
- పార్టీలో ఎలాంటి పంచాదీ లేదు..కేసీఆర్ నిర్ణయాన్ని శిరసావహిస్త
హైదరాబాద్, వెలుగు: కేటీఆర్‌కు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానని ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని శిరసావహిస్తానని ఆయన చెప్పారు. మంగళవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో మీడియాతో హరీశ్‌రావు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పంచాది లేదన్నారు. తాను పార్టీ మారతున్నట్లు సోషల్ మీడియాతో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ‘‘25 ఏండ్లుగా కేసీఆర్ సూచనలతో పార్టీలో పనిచేస్తున్న. ఇకపై కూడా అలాగే పనిచేస్త. పార్టీ మారుతారనే తప్పుడు ప్రచారంపై ఇప్పటికే మా పార్టీ నాయకులు డీజీపీకి కంప్లైంట్ చేశారు” అని తెలిపారు. చిల్లర ప్రచారాన్ని బంద్ పెట్టాలని సూచించారు.
సెక్రటేరియెట్ మొఖాన్ని కూడా సీఎం చూస్తలే
‘‘సీఎం రేవంత్ రెడ్డికి అందాల పోటీల మీద ఉన్న సోయి రైతుల మీద లేదు. అందాల పోటీల మీద పోలీస్ కమాండ్ కంట్రోల్, జూబ్లీహిల్స్ ప్యాలస్ లో రివ్యూలు పెడ్తున్నరు. రైతు సమస్యలపైన సీఎం ఎందుకు రివ్యూ మీటింగులు పెట్టడం లేదు?” అని హరీశ్‌రావు ప్రశ్నించారు. సెక్రటేరియెట్ మొఖాన్ని కూడా సీఎం రేవంత్‌రెడ్డి చూడటం లేదని విమర్శించారు. ‘‘దేశానికి అన్నం పెట్టే రైతు కోసం, ఆరుగాలం కష్టపడే రైతు కష్టం తీర్చడానికి ఈ ముఖ్యమంత్రికి సమయం లేకపోవడం దురదృష్టకరం. కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేకపోవడంతో రైతులు రోజుల తరబడి ఎండలో ఉంటూ పిట్టల్లా రాలిపోతున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న రైతుల మరణాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి” అని ఆయన అన్నారు. ‘‘వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా అమలు చేశారా? రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలకు రాహుల్ గాంధీ సాక్ష్యం. ఇచ్చిన హామీలు అమలు చేయాలని ముఖ్యమంత్రిని అడిగితే అప్పులు పుట్టడం లేదని అంటున్నడు. చివరికి పాకిస్తాన్ ను నమ్మి అప్పు ఇస్తున్నారు కానీ రేవంత్ రెడ్డిని నమ్మి అప్పు ఇవ్వడం లేదు” అని హరీశ్‌రావు దుయ్యబట్టారు.
రైతుల సమస్యలు డైవర్ట్ చేస్తున్నరు
‘‘ధాన్యం కొనుగోలు చేసి రైతులకు చెల్లించాల్సిన రూ. 4 వేల కోట్లు, బోనస్ కింద ఇవ్వాల్సిన రూ. 767 కోట్లు ఎప్పుడు చెల్లిస్తారని హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘‘మేం రైతుల సమస్యల గురించి ఆవేదనతో మాట్లాడితే మంత్రి ఉత్తమ్ సమస్యను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నడు. ధాన్యపు రాశుల వద్దే శవాలుగా మారుతున్న రైతుల దీనస్థితికి మీ నిర్లక్ష్య వైఖరే కారణం” అని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.