమను కాపాడాలి

సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నిర్మల్  కొయ్యబొమ్మల పరిశ్రమను ఆదుకుంటామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీ మా జీవితాల్లో ఆశలు రేకెత్తించింది. ఆయనకు జీవితాంతం కళాకారుల కుటుంబాలన్నీ రుణపడి ఉంటాయి. ఇచ్చిన హామీ మేరకు వెంటనే పరిశ్రమ రక్షణకు చర్యలు మొదలు పెట్టాలి.  

నాంపల్లి రాజశేఖర్, కొయ్య బొమ్మల కళాకారుడు, నిర్మల్