బీజేపీ దాడులకు దిగితే.. TRS ఎమ్మెల్యేలు బయట తిరుగగలరా?

బీజేపీ దాడులకు దిగితే.. TRS ఎమ్మెల్యేలు బయట తిరుగగలరా?

హైదరాబాద్: చేతగానితనంతోనే టీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్పై దాడి చేశారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ నేతలపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రాళ్లు విసిరి దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. "బీర్లు, బిర్యానీలు తినిపించి టీఆర్ఎస్ నాయకులు సంజయ్పై దాడులు చేయించారని, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు దేనికి పనికిరాని మినిస్టర్ అని మండిపడ్డారు. బండి సంజయ్పై కుట్ర చేస్తే ఆయన అగుతారా..? అని ప్రశ్నించారు. పోలీసులకు దాడి విషయం ముందే తెలుసని రాజాసింగ్ ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మరో సంవత్సరం మాత్రమే ఉంటుంది. పోలీసులు.. ఈ రోజును యాది పెట్టుకోవాలని అన్నారు. బీజేపీతో పెట్టుకుంటే.. తమ  ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో ఆలోచన చేయాలని.. బీజేపీ ఇదే పని చేస్తే మీ ఎమ్మెల్యేలు బయట తిరుగుతారా అని ప్రశ్నించారు. రాజకీయం చేయాలంటే సరిగ్గా చేయండని, లేకపోతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తిప్పి తిప్పి కొడుతామని". రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు.

పాదయాత్రలో దేవరుప్పల సభలో బండి సంజయ్‌ ప్రసంగిస్తుండగా.. టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని బండి సంజయ్‌ ప్రశ్నించారు. దేశంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని సంజయ్‌ను టీఆర్‌ఎస్‌ నేత అడగడంతో వివాదం మొదలైంది. టీఆర్ఎస్ కార్యకర్తలు సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ నేతలపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రాళ్లు విసిరారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. రాళ్ల దాడిలో కొందరు నేతల తలలు పగిలిపోయాయి. రక్తం కారడంతో అంబులెన్స్‌లో గాయపడ్డవారిని హాస్పిటల్కు తరలించారు.