2023 క్రికెట్ వరల్డ్ కప్ కు.. రిషబ్ పంత్ రెడీ అవుతాడా..?

 2023 క్రికెట్ వరల్డ్ కప్ కు.. రిషబ్ పంత్ రెడీ అవుతాడా..?

2023 వన్డే ప్రపంచకప్ కు యువ క్రికెటర్ రిషబ్ పంత్ రెడీ అవుతాడా..? ఆ లోపు అతడు కోలుకుంటాడా..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు క్రికెట్ ఫ్యాన్స్ నుంచి ఎదురవుతున్నాయి. గతేడాది రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న పంత్.. పూర్తి ఫిట్ నెస్ సాధించే పనిలో పడ్డాడు. బీసీసీఐ ఊహించిన దానికంటే త్వరగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ పంత్ త్వరగా కోలుకుని.. ఫిట్ నెస్ సాధిస్తే.. 2023 వన్డే ప్రపంచకప్ లో అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. భారత్ లో జరిగే 2023 వన్డే ప్రపంచ కప్ కోసం పంత్ ను సిద్ధం చేయాలనుకుంటోంది. అయితే.. పంత్ మరికొంత కాలం పాటు విశ్రాంతి (కోలుకోవడం కోసం) తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 

ముఖ్యంగా పంత్.. తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తున్నాడు. ఎవరి సహయం లేకుండా మెట్లు ఎక్కుతున్నాడు. నిపుణుల సమక్షంలో నిత్యం ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాడు. అప్పుడప్పుడు అక్వా థెరపీ చేయించుకుంటున్నాడు. దాంతో పాటు స్విమ్మింగ్ చేస్తున్నాడు. టేబుల్ టెన్నిస్ కూడా ఆడుతున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే చాలా వేగంగా కోలుకుంటున్నాడు పంత్.  

పంత్ ఇటీవల ఊతకర్రలు, ఎవరి సాయం లేకుండా నడుస్తూ కనిపించాడు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన హెల్త్ అప్ డేట్స్ ఇస్తున్నాడు. తన ట్రైనింగ్‌ సంబంధించిన వీడియోను తాజాగా పంత్‌ షేర్‌ చేశాడు. ఎటువంటి సపోర్ట్‌ లేకుండా మెట్లు ఎ‍క్కుతుండడం ఈ వీడియోలో  కన్పించింది. అయితే మెట్లు ఎక్కే క్రమంలో ముందుగా పంత్‌ కాస్త ఇబ్బంది పడినా... ఆ తర్వాత మాత్రం కొంచెం ఈజీగా ముందుకు వెళ్లాడు. ఈ వీడియోకు "నాట్ బ్యాడ్ యార్ రిషబ్. చిన్న పనులే కొన్నిసార్లు కష్టంగా ఉంటాయి" అని పంత్ క్యాప్షన్ ఇచ్చాడు.

ఇక ఈ వీడియో చూసిన పంత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనుకున్న దానికన్నా వేగంగా రిషబ్ కోలుకుంటున్నాడని.. త్వరలోనే మైదానంలో కనిపిస్తాడని కామెంట్లు చేస్తున్నారు. పంత్‌ గాయం కారణంగా ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియా సిరీస్‌, ఐపీఎల్‌, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు పంత్‌ దూరమయ్యాడు. రిషబ్‌ తిరిగి మళ్లీ వన్డే వరల్డ్‌కప్‌కు మైదానంలో అడుగుపెట్టే ఛాన్స్‌ ఉంది.